వాషింగ్టన్: వారాంతాల్లో క్రమం తప్పకుండా మద్యం సేవించే యువకులు ఈ విషయంపై దష్టి సారించాల్సిందే. మద్యం వినియోగం ఆనవాళ్లు వారి డీఎన్‌ఏలో మిగిలి ఉంటున్నట్లు ఓ సరికొత్త అధ్యయనం హెచ్చరించింది. వారాంతాల్లో మద్య సేవనం యువకుల శరీరంలోని కణజాలంతో కూడిన కొవ్వు పదార్థాలు, జన్యు సంబంధ పదార్థాలపై (డీఎన్‌ఏ) చూపించే ప్రభావాన్ని ఈ అధ్యయనం విశ్లేషించింది. మద్యం సేవించే తొలినాళ్లలో అది కలిగించే నష్టం ఇంతకుముందు నిర్ధారణ కాలేదని పరిశోధకులు చెప్పారు. మెక్సికోలోని ఓ కళాశాలలో ఉపన్యాసం ఇస్తుండగా.. అడేలా రెండన్ అనే పరిశోధకుడికి వారాంతాల్లో మద్య సేవనం చూపించే మత్తు ప్రభావంపై అధ్యయనం చేయూలనే ఆలోచన వచ్చింది. సోమవారం ఉదయం జరిగిన ఈ తరగతికి హాజరైన అనేకమంది విద్యార్థులు.. వారాంతంలో మద్య సేవనం కారణంగా ఉపన్యాసంపై దష్టి కేంద్రీకరించలేక పోవడాన్ని రెండన్ గుర్తించారు.
ఈ నేపథ్యంలో మద్యం సేవించిన వారిని, మద్యం తాగని వారిని (18-23 ఏళ్ల వయస్సు) రెండు గ్రూపులుగా విభజించి పరిశోధకులు పలు విడతలుగా ప్రయోగాలు కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే యువకుల డీఎన్‌ఏపైనా మద్య సేవనం ప్రభావం చూపుతున్నట్టుగా గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 25 లక్షల మరణాలకు మద్యం కారణం కాగా.. వీరిలో 19-25 మధ్య వయస్సు యువకులు 3.2 లక్షల మంది వరకు ఉంటున్నారని వారు వెల్లడించారు. ఆల్కహాల్ అనే పత్రికలో ఈ అధ్యయనం ప్రచురితమైంది.