‘‘ప్రేమ లేని జగత్తు చచ్చిన ప్రపంచమే! ఎవరి పనిలో వారు బందీలై, బాధ్యతలు మోస్తూ ఉన్నప్పుడు ప్రేమపూర్వకమైన పల కరింపు, స్పర్శ స్వర్గతుల్యమవుతుం’’దన్నాడు ఫ్రెంచ్ తత్వవేత్త ఆల్బర్ట్ కామూ. విశ్వ ప్రేమ, కరుణ గురించి అద్భుతమైన సందేశమిచ్చిన బుద్ధుడు, ఒక్కొక్కసారి తర్కాన్ని పక్కనపెట్టి, వెంటనే చేయాల్సింది చెయ్యాలని హితవు పలికాడు.
సమాజం భ్రష్టుపట్టి పోయింది. మనుషులు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు– నిజమే! కానీ మానవత్వంగల మనుషులు కొందరైనా ఉన్నారు. అయితే, సమాజంలో వీరి శాతాన్ని బాగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. న్యూజిలాండ్‌లోని గ్రేమోత్ లోకల్ మార్కెట్లలో ఒక దయార్ద్ర హృదయుడు తిరుగుతుంటాడు. బతికి ఉన్న తాబేళ్లను కొంటూ ఉంటాడు. బేరమాడి తాబేళ్లన్నిటినీ కొని ట్రక్కులో సముద్రం దాకా తీసుకుపోయి, ఒక్కొక్కటిగా వాటిని మళ్లీ సముద్రంలోకి వదులుతాడు.
ఇటీవల 2022 ఏప్రిల్ 2న రాజస్థాన్ జైపూర్‌లో మానవత, మతాన్ని గెలిచింది. మధూలిక అనే ఒక 48 ఏళ్ళ హిందూ మహిళ 13 మంది ముస్లింల ప్రాణాలు కాపాడింది. భర్త చనిపోయిన ఆమె, తన ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటూ... ముస్లింలు అధికంగా ఉండే వీధిలో బట్టల కొట్టు నడుపుకుంటూ జీవిస్తోంది. ఒక రోజు హిందూ వర్గానికి చెందిన వారు శోభా యాత్ర ఊరేగింపు తీస్తూ... అక్కడ ఉన్న 13 మంది ముస్లింల వెంటపడ్డారు. అదంతా గమనించిన మధూలిక ముస్లింలను తన కొట్టులోకి పంపి, షట్టర్ వేసేసింది. ‘మానవత్వమే అన్నిటికన్నా గొప్పదని భావించి, ముస్లిం సోదరులకు సాయం చేశాననీ– మతాల కన్నా మనుషులే ముఖ్యమని’ ఆమె అన్నారు.
హైదరాబాద్ పాతబస్తీలో గాజుల అంజయ్య అందరికీ తెలిసినవాడు. అతని మిత్రులలో చాలామంది ముస్లింలే. 2022 ఏప్రిల్ 17న తన కొడుకు పెళ్లికి మిత్రులందరినీ పిలిచాడు. అవి రంజాన్ రోజులు గనుక, రోజా పాటించే తన ముస్లిం మిత్రులెవరూ ఇబ్బంది పడకూడదని వారి కోసం ప్రత్యేక వసతులు కల్పించాడు. నమాజ్ చేసుకోవడానికి ఏర్పాటు చేశాడు. ఇఫ్తార్ విందూ ఏర్పాటు చేశాడు. ఒక హిందువుల వివాహ వేడుకలో ముస్లింల కోసం రంజాన్ ఏర్పాట్లు చూసి అతిథులంతా ఆశ్చర్యానికీ, ఆనందానికీ గురయ్యారు.
ఇలాంటిదే మరో సంఘటన కేరళలో జరిగింది. ఒక ముల్లా తన మజీద్‌లో హిందూ అమ్మాయి వివాహం జరిపించి అందరికీ ఆదర్శప్రాయుడు అయ్యాడు. కోళిక్కోడ్‌లో మసీదు ఉన్న ఓ వీధి చివరలో ఒక హిందూ మహిళ ఉంటోంది. ఆమెకు ఈడొచ్చిన కూతురు ఉంది. కానీ ఆ మహిళ కూతురి పెండ్లి చేయలేకపోతోంది. అమ్మాయిని ప్రేమించిన కుర్రాడు కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ అతడి కుటుంబం ఘనంగా పెళ్లి చెయ్యాలన్నది. కానీ ఆమెకు అంత తాహతు లేదు. తనకు ఉన్న పరిచయం కొద్దీ ఓ రోజు ఆమె ముల్లాకి తన గోడు వెళ్లబోసుకుంది. ఆయన పెండ్లి జరిపించి, వందమందికి భోజనాలు పెట్టించే బాధ్యత తనమీద వేసుకున్నాడు. తమ మసీదులోని విశాలమైన ప్రాంగణంలోనే పెళ్లి అన్నారు! ‘‘మేళతాళాలు కూడా నేనే మాట్లాడతాను. ఒక్క పంతులు గారిని మాత్రం పిలుచుకుని, మీ పద్ధతిలో మీరు నిరభ్యం తరంగా పెండ్లి జరిపించుకోండి!’’ అని అన్నాడు. ఆ విధంగా ఒక హిందూ వివాహానికి మసీదు వేదిక అయ్యింది. ఇది కోవిడ్ లాక్‌డౌన్‌కు ముందు 2019లో జరిగింది.
ముస్లింల, క్రైస్తవుల సఖ్యత గూర్చి కూడా ఒక సంఘటన గుర్తు చేసుకుందాం. ఇది 2022 ఏప్రిల్ 21 మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని నాసిక్‌లో ముస్లింలు చర్చిలో నమాజ్ చదివారు. ఇఫ్తార్ విందు కోసం అజ్మల్ ఖాన్ అనే వ్యక్తి అన్ని మతాల మత పెద్దల్ని ఆహ్వానించాడు. అయితే అక్కడి చర్చ్ ఫాదర్ ఆ విందును అంగీకరించడమే కాకుండా– ఆ ఇఫ్తార్ విందును తన చర్చ్‌లోనే నిర్వహించాలని సూచించాడు. అందువల్ల ముస్లింలంతా చర్చ్‌లోనే నమాజ్ చేసుకున్నారు. చర్చ్ ఫాదర్ కూడా ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు.
ఇక్కడ చెప్పుకున్న అన్ని సంఘటనలకూ ఒక అంత స్సూత్రం ఉంది! ‘‘మతం అనేది వ్యక్తిగత విశ్వాసం. మన చివరి గమ్యం మా‘నవ’వాదం’’ దీన్ని సాధించడానికి... ఇలా మెల్లగా అడుగులు పడుతున్నాయేమో? ఇలా తరతమ భేదాలు మరిచి, మత విద్వేషాలు రేపి, మారణహోమం సృష్టించే వారి ఆట కట్టిస్తారేమో! అందుకే చేగువేరా అంటాడు – ‘‘మన మార్గం సుదీర్ఘమైనది. రాబోయే కాలం ఎలా ఉంటుందో తెలియదు. మన పరిమితులు మనకు తెలుసు. 21వ శతాబ్దపు స్త్రీ, పురుషుల్ని – అంటే మనల్ని మనం కొత్తగా తయారు చేసుకోవడానికి రోజువారీగా కృషి చేస్తూనే ఉండాలి’’ అని!
వ్యాసకర్త: డాక్టర్ దేవరాజు మహారాజు
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త
ఇవాళ మనకు కావాల్సింది ఇదీ!
Published Sun, May 22 2022 1:03 AM | Last Updated on Sun, May 22 2022 1:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment