సైబథ్లాన్... ‘హైటెక్’ ఒలింపిక్స్! | Saibathlan of 'High-tech' Olympics | Sakshi
Sakshi News home page

సైబథ్లాన్... ‘హైటెక్’ ఒలింపిక్స్!

Published Fri, Jul 15 2016 2:56 AM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM

సైబథ్లాన్... ‘హైటెక్’ ఒలింపిక్స్!

సైబథ్లాన్... ‘హైటెక్’ ఒలింపిక్స్!

ఒలింపిక్స్ ఎన్ని రకాలు.. ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ రెండే కదా అనుకుంటున్నారా..! లేదు.. ఈ ఏడాది నుంచి ఒలింపిక్స్ 3 రకాలు!
అవయవాలన్నీ సక్రమంగా ఉన్న వారి కోసం జరిగేవి సాధారణ ఒలింపిక్స్ అయితే.. అవయవ లోపాలను అధిగమించి క్రీడాస్ఫూర్తిని చాటేందుకు ఉద్దేశించినవి పారా ఒలింపిక్స్. మరి ఈ మూడో రకం ఒలింపిక్స్ ఏంటనే కదా మీ అనుమానం..! ఇవి కూడా పారా ఒలింపిక్స్ లాంటివే. కాకపోతే ఇందులో క్రీడాకారులకు అత్యాధునిక టెక్నాలజీ ఆసరాగా ఉంటుంది. జ్యూరిచ్‌లో అక్టోబర్ 8న సైబథ్లాన్ అని పిలుస్తున్న ఈ తాజా ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి.

కాళ్లు, చేతులు పోగొట్టుకున్న వారి కోసం ఎన్నో కంపెనీలు హైటెక్ కృత్రిమ అవయవాలను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే శరీర కండరాలు బలహీనపడ్డ వారి కోసం ఎక్సో స్కెలిటన్లు, శరీరం మొత్తం చచ్చుబడిన వారు కూడా పనులు చేసేలా బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి టెక్నాలజీలు, పరికరాల సాయంతో సైబథ్లాన్‌లో పోటీదారులు బరిలోకి దిగుతారన్న మాట. ఇంకో ప్రత్యేకత ఏంటంటే.. పోటీల్లో  ఆయా టెక్నాలజీలు, పరికరాలు తయారు చేసిన వారికీ పతకాలు అందజేస్తారు.
 
మొత్తం ఆరు అంశాల్లో పోటీలు..
సైబథ్లాన్‌లో మొత్తం ఆరు అంశాల్లో పోటీలు ఉంటాయి. మోటార్లతో పనిచేసే చేతులతో జరిగే పోటీ ఒకటి. రకరకాల ఆకారాల్లో ఉన్న వస్తువులను తమ కృత్రిమ చేతులతో పెకైత్తడమే కాకుండా వాటిని ఒక పద్ధతి ప్రకారం పేర్చాల్సి ఉంటుంది. ఇక రెండోది.. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ పోటీ. కంప్యూటర్లలో ఆడే కొన్ని రేసుల లాంటిదే కాని ఇందులో జాయ్‌స్టిక్ కానీ, గేమ్ కంట్రోలర్ ఏదీ ఉండదు. మెదడులో మెదిలే ఆలోచనలను సంకేతాల రూపంలోకి మార్చే పరికరాన్ని తొడుక్కుని ఈ ఆట ఆడాల్సి ఉంటుంది. మూడో అంశం వెన్నెముక ప్రమాదాలకు గురైన వారి కోసం ఉద్దేశించింది. వీల్‌చెయిర్ లాంటి వాహనాల్లో గుండ్రటి రేస్‌ట్రాక్‌పై పోటీ ఉంటుంది.

వెన్నెముకకు విద్యుత్ సంకేతాలు అందిచ్చే పరికరాలు ధరించిన పైలట్లు అందుకు అనుగుణంగా వాహనాన్ని నడిపిస్తారు. ఫంక్షనల్ ఎలక్ట్రికల్ స్టిములేషన్ బైక్ రేస్ అని పిలిచే దీంట్లో 200 మీటర్ల స్ప్రింట్, వెయ్యి మీటర్ల ఎండ్యూరెన్స్ విభాగాలు ఉన్నాయి. ఇక నాలుగో అంశం విషయానికొస్తే... రొబోటిక్ యంత్రాలతో కూడిన కాళ్ల ద్వారా ఈ పోటీల్లో పాల్గొంటారు. వీటితోనే ఎత్తుపల్లాలను, అడ్డంకులను అధిగమించడం, మెట్లు ఎక్కడం వంటివి వీలైనంత వేగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. వెన్నెముక గాయాలకు గురైన వారికి మరో రకమైన అంశంలో పోటీ ఉంది. దీంట్లో వీల్‌చెయిర్ కాకుండా యంత్రాలతో నడిచే ఎక్సో స్కెలిటన్లను ఉపయోగిస్తారు. ఇక చివరి అంశం.. వేగంగా ప్రవహిస్తున్న నదిలో చిన్న బోటు వేసుకుని పోటీపడే షాలోమ్ గురించి మీరు వినే ఉంటారు. సైబథ్లాన్‌లో దీన్నే హైటెక్ వీల్‌చెయిర్లతో నిర్వహిస్తారు.        
- సాక్షి, హైదరాబాద్
 
ఇవీ సైబథ్లాన్ విశేషాలు..
ఈటీహెచ్ జ్యూరిచ్ విశ్వవిద్యాలయం, స్విట్జర్లాండ్ నేషనల్ సెంటర్ ఫర్ కాంపిటెన్స్ ఇన్ రోబోటిక్ రీసెర్చ్‌లు నిర్వహిస్తున్న ఈ పోటీల కోసం 2014లోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అంగవైకల్యం ఉన్న వారికి బయోనిక్ టెక్నాలజీ చేకూరుస్తున్న ఉపయోగాల గురించి ప్రచారం కల్పించడం ఈ ఒలింపిక్స్ ముఖ్య ఉద్దేశం. అందుకే పారాఒలింపిక్స్‌కు భిన్నంగా ఇందులో మోటార్లసాయంతో నడిచే యంత్రాలను కూడా ఉపయోగించేందుకు వీలు కల్పించారు. ఈ ఒలింపిక్స్‌లో క్రీడాకారులను పైలట్లు అని వ్యవహరిస్తారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement