కేబినెట్‌లోకి భాస్కర్ జాదవ్
మంత్రిగా ప్రమాణం చేసిన రాష్ట్ర ఎన్సీపీ మాజీ సారథి
సాక్షి, ముంబై: ఎన్సీపీ మాజీ రాష్ట్రాధ్యక్షుడు భాస్కర్ జాదవ్‌కు ఊహించినట్టుగానే రాష్ట్ర కేబినేట్‌లో చోటుదక్కింది. మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుని పదవి నుంచి బుధవారం ఆయన వైదొలగిన అనంతరం ఆ బాధ్యతలను సునీల్ తట్కరేకు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటిదాకా తాను కొనసాగిన జలవనరులశాఖ మంత్రి పదవి నుంచి తట్కరే తప్పుకోవడం, భాస్కర్ జాదవ్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. అయితే జాదవ్‌కు ఏ శాఖ కట్టబెట్టనున్నారనే విషయమై ఇప్పటిదాకా ఎటువంటి వివరాలు వెలువడలేదు.
అయితే జలవనరులశాఖనే కట్టబెట్టనున్నారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అయితే ఆయనకు మరో శాఖను కట్టబెడితే మరికొందరి శాఖలు కూడా మార్చాల్సి ఉంటుందని, ఎన్నికల ముందు ఈ హడావుడి అక్కరలేదని పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్సీపీ మార్పులు చేసింది. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ కె. శంకర్‌నారాయణ, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, ప్రజాపనులశాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్, విధాన మండలి చైర్మన్ శివాజీరావ్ దేశ్‌ముఖ్, విధానసభ చెర్మైన్ దిలీప్‌వల్సే పాటిల్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి జాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.