ద్రవమూ ఘనమూలాంటి జీవితం
మంచి కథ
జీవితమంటే ఏమిటి? సాధువులు, సన్యాసులు, దొంగలు, పెద్ద మనుషులతో సహా ఎవడికీ సమాధానం తెలియదు. శిశువులు, పిచ్చివాళ్లకు మాత్రమే తెలిసుండొచ్చు, కానీ వాళ్లు చెప్పేది అర్థం కాదు. డీఎన్‌ఏ లాగా ఏ ఒక్కడి జీవితమూ ఇంకొకడిని పోలి లేదు. ఎక్కడికో తెలియకపోయినా ఎందుకైనా మంచిదని అందరూ పరిగెత్తుతున్నారు. ఈ వేగంలో రచయితలు కూడా గందరగోళంలో ఉన్నారు. తాను పరిగెత్తుతూ పరిగెత్తేవాడిని పరిశీలించాలి. ఇది షేర్ ఆటోలో వేలాడ్డానికి మించిన కష్టం.
కథలు రాసేవాళ్లూ చదివేవాళ్లూ తగ్గిపోయారని అంటున్నారు. నిజమే తుక్కు రాసేవాళ్లూ చదివేవాళ్లూ తగ్గిపోయారు. మంచి కథకులు, చదువరులు ఇంకా ఉన్నారు. వాళ్లెప్పుడూ అల్ప సంఖ్యాకులే! 2014 ‘ప్రాతినిధ్య’ కథల సంపుటిలో వంశీధర్‌రెడ్డి ‘ఐస్‌క్యూబ్’కథ ఉంది. ఏకకాలంలో ద్రవ పదార్థంగానూ, ఘనంగానూ ఉండటమే ఐస్‌క్యూబ్ ప్రత్యేకత. జీవితం కూడా అంతే. గడ్డ కడుతూ కడుతూ కరిగిపోతుంది. ఎప్పుడూ ఏదో ఒక సందర్భాన్ని ఎదుర్కోవడంలోనే జీవితం గడిచిపోతూ ఉంటుంది.
ఈ కథలో ఏముంది? ఒక కుర్రాడు, కాస్త మందు తాగుతాడు, ఎవరో చనిపోతే హాజరవుతాడు, ఎప్పుడో విడిపోయిన గర్ల్‌ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. ఆమె గురించి ఆలోచనలు. చివరికి ‘ఒకటే జీవితం, ఏం చేసినా ఇప్పుడే, కానీ మనల్నే జీవితం అనుకునేవాళ్లని మోసం చేయడం కరెక్టేనా?’ అనుకోవడంతో కథ అయిపోతుంది.
చైతన్యస్రవంతి పద్ధతిలో సాగే ఈ కథలో నగర జీవితానికి సంబంధించిన బోలెడన్ని షేడ్స్ ఉన్నాయి. తండ్రిని వెంటిలేటర్‌పై ఉంచి ఆస్తి వ్యవహారాలన్నీ చక్కదిద్దుకుని, తనకూ తన భార్యకూ సెలవు దొరికినప్పుడు వెంటిలేటర్ తీసేసి అంత్యక్రియలు చేసిన కొడుకున్నాడు(నిజానికి ఇది వేరే కథ). చాలా రోజుల తర్వాత గర్ల్‌ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఇంటికి ప్లాన్ ఫ్రీగా అడుగుతుందేమోనని భయపడే కుర్రాడు. డబ్బులడుగుతుందనే భయం కూడా! చాలాకాలం తర్వాత ఎవరైనా స్నేహితులు ఫోన్ చేస్తే అందరిలోనూ ఇప్పుడు ఇవే భయాలు.
స్త్రీ పురుష సంబంధాలపై సున్నితమైన విశ్లేషణ, అంతర్లీన హాస్యం ఉన్నాయి కథలో. గర్ల్‌ఫ్రెండ్‌తో ఒకరాత్రి గడిపేంత దూరం పోయిన ఆలోచనలు మళ్లీ వెనక్కి వస్తాయి. తనకే గుర్తులేని పుట్టినరోజుని భార్య సెలబ్రేట్ చేస్తున్నప్పుడు ఆ అపస్మారక స్థితి నుంచి బయటికొస్తాడు. రిలేషన్స్, కాంప్లికేషన్స్ ఈ రెంటికీ అర్థం ఒకటే అవుతున్న తరుణంలో ఐస్‌క్యూబ్ మంచి కథ.
డా॥వంశీధర్ రెడ్డి