సాక్షి, ముంబై: ఎన్సీపీ సీనియర్ నాయకుడు, ఉప-ముఖ్యమంత్రి అజిత్ పవార్‌పై బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే ఘాటైన ఆరోపణలు గుప్పించారు. అజిత్ పవార్‌ను మహారాష్ట్ర లాలూప్రసాద్ యాదవ్‌గా ఆయన అభివర్ణించారు. ఔరంగాబాద్‌లో సోమవారం జరిగిన రైతుల సదస్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్, ఎన్సీపీపై ముండే దుమ్మెత్తిపోశారు. రైతులను ఉద్దేశించిన మాట్లాడుతూ జలవనరులశాఖలో జరిగిన కుంభకోణంపై దర్యాప్తు చేయాలని ఎవరూ డిమాండ్ చేయాల్సిన అవసరమే లేదన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తామే ఈ కుంభకోణంపై దర్యాప్తునకు ఆదేశిస్తామని హమీ ఇచ్చారు. గడ్డి కుంభకోణంలో లాలుకు జైలు శిక్ష పడినట్టు నీటిపారుదల కుంభకోణంలో అజిత్ పవార్‌కు జైలు శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. అయితే పవార్‌ను యెరవాడ లేదా హర్సుల్ జైల్లో ఉంచాలా అనేది ప్రజలే నిర్ణయించాలన్నారు.