డీఎన్‌ఏ వల్ల కలిగే శారీరక, మానసిక వైకల్యాలను సాంకేతికత ద్వారా గుర్తించవచ్చు, సరిదిద్దవచ్చు. కానీ ఒకరి విశ్వాస వ్యవస్థ వల్ల కలిగే బలహీనతలు శాశ్వతంగా ఉంటాయి. ఒక బిడ్డ జన్మించిన మతపు నమ్మకాలే అతడికి వాస్తవికంగా, నిజంగా మారిపోతాయి. పిల్లలు పెరిగే వాతావరణమే వారి మనస్తత్వాన్ని మలచే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే పుట్టినప్పుడే పిల్లలకు మతాన్ని అంటగట్టడం అనేది తిరోగమనంతో కూడిన, ప్రమాదకరమైన పద్ధతి. పిల్లల మతాన్ని నమోదు చేయడాన్ని తప్పనిసరి చేసే చట్టం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుంది. అది పితృస్వామ్యాన్నీ, మెజారిటీ వాదాన్నీ ప్రోత్సహిస్తుంది. వారి స్వేచ్ఛపై పరిమితులను విధిస్తుంది. వారి ఎదుగుదలను ఆపివేస్తుంది. ఆ కోణంలో చూస్తే ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. అందుకే మతాన్ని ‘వయోజనులకు’ సంబంధించిన అంశంగానే చూద్దాం.
ఏప్రిల్ 5 నాటి ప్రముఖ వార్తాపత్రికలోని ఒక ప్రధాన శీర్షిక, ‘జననాల నమోదు కోసం తల్లిదండ్రుల మతాన్ని పొందుపరచనున్న ప్రభుత్వం’ అని చెబుతోంది. జనన మరణాల నమోదు (సవరణ) చట్టం, 2023ను గత ఏడాది ఆగస్టు 11న పార్లమెంటు ఆమోదించింది. జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పీఆర్), ఓటర్ల జాబితాలు, ఆధార్ నంబర్, రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆస్తి నమోదు, నోటిఫై చేసిన ఇతర అంశాలతో సహా వివిధ డేటాబేస్‌లను అప్‌డేట్ చేయ డానికి ఉపయోగించే జాతీయ స్థాయిలో జనన, మరణ డేటాబేస్ నిర్వహణను ఈ చట్టం తప్పనిసరి చేస్తోంది.
పిల్లల మతానికి చెందిన కాలమ్‌లో తల్లిదండ్రులు వేర్వేరు మతాలకు చెందినవారైతే వారిద్దరి మతాన్ని నమోదు చేయడాన్ని కూడా ఈ సవరణ చట్టం తప్పనిసరి చేస్తోంది. ఇది, మోసపూరితంగా చట్టానికి ఉదారమైన రూపాన్ని ఇస్తోంది. కానీ మాకు సంబంధించి, పుట్టినప్పుడే పిల్లలకు మతాన్ని అంటగట్టడం అనేది తిరోగమనంతో కూడిన, ప్రమాదకరమైన పద్ధతి.
వయోజనులు అనే అంశాన్ని ముందు స్పష్టం చేద్దాం. ఇది ఓటు వేయడానికి లేదా వివాహం చేసుకోవడానికి కావాల్సిన చట్టబద్ధమైన వయస్సు కాదు. ఇక్కడ వయోజనుడు అంటే వ్యక్తిగత నైతిక చట్రాన్ని అభివృద్ధి చేసుకునేంత స్థాయిలో ఎదిగిన వ్యక్తి అని అర్థం. మతం అనే పదం వ్యవస్థీకృతమైన మతాలను సూచిస్తుంది.
చట్టపరంగా, వయోజనులు భౌతిక స్వభావం గల లక్షణాలను కలిగి ఉంటారు. అయితే, మతం పాక్షికంగా ఆధిభౌతికమైనది. పిల్లలు పొందిన డీఎన్‌ఏతో దానిని కలపడం అనేది వారి స్వేచ్ఛపై పరి మితులను విధిస్తుంది. వారి ఎదుగుదలను ఆపివేస్తుంది. ఆ కోణంలో చూస్తే ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. ఇది ప్రమాదకరమైన చట్టం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యపు విలువలను దెబ్బతీస్తుంది.
అంతే కాక, మతతత్వం, పితృస్వామ్యం, మెజారిటీతత్వాలను ప్రోత్సహిస్తుంది. కొన్ని రాష్ట్రాలు ‘లవ్ జిహాద్’కు (హిందూ అమ్మాయితో ముస్లిం పురుషుడి సంబంధం లేదా వివాహం) వ్యతిరేకంగా చట్టాన్ని ఆమోదించిన వాస్తవాన్ని గమనిస్తే, ఆ నిబంధన అంత అమాయ కమైనది కాకపోవచ్చు. కనీసం, ఇది పితృస్వామికతతో కూడుకుని ఉన్నది.
మొదటిది, మానవ హక్కులకు సంబంధించిన ప్రశ్న. ఓటింగ్ లేదా వివాహం గురించిన అవకాశాన్ని ఎంపిక చేసుకోవడానికి ఒక పిల్లవాడు యుక్తవయస్సుకు ఎదగవలసి ఉంటుంది. అయితే, ఓటు వేయమని లేదా వివాహం చేసుకోవాలని ఎవరినీ బలవంతం చేసే చట్టం లేదు. వయోజనుడైన బిడ్డకు ఎంపిక చేసుకోకుండా ఉండటానికి స్వేచ్ఛ ఉంది. కానీ వ్యవస్థీకృత మతం కొన్నిసార్లు ప్రచ్ఛన్నంగా, కానీ తరచుగా నేరుగానే చేయవలసినవీ, చేయకూడనివీ చెబుతుంటుంది.
వాటితోపాటు, తప్పు ఒప్పులను విధిస్తుంది. పౌరాణిక సత్యాలు, తల్లిదండ్రులు, ఇతర పెద్దల సాంప్రదాయిక జ్ఞానం, సామాజిక ఒత్తిళ్లు, ‘సంస్కారం’ ఆశించే నియమాలు, ఆచారాలు, సంప్రదాయా లను అంగీకరించడం తప్ప అభాగ్యుడైన బిడ్డకు వేరే మార్గం లేదు. ఇటువంటి సూక్ష్మమైన, కానీ తీవ్రమైన బ్రెయిన్ వాష్ వల్ల, పిల్లల సహజసిద్ధమైన శాస్త్రీయ ఉధృతికి, ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ పరమైన ఎదుగుదలకు ఆటంకం కలుగుతుంది.
పిల్లల మెదడు అభివృద్ధిలో 80 శాతం జీవితంలో మొదటి 1,000 రోజులలోనే జరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ కాలంలో ఛాందస, ఉదారవాద పరిసరాలు పిల్లల జీవితకాలం చెరగని వైఖరులకు కారణమవుతాయి. పైగా అవి స్థూలంగా తిరోగ మనం, అణచివేత, అమానవీయమైనవి కూడా కావచ్చు. ఏది సరైనది ఏది తప్పు అనే సొంత నైతిక చట్రం ఆధారంగా పిల్లల అభివృద్ధిని వారి పరిసరాలు ప్రభావితం చేస్తాయి.
డీఎన్‌ఏ వల్ల కలిగే శారీరక, మానసిక వైకల్యాలను సాంకేతికత లేదా వైద్య శాస్త్రాల ద్వారా గుర్తించవచ్చు, సరిదిద్దవచ్చు. అయితే ఒకరి విశ్వాస వ్యవస్థ, మానవత్వం, సున్నితత్వం, ప్రవర్తన, ముందుగా నిర్ణయించిన ‘సత్యాల’ వల్ల కలిగే బలహీనతలు శాశ్వతంగా ఉంటాయి. ఒక బిడ్డ జన్మించిన మతపు నమ్మకాలే అతడికి వాస్తవికంగా, నిజంగా మారిపోతాయి.
30 ఏళ్ల వయస్సు తర్వాత తాను సాగించిన ప్రయాణంలో, గౌతమ బుద్ధునికి ‘నేను ఇంకా జీవించాల్సిన జీవితం, అది నా స్వభావానికి ప్రతిబింబంగా ఉండితీరాలి’ అనిపించింది. ‘నా భ్రాంతిమయమైన కచ్చితత్వాల ఆశ్రయం నుండి, నా సొంత సరి హద్దుల నుండి నేను విముక్తి పొందాల్సి ఉంటుంది’ అని ఆయన భావించాడు.
గౌతముడు ఆధ్యాత్మిక పరిపక్వత సాధించకుంటే, ఆయన తన అసలైన స్వభావాన్ని గుర్తించడంలో విఫలమై, నిజంగా తన సొంతం కాని నమ్మకాలు, అంతర్‌దృష్టిలో తెలియకుండానే చిక్కుకుని ఉండే వాడు. పర్యవసానంగా, ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యా కులైన వ్యక్తులకు ఓదార్పును అందించి దిశానిర్దేశం చేసిన మానవీయ జీవిత తత్వశాస్త్రం ప్రపంచానికి నిరాకరించబడి ఉండేది. ప్రతి ఒక్కరూ గౌతమ బుద్ధుడిని అనుకరించలేరు కాబట్టి, వారి సొంత ప్రత్యేక మార్గాన్ని ఏర్పరచుకునే పిల్లల సామర్థ్యానికి సామాజిక నిబంధనలు, చట్టం అధిగమించ లేని అడ్డంకులను సృష్టించకూడదు.
స్థాపితమైన మతం శాస్త్రీయ ఆలోచనాపరులు, స్వేచ్ఛా ఆలోచనా పరులు, మేధావుల పట్ల విపరీతమైన క్రూర త్వాన్ని ప్రదర్శిస్తుంది. ఉదాహరణకు, రోమన్ క్యాథలిక్ చర్చి, ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త అయిన గెలీలియోను మతవిశ్వాసిగా ముద్ర వేసి శిక్షకు గురిచేసింది. 1633లో, గెలీలియోపై చర్చి... సూర్యుడు ప్రపంచానికి కేంద్రం మరియు నిశ్చలమనీ; భూమి దాని చుట్టూ తిరుగుతుందనీ... తప్పుడు, మత గ్రంథాలకు విరుద్ధంగా భావించే నమ్మకాన్ని ఆమోదించాడనీ ఆరోపించింది. హాస్యాస్పదంగా, గెలీ లియో పేర్కొన్న ఈ సంచలనాత్మక ఆవిష్కరణలు న్యూటన్, ఐన్ స్టీన్ సిద్ధాంతాలకు పునాది వేయడమే కాకుండా, ఈ రోజు మనకు తెలిసిన ఆధునిక భౌతికశాస్త్ర అభివృద్ధికి మార్గం సుగమం చేశాయి.
‘ద చైల్డ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ద మ్యాన్’ అనే పదబంధం, విలియం వర్డ్స్‌వర్త్ కవిత ‘మై హార్ట్ లీప్స్ అప్’ నుండి ఉద్భవించింది. ఇది కేవలం కవిత్వ వ్యక్తీకరణ మాత్రమే కాదు. వరుసగా తరాలను రూపొందించడంలో పిల్లలు కీలకమైన పాత్ర పోషిస్తారనే లోతైన సత్యాన్ని ఇది వ్యక్తీకరుస్తుంది. పిల్లలు పెరిగే వాతావరణమే వారి మనస్తత్వాన్ని మలచే శక్తిని కలిగి ఉంటుంది. అంటే అదే వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ, ఈ ప్రభావం ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటుంది.
ఇది స్వధర్మం ముసుగులో ఉన్న మతతత్వం, కులతత్వం, ద్వేషపు తాలూకు హింసాత్మక వ్యక్తీకరణల వంటి విభజన భావజాలాలను పిల్లల్లో శాశ్వతంగా కలిగించడంలోనో లేదా బాధితులుగా మార్చడంలోనో గణ నీయమైన ప్రభావాన్ని కలిగివుంది. ఇటువంటి ధోరణులు మెజారిటీ వాదాన్ని పెంపొందించవచ్చు. సామాజిక, ఆర్థిక అసమానతలకు వ్యక్తులను స్పందించకుండా చేయవచ్చు. శతాబ్దాల తరబడి వారసత్వంగా వచ్చిన నమ్మకాల్లో స్థిరపడిన మంచి ఉద్దేశం ఉన్న తల్లిదండ్రులు కూడా అనుకోకుండా తమ పిల్లల నిజమైన సారాన్ని అణచివేయవచ్చు. ఇక, చట్టసభ సభ్యులు క్రూరత్వానికి చెందిన అటువంటి రూపాలను శాశ్వతం చేసి సంస్థాగతీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.
– అశోక్ లాల్ ‘ రచయిత, నాటకరంగ కళాకారుడు
– నసీరుద్దీన్ షా ‘ హిందీ, ఉర్దూ నాటక రచయిత, నటుడు
Comments
Please login to add a commentAdd a comment