కౌంటింగ్‌ వేళ.. చార్టెడ్‌ ఫ్లైయిట్స్‌, సంతకాల సేకరణ! | Maharashtra Results 2024: Resort Politics Begins In MVA AND Mahayuti To Airlift MLAs To Safe Location | Sakshi
Sakshi News home page

Maharashtra: కౌంటింగ్‌ వేళ.. చార్టెడ్‌ ఫ్లైయిట్స్‌, సంతకాల సేకరణ

Published Sat, Nov 23 2024 8:49 AM | Last Updated on Sat, Nov 23 2024 12:42 PM

Maharashtra Results 2024: Resort Politics Begins In MVA AND Mahayuti  To Airlift MLAs To Safe Location

ముంబై: మహారాష్ట్రలో హో రాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమరంలో విజేతలెవరో నేడు(శనివారం) తేలిపోనుంది. ప్రస్తుతం ఈసీ అధికారుల పటిష్ట భద్రత నడుమ   ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్‌ పవార్‌) మహాయుతి కూటమి ప్రజల మన్ననలు పొంది అధికారాన్ని నిలబెట్టుకుంటుందా.. లేక కాంగ్రెస్‌, శివసేన(ఉద్దవ్‌),ఎన్సీపీ(శరద్‌ పవార్‌) మహా వికాస్‌ అఘాడీ కూటమి సత్తా చాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందా అనే ఉత్కంఠకు నేటి సాయంత్రంతో తెరపడనుంది.

అయితే ఫలితాలు వెల్లడికాకముందే మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్రంలో హంగ్‌ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉండటంతో మహాయుతి, ఎంవీఏ కూటమిలు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండాగానే గెలిచిన అభ్యర్థులను  ప్రత్యర్థి పార్టీలు గాలం వేయకుండా ఉండేందుకు రిసార్ట్‌ రాజకీయాలు మొదలు పెట్టాయి.  అభ్యర్థులు కోసం ఫైవ్‌ స్టార్‌ హోటళ్లను బుక్‌ చేయడం, చార్టర్డ్‌ విమానాలను ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యాయి.

ఎన్నికల్లో విజయం సాధించిన తమ అభ్యర్థులందరినీ వెంటనే ముంబైలో శిబిరానికి తరలించాలని మహా వికాస్‌ అఘాడీ నిర్ణయించింది. మెజార్టీ వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల సంతకాల సేకరణకు జాప్యం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న ఎంవీఏ.. తమ అభ్యర్థుల నుంచి డిజిటల్‌ సిగ్నేచర్లు(సంతకాలు) సేకరిస్తోంది.  

ఫిరాయింపులను అరికట్టేందుకు కసరత్తు
ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు, పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్టవేసేందుకు ఇప్పటికే కాంగ్రెస్‌ శిబిర రాజకీయాలకు తెరలేపింది. ఎన్నికైన ఎమ్మెల్యేలతో నిత్యం టచ్‌లో ఉంటూ, అవసరమైతే వారిని హెలికాప్టర్‌ ద్వారా శిబిరాలకు తరలించే బాధ్యతను ప్రతిపక్ష నేత విజయ్‌ వడెట్టివార్‌కు అప్పగించింది. 

గెలిచిన అభ్యర్థులను బీజేపీ కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున, తమ ఎమ్మెల్యేలను ఐక్యంగా ఉంచేందుకు కాంగ్రెస్‌ ఈ వ్యూహాత్మక ఎత్తుగడకు ప్లాన్‌ వేసింది. ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏ‍ర్పాటు ప్రక్రియ పూర్తయ్యే వరకు తమ ఎమ్మెల్యేలను కర్ణాటక, లేదా తెలంగాణలో సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది.  

శివసేన ముందు జాగ్రత్త   
తమ ఎమ్మెల్యేలపై బీజేపీ కూటమి వల విసిరే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా వారిని శిబిరానికి తరలించాలని నిర్ణయించినట్లు శివసేన(యూబీటీ) అగ్రనేత సంజయ్‌ రౌత్‌ శుక్రవారం వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని కనీసం 160-165 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. గెలిచే అవకాశం ఉన్న స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటికే తమకు మద్దతు ప్రకటించారని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement