‘‘పెళ్లంటే మాటలా.. అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాల చరిత్ర చూడాల్సిందే కదా’’
‘‘అబ్బాయి ఎలాంటి వాడో ఏమో.. సంబంధం కలుపుకునే ముందే కొంచెం జాగ్రత్త’’
‘‘తల్లి లావుగా ఉంది.. పెళ్లయిన తరువాత అమ్మాయికూడా అలాగే అయితే..?’’
పెళ్లి సందర్భంగా దాదాపు అన్ని కుటుంబాల్లోనూ ఇలాంటి మాటలు వినిపిస్తుంటాయి. ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటామని చెప్పినా.. ఎందుకైనా మంచిది కాస్తా జాతకాలు కూడా చూసేద్దాం అనేవాళ్లూ లేకపోలేదు. దశాబ్దాలపాటు కలిసి జీవితం సాగించాల్సిన వారు సుఖంగా, సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఇవన్నీ ఒకప్పటి మాట అంటోంది సైన్స్. కేవలం చూపులతో.. కాసిన్ని విచారణలతో వ్యక్తుల గుణగణాలపై ఒక నిర్ధారణకు రావడం సరికాదని హెచ్చరిస్తోంది. ఈ పాతకాలపు పద్ధతులైన జన్మపత్రాన్ని కాకుండా.. జినోమ్ పత్రాన్ని నమ్ముకోవడం మేలని అంటోంది.
జినోమ్ పత్రి అంటే..
మన ఒడ్డూ పొడవు మొదలుకొని.. మనకు రాగల జబ్బుల వరకూ అన్నింటి సమాచారం జన్యువుల్లో ఉంటుందని మనకు తెలుసు కదా.. ఈ జన్యువుల్లోని సమాచారాన్ని చదివేందుకు వీలు కల్పించేదే ఈ జినోమ్ పత్రి. డీఎన్‌ఏ పోగు అడినైన్, గ్వానైన్, థయామీన్, సైటోసైన్ అనే నాలుగు రసాయనాలతో ఏర్పడి ఉంటుంది. వీటిని నూక్లియోటైడ్ బేసెస్ అని పిలుస్తారు.
ఈ బేసెస్ జంటలను బేస్ పెయిర్స్ అంటారు. ఇలాంటి 300 కోట్ల బేస్‌పెయిర్స్‌తో మెలితిరిగిన నిచ్చెన ఆకారంలో ఉంటుంది డీఎన్‌ఏ. ఈ డీఎన్‌ఏ పోగులోని భాగాలే జన్యువులు. మనుషుల్లో వీటి సంఖ్య దాదాపు 25 వేలు. మన జీవక్రియలకు అవసరమైన అన్ని రకాల ప్రొటీన్లను ఇవే ఉత్పత్తి చేస్తుంటాయి. వారసత్వంతోపాటు, వాతావరణం, ఆహారపు అలవాట్లు, జీవనశైలి వంటి అనేక కారణాలతో జన్యుక్రమంలో వచ్చే మార్పులు వ్యాధులకు దారితీస్తాయి అని సైన్స్ చెబుతోంది. ఆరోగ్య సమస్యలు లేని ఇద్దరు దంపతులైతే.. పుట్టబోయే బిడ్డకు జబ్బులేవీ దగ్గరకావన్నది తెలిసిందే.
మారుతున్న ట్రెండ్..
జాతకాలను బట్టి పెళ్లిళ్లు చేసుకోవడం భారత్ లాంటి దేశాల్లో ఇంకా కొనసాగుతున్నప్పటికీ విదేశాల్లో మాత్రం ట్రెండ్ మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మానవ జన్యుక్రమం నమోదు చేసే ఖర్చు గణనీయంగా తగ్గడం దీనికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు కోట్లకు కోట్లు పోస్తేగానీ సాధ్యం కాని జన్యుక్రమ నమోదు ఇప్పుడు లక్ష రూపాయల్లోపు మాత్రమే అవుతోంది. ఇదే సమయంలో జన్యువుల పనితీరు.. వ్యాధుల విషయంలో వీటి పాత్ర వంటి వాటిల్లో సైన్స్ కూడా బాగా అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో రెండు జన్యుక్రమాలను పోల్చి చూసి దంపతులైతే ఎలా ఉంటుందో చెప్పే ప్రత్యేక పరీక్షలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి.
స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బెర్న్ శాస్త్రవేత్త క్లాస్ వెడెకైండ్ కొన్నేళ్ల క్రితం చేసిన ఒక ప్రయోగం ఇలాంటి పరీక్షలకు మూలం. ఈ ప్రయోగంలో మహిళలు మగవారు వేసుకున్న టీషర్ట్‌ల వాసన ఆధారంగా తాము ఎవరిని ఇష్టపడ్డారో చెప్పారు. పలానా వారినే ఎందుకు ఎంచుకున్నారన్న విశ్లేషణ జరిపినప్పుడు మహిళలు తమకంటే భిన్నమైన హెచ్‌ఎల్‌ఏ జన్యువు ఉన్నవారిపట్ల ఆకర్షితులవుతున్నట్లు తెలిసింది. ఈ హెచ్‌ఎల్‌ఏ జన్యువు రోగ నిరోధక వ్యవస్థ చైతన్యానికి సూచిక. పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి జెనిటిక్ మ్యాచింగ్ చేసిపెట్టే కంపెనీలు బోలెడున్నా.. దేశంలో మాత్రం ఇలాంటివి వేళ్లమీద లెక్కపెట్టేటన్ని మాత్రమే ఉన్నాయి. ఐదేళ్ల క్రితం కాలిఫోర్నియా, నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన ఒక పరిశోధన ప్రకారం 5–హెచ్‌టీటీఎల్‌పీఆర్ అనే జన్యువుల్లో తేడాలుంటే సంసారం సాఫీగా సాగదని, మానసిక ఉద్వేగాలను ప్రభావితం చేసే ఈ జన్యువులున్న వారు విడాకులు తీసుకునే అవకాశాలు ఎక్కువని తేలింది.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment