4 లక్షల ఏళ్లనాటి మనిషి డీఎన్‌ఏ సేకరణ!
బెర్లిన్: మానవ జీవ పరిణామ చరిత్రను కొత్త మలుపుతిప్పే అతి పురాతన డీఎన్‌ఏను శాస్త్రవేత్తలు సేకరించారు. స్పెయిన్‌లోని ఓ గుహలో లభించిన 4 లక్షల ఏళ్లనాటి మానవ శిలాజం తొడ ఎముక నుంచి వారు డీఎన్‌ఏను సేకరించగలిగారు. ఇప్పటిదాకా సేకరించిన మానవ డీఎన్‌ఏలలో ఇదే అతి పురాతనమైనది కావడం విశేషం. డీఎన్‌ఏ సేకరణలో వినూత్న టెక్నిక్‌లు ఉపయోగించి జర్మనీలోని మాక్స్‌ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ డీఎన్‌ఏను సేకరించారు. ఉత్తర స్పెయిన్‌లోని సిమాడీలాస్ హ్యూసోస్ గుహలో తవ్వకాల్లో బయటపడిన ఈ శిలాజం హోమో జాతికి చెందినదిగా నిర్ధారించారు.
అయితే 6 లక్షల ఏళ్లనాటి నియాండర్తల్ మానవులకు వారసులైన డెనిసోవన్ మానవుల డీఎన్‌ఏకు, తాజా డీఎన్‌ఏకు సంబంధం ఉండటంతో ఇప్పటిదాకా అంచనావేసిన మానవ పరిణామ చరిత్రలో పలు సందేహాలు మొదలయ్యాయి. ఆసియాలో డెనిసోవన్ మానవ జాతి 40 వేల ఏళ్ల క్రితమే అంతరించినట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది. అందువల్ల 4 లక్షల ఏళ్లనాటి ఆ డీఎన్‌ఏకు, 40 వేల ఏళ్లనాటి డెనిసోవన్ల డీఎన్‌ఏకు పోలిక ఉండటంతో మానవ పరిణామ వృక్షంలో మరిన్ని కొత్త శాఖలు, కలయికలు ఏర్పడి, అంతరించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.