
చంద్రబాబుది కాంగ్రెస్ డీఎన్‌ఏ కాదా? : డి.శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబుదీ కాంగ్రెస్ డీఎన్‌ఏనని పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ డీఎన్‌ఏ సంగతి గురించి ప్రత్యేకించి అడగాల్సిన అవసరమే లేదన్నారు. విభజనపై పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటేనే నాయకులవుతారని, వారి పెద్దరికమూ నిలబడుతుందనే విషయాన్ని మర్చిపోవద్దని సీఎం కిరణ్‌నుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. అలాగాక రాజకీయ జిమ్మిక్కులు చేస్తే.. హనుమంతుడిని చేయాలనుకుంటే కోతిగా మారిన చందంగా పరిస్థితి తయారవుతుందన్నారు. శుక్రవారం డీఎస్ 65వ జన్మదినం సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. కొందరు కార్యకర్తలు ‘కాబోయే తెలంగాణ సీఎం డీఎస్’ అని నినాదాలు చే స్తూ బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచారు. ఆయా నేతల సమక్షంలో డీఎస్ దంపతులు బర్త్‌డే కేక్ కట్‌చేశారు.
అనంతరం డీఎస్ మాట్లాడుతూ వచ్చేఏడాది తెలంగాణ రాష్ట్రంలోనే తన జన్మదినోత్సవం జరుపుకుంటానన్న ధీమా వ్యక్తం చేశారు. హైకమాండ్ విభజన నిర్ణయం తీసుకున్నాక స్వాగతించి కొత్త రాజధానికోసం రూ.నాలుగైదు లక్షల కోట్లు కావాలని కేంద్రాన్ని కోరిన చంద్రబాబు ఇప్పుడు యూ టర్న్, పీ టర్న్, క్యూ టర్న్‌ల పేరుతో ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ డీఎన్‌ఏ జగన్ అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నారు కదా!’ అన్న ఓ విలేకరి ప్రశ్నకు స్పందిస్తూ ‘‘చంద్రబాబు డీఎన్‌ఏ సంగతేంది? ఆయనదీ కాంగ్రెస్ డీఎన్‌ఏనే కదా! ఇక టీఆర్‌ఎస్ డీఎన్‌ఏ అంటారా? అసలు మీరా ప్రశ్న అడగాల్సిన అవసరమే లేదు’’ అని డీఎస్ బదులిచ్చారు. వైఎస్సార్‌సీపీ సమైక్యవాదం వినిపించటంపై అడిగిన ప్రశ్నకు స్పంది స్తూ.. ‘‘వాళ్లు ఏ పరిస్థితుల్లో సమైక్య ఆలోచన చేశారో! అయినా అది వాళ్ల ఇష్టం. మీరే అన్నారు కదా! నిర్ణయం మార్చుకున్నారని.. ప్రజాభిప్రాయం దృష్ట్యా మరోసారి నిర్ణయాన్ని మార్చుకుంటారేమో వేచి చూద్దాం’’ అని అన్నారు.