కేరళలో ‘ఇండియా’ కూటమి సభ్యులైన కాంగ్రెస్, సీపీఎం మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మరింత వేడెక్కింది. తాజాగా సీపీఎం మద్దుతు ఉన్న ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పీవీ అన్వర్.. రాహుల్ గాంధీ డీఎన్‌ఏను పరిశీలించాలి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
సోమవారం మలప్పురంలోని ఎడతనట్టుకరలో జరిగిన సీపీఎం ఎన్నికల ప్రచార సభలో అన్వర్ ప్రసంగిస్తూ, “రాహుల్‌కు గాంధీ పేరును వాడుకునే హక్కు లేదు. అత్యంత నీచ స్థాయికి దిగజారిపోయాడు. అతను నెహ్రూ కుటుంబంలోనే పుట్టారా? నాకు సందేహాలు ఉన్నాయి. అతని డీఎన్‌ఏను పరీక్షించాలి” అన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై రాహుల్ చేసిన హేళనపై విమర్శలు చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అన్వర్ వ్యాఖ్యలను మంగళవారం సీఎం విజయన్ కూడా సమర్థించారు. రాహుల్ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే ఎదుటివారి నుంచి తగిన సమాధానం వస్తుందని గ్రహించాలని హితవు పలికారు. గత వారం కేరళలో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ “ఇద్దరు ముఖ్యమంత్రులు జైలులో ఉన్నారు. కేరళ ముఖ్యమంత్రికి ఇలా జరగకపోతే ఎలా? నేను బీజేపీపై 24 గంటలూ విమర్శలు చేస్తులంటే కేరళ ముఖ్యమంత్రి మాత్రం నాపై 24 గంటలూ విమర్శలు చేస్తున్నారు. ఇది కొంచెం అయోమయంగా ఉంది” అని వ్యాఖ్యానించారు.
విజయన్ కుమార్తె వీణా ఐటీ సంస్థలో జరిగిన అక్రమ చెల్లింపుల కుంభకోణం, త్రిసూర్‌లోని సహకార బ్యాంకులో జరిగిన మరో కుంభకోణంపై కేంద్ర ఏజెన్సీల దర్యాప్తుల కారణంగానే సీఎం విజయన్ ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. దీనికి బదులిస్తూ “మీ నానమ్మ (ఇందిరా గాంధీ మమ్మల్ని ఒకటిన్నర సంవత్సరాలు (ఎమర్జెన్సీ సమయంలో) జైలులో పెట్టింది రాహుల్” అని సీఎం విజయన్ గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment