ETH Zurich University
-
ముద్దొచ్చే మర చేప
ఇదేమిటో తెలుసా? రోబోచేప. పేరు ఈవ్. సిలికాన్ తోకను విలాసంగా ఊపుకుంటూ స్విట్జర్లాండ్‌లో జ్యూరిచ్ సరస్సులోని అతి శీతల జలాల్లో ఇలా విలాసంగా విహరిస్తోంది. దీన్ని రూపొందించేందుకు జ్యూరిచ్ ఈటీహెచ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏకంగా రెండేళ్లు పట్టిందట! ఇతర చేపలు, సముద్ర జీవాలు బెదిరిపోకుండా ఉండాలని దీన్ని అచ్చం చేపలా కని్పంచేలా డిజైన్ చేశారు. సోనార్ టెక్నాలజీ సాయంతో అడ్డొచ్చే వాటన్నింటినీ సునాయాసంగా తప్పించుకుంటూ సాగిపోగలదీ మర చేప. ఇంతకూ దీని పనేమిటంటారా? నీటి లోపలి పరిస్థితులను కెమెరా కంటితో ఒడిసిపట్టడం. సముద్ర జీవుల డీఎన్ఏను (‘ఇ–డీఎన్ఏ’గా పిలుస్తారు) సేకరించడం. ‘‘సముద్రం లోతుల గురించి, అక్కడి జీవుల గురించీ మనకు తెలిసింది నిజానికి చాలా తక్కువ. ఆ జీవులన్నీ నిరంతరం ‘ఇ–డీఎన్ఏ’ను జలాల్లోకి విడుదల చేస్తుంటాయి. దాన్ని సేకరించి ల్యాబుల్లో పరీక్షిస్తే వాటి గురించి మనకిప్పటిదాకా తెలియని విశేషాలెన్నో వెలుగులోకి వస్తాయి’’ అని అధ్యయన బృందం చెబుతోంది. ఈ రోబో చేపలు మున్ముందు సముద్రాల అధ్యయనం రూపురేఖలనే మార్చగలవని భావిస్తున్నారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
గాల్లోంచి.. మంచినీటి చుక్క, మాంసం ముక్క
ఎక్కడో ఎడారి నడి మధ్యలో ఉన్నారు.. చెట్లూ చేమలు ఏమీ లేవు.. నీటి జాడ అసలే లేదు.. అయినా తినడానికి మాంచి మటన్ లాంటి ఫుడ్డు, కావల్సినన్ని నీళ్లు రెడీ. బయట ఎక్కడి నుంచో తేలేదు.. అక్కడే, ఆ ఎడారిలోనే అబ్రకదబ్ర అన్నట్టు గాలిలోంచి తయారైపోయాయ్. శాస్త్రవేత్తలు నిజంగానే గాల్లోంచి ప్రోటీన్ ఫుడ్‌ను, నీళ్లను తయారు చేసే టెక్నాలజీలను అభివృద్ధి చేశారు. ఆ విశేషాలివి.. నిరంతరాయంగా నీళ్లొస్తాయి ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల నీటికి కటకటే. ఎడారుల్లో మాత్రమే కాదు.. కొండలు, గుట్టల వంటిచోట కూడా తాగునీటికి తీవ్ర ఇబ్బందే. అలాంటి ప్రాంతాల్లో ఏమాత్రం ఖర్చు లేకుండా గాలి నుంచి నీటిని తీసే పరికరాన్ని స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్ జ్యూరిక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘సెల్ఫ్ కూలింగ్ కండెన్సేషన్ (తానంతట తానే చల్లబర్చుకుంటూ.. గాలిలోని నీటి ఆవిరిని సంగ్రహించే)’సాంకేతికతతో ఈ పరికరం పనిచేస్తుంది. నిజానికి గాలిలోంచి నీటిని సంగ్రహించగల పరికరాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నా.. వాటికి విద్యుత్ అవసరం, ఉత్పత్తి అయ్యే నీళ్లు కూడా చాలా తక్కువ. కానీ తాము తయారు చేసిన పరికరానికి ఎలాంటి అదనపు ఖర్చు అవసరం లేదని.. పైగా రోజులో 24 గంటలూ నీటిని పొందవచ్చని ఈటీహెచ్ జ్యూరిక్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎలా పనిచేస్తుంది? గాలిలోంచి నీటిని సంగ్రహించేందుకు ‘సెల్ఫ్ కూలింగ్ కండెన్సేషన్’చేయగల ప్రత్యేక గ్లాస్‌ను శాస్త్రవేత్తలు తయారు చేశారు. పాలిమర్, వెండి పొరలతో కూడిన ఈగ్లాస్ సూర్యరశ్మిని పూర్తిస్థాయిలో ప్రతిఫలింపజేస్తూ.. బాగా చల్లబడుతుంది. ఈ గ్లాస్ దిగువభాగాన చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత కంటే.. ఏకంగా 15 డిగ్రీల సెంటీగ్రేడ్ల మేర తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. దీంతో గాలిలో ఉన్న నీటి ఆవిరి గ్లాస్ దిగువ భాగాన నీటి చుక్కలుగా పేరుకుంటూ..దిగువన ఉన్న కంటైనర్‌లో కి చేరుతుంది. ఈ విధానంలో పూర్తి స్వచ్ఛమైన నీరు వస్తుందని.. పది చదరపు మీటర్ల పరిమాణమున్న పరికరంతో రోజుకు 12.7 లీటర్ల నీళ్లు ఉత్పత్తి అవుతాయని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఇవాన్ హెక్లర్ తెలిపారు. మాంసమూ ఊడి పడుతుంది! మటన్, చికెన్, ఫిష్.. ఇలా ఏ మాంసం ఏదైనా జనం లొట్టలేస్తూ లాగించేస్తుంటారు. మరోవైపు ఇది జీవ హింస అనే వాదనలు. ఈ మధ్య మొక్కల ఆధారిత (ప్లాంట్ బేస్డ్) మాంసం కూడా అందుబాటులోకి వచ్చింది. కానీ ఇవేమీ లేకుండా నేరుగా గాలిలోంచే మాంసం తయారు చేయగలిగితే.. ఇంకా బెటర్ కదా. ఎయిర్ ప్రోటీన్ అనే సంస్థ దీనిని నిజం చేసింది. మొదట అంతరిక్ష యాత్ర కోసమని.. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సహా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు గాలిలోని వాయువులు, రసాయనాల నుంచి ప్రోటీన్లను ఉత్పత్తి చేయడంపై సుమారు 50 ఏళ్ల కిందే ప్రయోగాలు మొదలుపెట్టారు. అంగారకుడు, ఇతర గ్రహాలపై ఉన్న వాతావరణం నుంచి ప్రోటీన్లను ఉత్పత్తి చేయగలిగితే.. వ్యోమగాములకు ఆహారం సమస్య తీరుతుందనేది దీని ఉద్దేశం. ఈ పరిశోధనలను ఎయిర్ ప్రోటీన్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు లీసా డైసన్, జాన్ రీడ్ తదితరులు స్ఫూర్తిగా తీసుకున్నారు. ఎయిర్ ప్రోటీన్‌ను తీసి.. వివిధ పద్ధతుల్లో గాలిలోని వాయువులు, మూలకాలను సేకరించి, అవసరమైన మేర సమ్మిళితం చేసి.. ‘ఎయిర్ ప్రోటీన్’ను రూపొందించారు. దానిని శుద్ధిచేసి, పూర్తిగా ఆరబెట్టి.. ఒక పిండి వంటి పదార్థంగా తయారు చేశారు. ఈ ‘ఎయిర్ ప్రోటీన్’పిండితో.. చికెన్, మటన్, ఫిష్ వంటి వివిధ రకాల మాంసం తరహాలో తయారు చేశారు. తమ ‘ఎయిర్ ప్రొటీన్’రుచి, పోషకాల విషయంలో సాధారణ మాంసంతో సమానమని.. యాంటీ బయాటిక్స్, పురుగు మందుల అవశేషాలూ ఉండవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గాలిలోని కార్బన వాయువులను తగ్గించడం వల్ల పర్యావరణానికీ మేలు అని స్పష్టం చేస్తున్నారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
సైబథ్లాన్... ‘హైటెక్’ ఒలింపిక్స్!
ఒలింపిక్స్ ఎన్ని రకాలు.. ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ రెండే కదా అనుకుంటున్నారా..! లేదు.. ఈ ఏడాది నుంచి ఒలింపిక్స్ 3 రకాలు! అవయవాలన్నీ సక్రమంగా ఉన్న వారి కోసం జరిగేవి సాధారణ ఒలింపిక్స్ అయితే.. అవయవ లోపాలను అధిగమించి క్రీడాస్ఫూర్తిని చాటేందుకు ఉద్దేశించినవి పారా ఒలింపిక్స్. మరి ఈ మూడో రకం ఒలింపిక్స్ ఏంటనే కదా మీ అనుమానం..! ఇవి కూడా పారా ఒలింపిక్స్ లాంటివే. కాకపోతే ఇందులో క్రీడాకారులకు అత్యాధునిక టెక్నాలజీ ఆసరాగా ఉంటుంది. జ్యూరిచ్‌లో అక్టోబర్ 8న సైబథ్లాన్ అని పిలుస్తున్న ఈ తాజా ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. కాళ్లు, చేతులు పోగొట్టుకున్న వారి కోసం ఎన్నో కంపెనీలు హైటెక్ కృత్రిమ అవయవాలను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే శరీర కండరాలు బలహీనపడ్డ వారి కోసం ఎక్సో స్కెలిటన్లు, శరీరం మొత్తం చచ్చుబడిన వారు కూడా పనులు చేసేలా బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి టెక్నాలజీలు, పరికరాల సాయంతో సైబథ్లాన్‌లో పోటీదారులు బరిలోకి దిగుతారన్న మాట. ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. పోటీల్లో ఆయా టెక్నాలజీలు, పరికరాలు తయారు చేసిన వారికీ పతకాలు అందజేస్తారు. మొత్తం ఆరు అంశాల్లో పోటీలు.. సైబథ్లాన్‌లో మొత్తం ఆరు అంశాల్లో పోటీలు ఉంటాయి. మోటార్లతో పనిచేసే చేతులతో జరిగే పోటీ ఒకటి. రకరకాల ఆకారాల్లో ఉన్న వస్తువులను తమ కృత్రిమ చేతులతో పెకైత్తడమే కాకుండా వాటిని ఒక పద్ధతి ప్రకారం పేర్చాల్సి ఉంటుంది. ఇక రెండోది.. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ పోటీ. కంప్యూటర్లలో ఆడే కొన్ని రేసుల లాంటిదే కాని ఇందులో జాయ్‌స్టిక్ కానీ, గేమ్ కంట్రోలర్ ఏదీ ఉండదు. మెదడులో మెదిలే ఆలోచనలను సంకేతాల రూపంలోకి మార్చే పరికరాన్ని తొడుక్కుని ఈ ఆట ఆడాల్సి ఉంటుంది. మూడో అంశం వెన్నెముక ప్రమాదాలకు గురైన వారి కోసం ఉద్దేశించింది. వీల్‌చెయిర్ లాంటి వాహనాల్లో గుండ్రటి రేస్ట్రాక్పై పోటీ ఉంటుంది. వెన్నెముకకు విద్యుత్ సంకేతాలు అందిచ్చే పరికరాలు ధరించిన పైలట్లు అందుకు అనుగుణంగా వాహనాన్ని నడిపిస్తారు. ఫంక్షనల్ ఎలక్ట్రికల్ స్టిములేషన్ బైక్ రేస్ అని పిలిచే దీంట్లో 200 మీటర్ల స్ప్రింట్, వెయ్యి మీటర్ల ఎండ్యూరెన్స్ విభాగాలు ఉన్నాయి. ఇక నాలుగో అంశం విషయానికొస్తే... రొబోటిక్ యంత్రాలతో కూడిన కాళ్ల ద్వారా ఈ పోటీల్లో పాల్గొంటారు. వీటితోనే ఎత్తుపల్లాలను, అడ్డంకులను అధిగమించడం, మెట్లు ఎక్కడం వంటివి వీలైనంత వేగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. వెన్నెముక గాయాలకు గురైన వారికి మరో రకమైన అంశంలో పోటీ ఉంది. దీంట్లో వీల్‌చెయిర్ కాకుండా యంత్రాలతో నడిచే ఎక్సో స్కెలిటన్లను ఉపయోగిస్తారు. ఇక చివరి అంశం.. వేగంగా ప్రవహిస్తున్న నదిలో చిన్న బోటు వేసుకుని పోటీపడే షాలోమ్ గురించి మీరు వినే ఉంటారు. సైబథ్లాన్‌లో దీన్నే హైటెక్ వీల్‌చెయిర్లతో నిర్వహిస్తారు. - సాక్షి, హైదరాబాద్ ఇవీ సైబథ్లాన్ విశేషాలు.. ఈటీహెచ్ జ్యూరిచ్ విశ్వవిద్యాలయం, స్విట్జర్లాండ్ నేషనల్ సెంటర్ ఫర్ కాంపిటెన్స్ ఇన్ రోబోటిక్ రీసెర్చ్‌లు నిర్వహిస్తున్న ఈ పోటీల కోసం 2014లోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అంగవైకల్యం ఉన్న వారికి బయోనిక్ టెక్నాలజీ చేకూరుస్తున్న ఉపయోగాల గురించి ప్రచారం కల్పించడం ఈ ఒలింపిక్స్ ముఖ్య ఉద్దేశం. అందుకే పారాఒలింపిక్స్‌కు భిన్నంగా ఇందులో మోటార్లసాయంతో నడిచే యంత్రాలను కూడా ఉపయోగించేందుకు వీలు కల్పించారు. ఈ ఒలింపిక్స్‌లో క్రీడాకారులను పైలట్లు అని వ్యవహరిస్తారు.