ముంబై: మంత్రి సునీల్ తట్కరేపై మనీల్యాండరింగ్, భూకబ్జా కేసులకు సంబంధించి విచారించిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), నగర పోలీసు శాఖ అనుబంధ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈవోడబ్ల్యూ), రాయ్‌గఢ్ జిల్లా కలెక్టర్ మంగళవారం హైకోర్టుకు తుది నివేదిక సమర్పించారు. కాగా మంత్రిపై ఆరోపణలపై విచారణ జరిపాలంటూ వివిధ దర్యాప్తు సంస్థలను గత ఏడాది అక్టోబర్‌లో హైకోర్టు ఆదేశించిన సంగతి విదితమే. ఈ మేరకు రాయ్‌గఢ్ జిల్లా కలెక్టర్‌తోపాటు ఏసీబీ, ఈవోడబ్ల్యూ అధికారులు తమ తమ నివేదికలను జస్టిస్ ఎస్.జె.వజిఫ్‌దార్, జీఎస్ పటేల్‌ల నేతృత్వంలోని ధర్మాసనానికి సమర్పించారు. ఇదిలాఉంచితే మంత్రి సునీల్ తట్కరే, ఆయన బంధువులు ఏర్పాటుచేసిన కంపెనీలు మనీల్యాండరింగ్‌తోపాటు భూకబ్జాలకు పాల్పడ్డాయని, ఈ వ్యవహారంపై విచారణ జరిపించాల్సిందిగా కోరుతూ బీజేపీ అగ్రనాయకుడు కిరీట్ సోమయ్య గతంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేసిన సంగతి విదితమే.