South mumbai Lok Sabha constituency
-
అంబానీ మద్దతుపై దుమారం
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ దక్షిణ ముంబై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ డియోరాకు బాహాటంగా మద్దతు ప్రకటించడం రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంబానీ మద్దతు ప్రకటిస్తున్న వీడియోను డియోరా తన ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టారు. ‘పదేళ్లుగా దక్షిణ ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న మిలింద్కు ఈ నియోజకవర్గానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందని నా విశ్వాసం. అందుకే ఈ నియోజకవర్గానికి మిలిందే తగిన వ్యక్తి’ అని అంబానీ అన్నట్టు ఆ వీడియోలో ఉంది. దేశంలోని బడా పారిశ్రామికవేత్తలెవరూ ఇంత వరకు ఒక పార్టీ అభ్యర్థికి బహిరంగంగా మద్దతు ప్రకటించడం జరగలేదు. అలాంటిది దేశంలోనే నంబర్‌వన్ పారిశ్రామికవేత్త అయిన అంబానీ ఒక అభ్యర్థికి, అదీ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం విశేషమేనని రాజకీయ నిపుణులు అంటున్నారు. రెండోసారి అధికారంలోకి రావాలని మోదీ ప్రయత్నిస్తున్న తరుణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రతిపక్ష అభ్యర్థికి మద్దతు ప్రకటించడం అధికార బీజేపీకి ఇబ్బందికరమేనని వారు అభిప్రాయపడుతున్నారు. ముకేశ్ ప్రకటనపై బీజేపీ నేతలు నొసలు చిట్లిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో విమర్శిస్తున్నారు. కాగా, అంబానీ, డియోరా చిరకాల మిత్రులని, అందువల్ల అంబానీ ప్రకటనను మరో కోణంలో చూడాల్సిన పనే లేదని పారిశ్రామిక వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అంబానీ తండ్రి ధీరూభాయ్, డియోరా తండ్రి మురళీ మంచి మిత్రులు. వారి స్నేహం గురించి అప్పట్లో రాజకీయ వర్గాల్లో వేడివేడి చర్చ కూడా జరిగేది. ముకేశ్ తాజా నిర్ణయానికి అది కూడా కారణం కావచ్చునని ఆ వర్గాలు వివరించాయి. ముకేశ్ ఉన్న వీడియోలో కోటక్ మహీంద్ర బ్యాంకు ఎండీ ఉదయ్ కొటక్ కూడా ఉండటం గమనార్హం. రఫేల్ కుంభకోణంలో ముకేశ్ సోదరుడు అనిల్ అంబానీ ఇరుక్కోవడం తెలిసిందే. దక్షిణ ముంబై నియోజకవర్గంలో ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. ఇక్కడ డియోరా, శివసేన అభ్యర్థి అరవింద్ సావంత్‌తో తలపడుతున్నారు. -
‘దక్షిణ ముంబై’ బరి మరాఠీ, తెలుగు ఓటర్లే కీలకం
సాక్షి, ముంబై: దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో వివిధ రాష్ట్రాల ప్రజలు ఉంటున్నప్పటికీ మరాఠీ, తెలుగు ప్రజల ఓట్లే కీలకం. గతంలో జరిగిన లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులు తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు నానాతంటాలు పడ్డారు. మూడో విడత ఎన్నికలకు సమయం దగ్గర పడడం, ఇదే ఆఖరు ఆదివారం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే వర్లీ, లోయర్‌పరేల్, దీపక్ టాకీస్ పరిసరాల్లో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భవనాలు, చాల్స్ వద్ద పర్యటిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు. తాము గెలిస్తే చేపట్టే అభివృద్థి పనులపై తెలుగు ప్రజలతో సమావేశాలు, పలుకుబడిన వ్యక్తులతో మంతనాలు జరుపుతున్నారు. ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు అనేక వస్త్రమిల్లులు ఉండేవి. ప్రస్తుతం అవి మూతపడడంతో అనేకమంది తెలుగు ప్రజలు స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ఈ ప్రాంతంలో అత్యధిక శాతం పేద, మధ్యతరగతి కుటుంబాలే నివసిస్తున్నాయి. మూతపడిన మిల్లు స్థలాల్లో నిర్మిస్తున్న ఇళ్లు ఉచితంగా ఇవ్వాలని వివిధ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో అనేక పోరాటాలు కూడా చేశాయి. అయితే అధికార డీఎఫ్ కూటమి ప్రభుత్వం అంగీకరించ లేదు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రోడ్డునపడ్డ మిల్లు కార్మికులకు ఉచితంగా ఇళ్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామంటూ ప్రధాన పార్టీలు హామీ ఇస్తున్నాయి. ఆకాశాన్నంటిన నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని, పేదలకు రేషన్ షాపుల్లో అతి తక్కువ ధరకే సరుకుల పంపిణీ ఇలా రకరకాల హామీలు గుప్పిస్తున్నారు. ఇలా ఇస్తున్న హామీలపై దక్షిణ ముంబై లోక్‌సభ నియోజక వర్గం తెలుగు ప్రజలు ఏమంటున్నారో తెలుసుకుందాం.