సాక్షి, హైదరాబాద్: దేశ భవిష్యత్తుకు ప్రాంతీయ పార్టీలే బలమైన పునాదులని మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బలమైన ప్రతిపక్షంగా కూడా నిలవలేని కాంగ్రెస్ పార్టీ...దేశంలో ప్రాంతీయ పార్టీలను నాశనం చేసే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ చేతగానీ, అసమర్థత కారణంగానే బీజేపీ మనుగడ కొనసాగుతోందని విమర్శలు గుప్పించారు.
ఈ మేరకు ఎక్స్‌లో కేటీఆర్ స్పందిస్తూ.. ‘ప్రాంతీయ పార్టీల కృషిని విస్మరిస్తూ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు సిగ్గు లేకుండా విమర్శలు చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి నీ స్పీచ్‌లు, బ్యాగులు, ఛాపర్లు కూడా మీ పార్టీని ఘోర ఓటమి నుంచి కాపాడలేకపోయాయి. ఆయన అసత్య ప్రచారాన్ని మరాఠా ప్రజలు నమ్మలేదు
ఇకనైనా తెలంగాణలో గెలిపించి ప్రజల కోసం.. వాళ్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చటం కోసం పనిచేయాలి. ఏడాది క్రితం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలుపై దృష్టి పెట్టాలి. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలనే కుట్రలో కాంగ్రెస్ ఎక్కువ కాదు.. బీజేపీ తక్కువ కాదు’అని కేటీఆర్ పేర్కొన్నారు.
హేమంత్ సోరేన్ కు శుభాకాంక్షలు: హరీష్ రావు
‘మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీ ప్రజలు నమ్మలేదు అని స్పష్టం అయ్యింది. ెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారు. తెలంగాణలో మహిళలకు ₹ 2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్ర లో రూ.3,000 ఇస్తామనడం, రైతు భరోసా ఎగ్గొట్టడం, ఆసారా ధోఖ, రైతు రుణమాఫీ ఏడాది గడుస్తున్నా పూర్తి చేయకపోవడం వంటివి మహారాష్ట్రలో తీవ్ర ప్రభావం చూపెట్టాయి.
తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలోని ముంబై, షోలాపూర్, పూణే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తుండడం వలన కాంగ్రెస్ మోసాలు విరివిగా మహారాష్ట్ర లో ప్రచారం అయ్యాయి అనేది సుస్పష్టం. బీజేపీ పార్టీ.. హేమంత్ సోరేన్ పై పెట్టిన అక్రమ కేసులు, అరెస్టులు, పార్టీ చీల్చే ప్రయత్నాలను జార్ఖండ్ ప్రజలు తిప్పి కొట్టారు. బీజేపీ కక్ష సాధింపు విధానాలని ప్రజలు హర్శించడం లేదని తేలిపోయింది. విజయం సాధించిన హేమంత్ సోరేన్ కు శుభాకాంక్షలు.’ అని తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment