ఇదేమిటో తెలుసా? రోబోచేప. పేరు ఈవ్. సిలికాన్ తోకను విలాసంగా ఊపుకుంటూ స్విట్జర్లాండ్‌లో జ్యూరిచ్ సరస్సులోని అతి శీతల జలాల్లో ఇలా విలాసంగా విహరిస్తోంది. దీన్ని రూపొందించేందుకు జ్యూరిచ్ ఈటీహెచ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏకంగా రెండేళ్లు పట్టిందట! ఇతర చేపలు, సముద్ర జీవాలు బెదిరిపోకుండా ఉండాలని దీన్ని అచ్చం చేపలా కని్పంచేలా డిజైన్ చేశారు.
సోనార్ టెక్నాలజీ సాయంతో అడ్డొచ్చే వాటన్నింటినీ సునాయాసంగా తప్పించుకుంటూ సాగిపోగలదీ మర చేప. ఇంతకూ దీని పనేమిటంటారా? నీటి లోపలి పరిస్థితులను కెమెరా కంటితో ఒడిసిపట్టడం. సముద్ర జీవుల డీఎన్‌ఏను (‘ఇ–డీఎన్‌ఏ’గా పిలుస్తారు) సేకరించడం.
‘‘సముద్రం లోతుల గురించి, అక్కడి జీవుల గురించీ మనకు తెలిసింది నిజానికి చాలా తక్కువ. ఆ జీవులన్నీ నిరంతరం ‘ఇ–డీఎన్‌ఏ’ను జలాల్లోకి విడుదల చేస్తుంటాయి. దాన్ని సేకరించి ల్యాబుల్లో పరీక్షిస్తే వాటి గురించి మనకిప్పటిదాకా తెలియని విశేషాలెన్నో వెలుగులోకి వస్తాయి’’ అని అధ్యయన బృందం చెబుతోంది. ఈ రోబో చేపలు మున్ముందు సముద్రాల అధ్యయనం రూపురేఖలనే మార్చగలవని భావిస్తున్నారు.
సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment