ఎన్సీపీ ‘మహా’నేతగా తట్కరే
- బీసీ నేతకు రాష్ట్ర పార్టీ పగ్గాలు
- ఓబీసీ ఓట్లకు గాలం వేసేందుకే ‘మాలీ’ నేత ఎంపిక
ముంబై: జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మహారాష్ట్ర అధ్యక్షునిగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి సునీల్ తట్కరే నియమితులయ్యారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో కంగుతిన్న ఎన్సీపీ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీసీ నాయకుడు సునీల్ తట్కరేకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించింది. గత ఏడాది జూన్ 14 నుంచి రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్న భాస్కర్ యాదవ్ స్థానంలో తట్కరేను నియమిస్తూ ఎన్సీపీ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. బుధవారం జరిగిన పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో తట్కరే పేరును భాస్కర్ యాదవ్ ప్రతిపాదించారు.
ఈ ప్రతిపాదనకు పార్టీ సీనియర్ నేతలు మధుకర్ పిచడ్, హసన్ ముష్రిఫ్, అనిల్ దేశ్‌ముఖ్, అన్నా డాంగే మద్దతు తెలిపారు. పార్టీ అత్యున్నత పదవిలో ఓ ఓబీసీ నాయకుడు ఉండాలని అధినేత శరద్‌పవార్ పట్టుబట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వరుసగా నాలుగోసారి రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తున్న ఎన్సీపీ, కీలకమైన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే కీలకమైన పదవిలో బీసీ నాయకుడు ఉండాలని భావించినట్లు తెలిపాయి.
మాలీ కులానికి చెందిన తట్కరే ఎంపిక ద్వారా ఇతర వెనుకబడిన వర్గాల వారిని తమవైపు తిప్పుకోవచ్చని ఎన్సీపీ భావిస్తోంది. ప్రముఖ బీసీ నాయకుడు, బీజేపీ నేత గోపీనాథ్ ముండే మరణంతో ఆ వర్గాల్లో ఏర్పడిన ఖాళీని తట్కరేతో పూరించాలని ఎన్సీపీ యోచిస్తోంది. ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీకి ముఖ్యమంత్రి పదవి దక్కేలా తట్కరే కృషి చేయగలరని హసన్ ముష్రిఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
సర్పంచ్‌గా ప్రారంభమై, రాయిగడ్ జిల్లా పరిషత్ సభ్యునిగా, మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షునిగా, ఆ తరువాత మంత్రిగా తట్కరే అంచెలంచెలుగా ఎదిగారని పలువురు కొనియాడారు. ఆర్థిక శాఖ, జల వనరుల శాఖలకు ఆయన మంత్రిగా పని చేశారని అన్నారు. పార్టీ నిర్మాణంలో ఆయన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు శరద్‌పవార్ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికలు
అతిక్లిష్టమైనవని అన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని మరచిపోయి తాజాగా అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్ధం కావాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజల్లో కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడిందని, ఆ ఫలితాన్ని ఎన్సీపీ కూడా అనుభవించాల్సి వచ్చిందని పవార్ వ్యాఖ్యానించారు. పరిపాలనలో తమ పాత్ర నామమాత్రమే అయినప్పటికీ ప్రభుత్వంపై వ్యతిరేకత తమపై కూడా పడిందని అన్నారు.
అవినీతి ఆరోపణలపై స్పందించడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పొందిన ఓట్ల ఆధారంగా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల బేరం చేయాలని ఆయన తట్కరేకు సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 174 స్థానాల్లో, ఎన్సీపీ 114 స్థానాల్లో పోటీ చేశాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-శివసేన విజయంపై పవార్ ‘‘సునామీ ప్రతిసారీ రాదు’’ అని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ కూడా పాల్గొన్నారు.