సాక్షి ముంబై: నగరవ్యాప్తంగా ఉన్న మొబైల్ టవర్ల రేడియేషన్‌ను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర టెలికమ్యూనికేషన్స్ సహాయక మంత్రి మిలింద్ దేవరా తెలిపారు. ప్రజలు, సామాజిక సంస్థల డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన విలేకరులకు వెల్లడించారు. రేడియేషన్‌కు సంబంధించి అంతర్జాతీయ నియమాలకు అనుగుణంగా భారత్‌లో రేడియేషన్ విడుదల స్థాయుల తగ్గింపునకు గత ఏడాదే ఆదేశాలు జారీ చేశామన్నారు.
అంతకుముందు రేడియేషన్ తీవ్రత 4,500 మి.లి.వాట్స్ పర్ స్క్వేర్ మీటర్ ఉండేదని, దానిని 450 మి.లి. వాట్స్ పర్ స్క్వేర్ మీటర్‌కు తగ్గించినట్లు వివరించారు. ఫ్రాన్స్, రష్యా, బెల్జియం, ఆస్ట్రియా దేశాలతో పోలిస్తే భారత్‌లో రేడియేషన్ స్థాయులు చాలా ఎక్కువగా ఉన్నాయని ఎన్జీఓలు వాదిస్తుండడాన్ని కూడా దేవరా ప్రస్తావించారు. ‘రేడియేషన్‌తో వల్ల కలిగే దుష్ర్పభవాలపై భారత్‌లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. మనుషులతోపాటు పక్షి, ఇతర ప్రాణులపై కూడా ఇది దుష్ర్పభావం చూపుతుందని అధ్యయనాల్లో వెల్లడయింది’ అని ఆయన పేర్కొన్నారు. అందుకే రేడియేషన్ ఫ్రీక్వెన్సీలను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రేడియేషన్ విడుదల నిబంధనలను భారత్‌లోని టెలికాం కంపెనీలు పాటించడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయన్నారు. ఒక టవర్‌పై ఉన్న యాంటెన్నాల సంఖ్య ఆధారంగా రేడియేషన్ తీవ్రతను లెక్కిస్తారు. ఒకే టవర్‌పై అనేక యాంటెన్నాలు ఉంటే అధికముప్పు ఉంటుందని ముంబై ఐఐటీ ప్రొఫెసర్ గిరిష్‌కుమార్ తెలిపారు.
టవర్ల ఏర్పాటుకు పాటించాల్సిన నిబంధనలు
ఒక భవనంపై ఒకే టవర్‌కు అనుమతి ఇవ్వాలి. అందులో నివసించే 70 శాతం మంది, ముఖ్యంగా చివరి అంతస్తులో ఉంటున్న వారి అంగీకారం కచ్చితంగా ఉండాలి. పాఠశాల, కళాశాలలు, ఆస్పత్రి, వృద్ధాశ్రమాలు ఉన్న ప్రాంతాల్లో మొబైల్ టవర్లకు అనుమతి లభించదు. ఇక ముంబై నగరంలో మొత్తం 4,779 మొబైల్ టవర్లు ఉన్నాయి. అందులో 1,159 టవర్లు మినహా మిగతావన్నీ అనధికారికంగానే ఏర్పాటయ్యాయి. మొబైల్ టవర్ల రేడియేషన్ వల్ల నిద్రలేమి, తలనొప్పి, చిరాకు, ఉదాసీనత, మతిమరుపు, పక్షవాతం, సంతానం కలగకపోవడం, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి.