నాతోపాటూ...రాష్ట్రాన్నీ అవమానించారు
పట్నా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఆయన ఒక బహిరంగ లేఖను బుధవారం ట్విట్టర్లో సంధించారు. ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంటరైన నితీష్ కుమార్ తన ట్విట్టర్లో ఈ లేఖను పోస్ట్ చేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్బంగా మోదీ తనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలతో తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా రాష్ట్ర ప్రజలను కూడా అవమానించారని ఆరోపించారు. ఇప్పటికైనా మోదీ తన డీఎన్ఎ గురించి చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని నితీష్ కుమార్ డిమాండ్ చేశారు. లేదంటే బీహార్ ప్రజలు ఆయనను క్షమించరని లేఖలో పేర్కొన్నారు.
మోదీ మాటలు తమలో చాలామందికి బాధ కలిగించాయని నితీష్ కుమార్ పేర్కొన్నారు. తాను బీహార్ బిడ్డననీ, బీహార్ ప్రజల డీఎన్ఎ తన డిఎన్ఎ ఒకటేనని స్పష్టం చేశారు. తన డీఎన్ఎ గురించి వ్యాఖ్యానించి బీహార్ ప్రజలను కూడా అవమానించారని మండిపడ్డారు. తమ పార్టీని బీహార్ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారని గుర్తుచేశారు.
గత నెలలో బీహార్లో పర్యటించిన ప్రధాని నరేంద్రమోదీ సీఎం నితీష్పై విమర్శలు గుప్పించారు. ఆయన (నితీష్్) జితేన్ రామ మాంఝీ లాంటి మహాదళితుణ్ని అవమానించడంద్వారా, నన్ను కూడా అగౌరవపర్చారని మోదీ వ్యాఖ్యానించారు. బహు శా ఆయన డిఎన్ఎలోనే ఏదో లోపముంది... భారతదేశంలోని ప్రజాస్వామ్యం వ్యవస్థలో ప్రతిపక్ష నాయకులను కూడా గౌరవించే సంస్కృతి ఉందని విమర్శించిన సంగతి తెలిసిందే.
Sharing my Open Letter to @NarendraModi about his comment on my DNA http://t.co/x1qypoZEus pic.twitter.com/dFekhbpLjI
— Nitish Kumar (@NitishKumar) August 5, 2015