సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోరపరాజయానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పదవి నుంచి తప్పుకున్నారు. తాజాగా ఆయన బాటలోనే మరికొంతమంది కాంగ్రెస్ సీనియర్ లీడర్లు పయనిస్తున్నారు. కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు జ్యోతిరాదిత్య సింధియా ఆదివారం స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. ముంబై కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి మిలింద్ డియోరా వైదొలగిన కొద్ది గంటల్లోనే సింధియా కూడా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
‘ప్రజాతీర్పును గౌరవిస్తున్నాను. పార్టీ ఓటమికి బాధ్యతవహిస్తూ.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నాను. రాహుల్ గాంధీకి రాజీనామా లేఖను పంపించాను’అని ట్వీట్ చేశారు సింధియా. జనరల్ సెక్రటరీగా పార్టీకి సేవచేసే అవకాశాన్నిఇచ్చినందుకు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.
అప్పుడే నిర్ణయించుకున్నాను...
మిలింద్ డియోరా ముంబై కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. జూన్ 26న రాహుల్ గాంధీని కలిసినప్పుడే రాజీనామాపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ‘ముంబైలోని కాంగ్రెస్ నాయకులను ఒక్కటిచేసి.. పార్టీ బలోపేతానికి కృషిచేద్దామనుకున్నాను. ఆ ఉద్దేశంతోనే ముంబై కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టాను. రాహుల్‌తో చర్చించాక నేను కూడా రాజీనామా చేయాలనుకున్నాను’ అని డియోరా ఓ ప్రకటనలో చెప్పుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే ముంబై కాంగ్రెస్ చీఫ్‌గా మిలింద్ బాధ్యతలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment