మతం నుంచి మానవత్వం వైపు...
మానవత్వాన్ని మించిన మతం లేదు. అయితే, మత పిచ్చితో, మత విద్వేషాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ జరుగుతున్న మారణహోమాలు కోకొల్లలు. అలాంటి మతం హద్దులను చెరిపేసి.. మతం కంటే మానవత్వం గొప్పదనే సత్యాన్ని మరోసారి నిరూపించాడు ఈ భారతీయ యువకుడు. న్యూజిలాండ్‌లో బిజినెస్ కోర్సు చదువుతున్న ఇతని పేరు హర్‌మాన్ సింగ్. మే 15వ తేదీన ఆక్లాండ్‌లో పాఠశాలకు వెళ్తున్న ఐదేళ్ల పిల్లాడిని ఓ కారు ఢీకొట్టింది. అటుగా వెళ్తున్న హర్‌మాన్ సింగ్ పరుగెత్తుకొచ్చాడు. తలకు గాయమై తీవ్రంగా రక్తమోడుతున్న పిల్లాడిని చూసి మనసు చలించింది.
వెంటనే మరో ఆలోచన లేకుండా తలపాగా తీసి పిల్లాడి తల చుట్టూ కట్టి ప్రాణాపాయం నుంచి కాపాడి ఆస్పత్రిలో చేర్పించాడు. మతాచారం ప్రకారం సిక్కులు బహిరంగంగా తలపాగా తీయడం నిషేధం. ఆన్‌లైన్‌లో విస్తృత ప్రచారం పొందిన ఈ వీడియో చూసి లక్షలాది మంది ప్రశంసల జల్లు కురిపించారు. మానవత్వం కంటే మరేదీ గొప్పది కాదని, అందుకే అలా చేశానని ‘వన్‌న్యూస్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. సాదాసీదా జీవితం గడుపుతున్న హర్‌మాన్ మానవత్వాన్ని మెచ్చుకున్న ఓ పెద్దాయన ఇతనికి ట్రక్కు నిండా ఫర్నీచర్‌ను బహుమతిగా పంపాడు.