కాఫీ తాగడంపై జన్యు ప్రభావం
స్కాట్‌లాండ్: మన చుట్టూవున్న వాతావరణం చలి, చలిగా ఉన్నప్పుడు వేడి వేడి కాఫీ తాగాలని అనిపించడం ఎవరికైనా అనుభవమే. అయితే కొందరు తక్కువ తాగుతారు. కొందరు ఎక్కువ కప్పులు తాగుతారు. మరి కొందరు గబ,గబా తాగేస్తారు. ఇంకొందరు అసలే తాగరు. కాఫీ తాగడంలో వ్యక్తికి, వ్యక్తికి మధ్య వ్యత్యాసానికి కారణం ఏమిటీ? మన అలవాట్లా, మన ప్రవర్తనా? ఇదే అంశాన్ని తేల్చుకుందామని ఎడిన్‌బర్గ్ యూనివర్శిటీకి చెందిన ‘యుషర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ హెల్త్ సెన్సైస్ ఇన్‌ఫార్మిటిక్స్’కు చెందిన నిపుణులు పరిశోధనలు చేశారు.
మానవ డీఎన్‌ఏలో ఉండే ‘పీడీఎస్‌ఎస్2’ అనే జన్యు రకం మానవులు కాఫీ తాగడాన్ని ప్రభావితం చేస్తోందని, ఈ జన్యువును కలిగిన వారు అది లేనివారికన్నా తక్కువ కప్పుల కాఫీ తాగుతారని పరిశోధనల్లో తేలింది. మరో విధంగా చెప్పాలంటే కాఫీ తాగడాన్ని ఈ జన్యువు నియంత్రిస్తుంది. మన ఆహారపు అలవాట్లు, రుచులకు మనలోని జన్యువులకు ప్రత్యక్ష సంబంధం ఉంటుందని శాస్త్రవేత్తలు ఎప్పుడో కనిపెట్టినప్పటికీ కాఫీ తాగే అలవాటుపై జన్యువుల ప్రభావం ఎలా ఉంటుందో విఫులంగా పరిశోధించడం దాదాపు ఇదే మొదటిసారి.
దక్షిణ ఇటలీలోని 370 మంది, ఈశాన్య ఇటలీకి చెందిన 843 మంది కాఫీ తాగే అలవాటున్న వారి డీఎన్‌ఏలోని జన్యువుల క్రమాన్ని శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. పీడీఎస్‌ఎస్ 2 రకం జన్యువు ఉన్నవారు తక్కువ కప్పుల టీ తాగగా ఇది లేని వారు ఎక్కువ కప్పుల టీ తాగుతున్నట్లు తేలింది. నెదర్లాండ్స్‌కు చెందిన 1731 మందిపై కూడా ఈ పరిశోధనలు జరపగా ఒకే రకమైన ఫలితాలు వచ్చాయి. అసలు టీ అనేది తాగడానికి పరిస్థితులు, పరిసరాలు, సంస్కృతి, అలవాటు కారణం అనే విషయం తెల్సిందే.
అయితే కాఫీ ఎక్కువ, తక్కువ తాగడానికి మానవ జీర్ణక్రియకున్న ప్రత్యక్ష సంబంధం ఏమిటో తెలుసుకునేందుకు ఈ అంశంలో మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కాఫీ తాగే అలవాటు మనుషుల్లో ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటుందన్న విషయం తెల్సిందే. అమెరికాలో 65 శాతం మంది ప్రజలు రోజుకు ఒక్క కప్పయిన కాఫీ తాగుతారు.