అంబానీ మద్దతుపై దుమారం | Mukesh Ambani backs Congress Milind Deora for South Mumbai | Sakshi
Sakshi News home page

అంబానీ మద్దతుపై దుమారం

Published Sun, Apr 21 2019 5:31 AM | Last Updated on Sun, Apr 21 2019 5:31 AM

Mukesh Ambani backs Congress Milind Deora for South Mumbai - Sakshi

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ దక్షిణ ముంబై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి మిలింద్‌ డియోరాకు బాహాటంగా మద్దతు ప్రకటించడం రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంబానీ మద్దతు ప్రకటిస్తున్న వీడియోను డియోరా తన ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పెట్టారు. ‘పదేళ్లుగా దక్షిణ ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న మిలింద్‌కు ఈ నియోజకవర్గానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందని నా విశ్వాసం. అందుకే ఈ నియోజకవర్గానికి మిలిందే తగిన వ్యక్తి’ అని అంబానీ అన్నట్టు ఆ వీడియోలో ఉంది. దేశంలోని బడా పారిశ్రామికవేత్తలెవరూ ఇంత వరకు ఒక పార్టీ అభ్యర్థికి బహిరంగంగా మద్దతు ప్రకటించడం జరగలేదు. అలాంటిది దేశంలోనే నంబర్‌వన్‌ పారిశ్రామికవేత్త అయిన అంబానీ ఒక అభ్యర్థికి, అదీ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం విశేషమేనని రాజకీయ నిపుణులు అంటున్నారు.

రెండోసారి అధికారంలోకి రావాలని మోదీ ప్రయత్నిస్తున్న తరుణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రతిపక్ష అభ్యర్థికి మద్దతు ప్రకటించడం అధికార బీజేపీకి ఇబ్బందికరమేనని వారు అభిప్రాయపడుతున్నారు. ముకేశ్‌ ప్రకటనపై బీజేపీ నేతలు నొసలు చిట్లిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో విమర్శిస్తున్నారు. కాగా, అంబానీ, డియోరా చిరకాల మిత్రులని, అందువల్ల అంబానీ ప్రకటనను మరో కోణంలో చూడాల్సిన పనే లేదని పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అంబానీ తండ్రి ధీరూభాయ్, డియోరా తండ్రి మురళీ మంచి మిత్రులు. వారి స్నేహం గురించి అప్పట్లో రాజకీయ వర్గాల్లో వేడివేడి చర్చ కూడా జరిగేది. ముకేశ్‌ తాజా నిర్ణయానికి అది కూడా కారణం కావచ్చునని ఆ వర్గాలు వివరించాయి. ముకేశ్‌ ఉన్న వీడియోలో కోటక్‌ మహీంద్ర బ్యాంకు ఎండీ ఉదయ్‌ కొటక్‌ కూడా ఉండటం గమనార్హం. రఫేల్‌ కుంభకోణంలో ముకేశ్‌ సోదరుడు అనిల్‌ అంబానీ ఇరుక్కోవడం తెలిసిందే. దక్షిణ ముంబై నియోజకవర్గంలో ఈ నెల 29న పోలింగ్‌ జరగనుంది. ఇక్కడ డియోరా, శివసేన అభ్యర్థి అరవింద్‌ సావంత్‌తో తలపడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement