మతతత్వానికి వ్యతిరేకంగా మానవత ఉద్యమం
Published Sun, Sep 4 2016 1:49 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
– జేఐహెచ్ సద్భావనా సదస్సులో జాతీయ కార్యదర్శి ఇక్బాల్ ముల్లా
కర్నూలు (ఓల్డ్‌సిటీ): దేశంలో మతతత్వానికి వ్యతిరేకంగా మానవత ఉద్యమం నిర్వహిస్తున్నామని జమాతే ఇస్లామీ హింద్ (జేఐహెచ్) జాతీయ కార్యదర్శి ఇక్బాల్ ముల్లా తెలిపారు. శనివారం రాత్రి స్థానిక సీక్యాంప్ సెంటర్‌లోని ప్రభుత్వ డ్రై వర్ల సంక్షేమ సంఘం కార్యాలయంలో జేఐహెచ్ సద్భావన సదస్సు జరిగింది. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. ఒకవైపు మతతత్వ వాదం పెరిగిపోతున్నా కేంద్ర ప్రభుత్వం నీతులు చెబుతోందని, మాటలకు చేతలకు పొంతన లేకుండా ఉందన్నారు. పరిస్థితి ఇలానే ఉంటే దేశం అన్ని రంగాల్లో వెనుకబడి పోయే ప్రమాదం ఉందన్నారు. రాజ్యాంగంలో లేని అంశాలను మాట్లాడుతున్నా ప్రభుత్వపర చర్యలు లేవన్నారు. ఈ పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు ఆగస్టు 21వ తేదీ నుంచి సెప్టెంబరు 4 వరకు ‘శాంతి–మానవత’ ఉద్యమం నిర్వహిస్తున్నామని, ఈ ఉద్యమానికి అందరూ అండగా నిలుస్తున్నారని తెలిపారు. దేశంలో శాంతిని పరిరక్షించేందుకు త్వరలో అన్ని మతాల సభ్యుల ప్రాతినిధ్యంతో పీస్ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఫిక్, రాష్ట్ర కమిటీ మెంబర్ ఎస్.ఎ.అమీర్, టీటీడీ రిటైర్డు కోఆర్డినేటర్ వై.సూర్యచంద్రారెడ్డి, డాక్టర్ హరిప్రసాద్ (బమ్‌సెఫ్), జె.రఘుబాబు (జేవీవీ), ఎంబీ చర్చి సీనియర్ పాస్టర్ విజయకుమార్, ప్యాడ్స్ జిల్లా కన్వీనర్ బాలన్న, జేఐహెచ్ మీడియా ఇన్‌చార్జి సైఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement