ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో అధికార డీఎఫ్ కూటమి దారుణ పరాభవం అనంతరం జరిగిన తొలి రాష్ట్ర కేబినెట్ సమావేశం గరంగరంగా సాగింది. ఈ ఎన్నికల్లో మహా కూటమి అభ్యర్థుల చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్, ఎన్‌సీపీ మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో ముందుకు సాగని అభివృద్ధి పనుల గురించి గళమెత్తారు. ఈ సమావేశానికి ఛగన్ భుజ్‌బల్, సురేశ్ దాస్, సునీల్ తట్కరే, శివాజీరావ్ మోఘే కూడా హాజరయ్యారు. రాయ్‌గఢ్ స్థానం నుంచి శివసేన ఎంపీ అనంత్ గీతే చేతిలో ఓడిన తట్కరే మాట్లాడుతూ దిగ్గి పోర్టు అభివృద్ధిలో జాప్యం జరుగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ పనులు చేపట్టిన డెవలపర్‌కు నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. బీడ్‌లో బీజేపీ నేత గోపీనాథ్ ముండే చేతిలో ఓడిన దాస్ మాట్లాడుతూ మరాఠ్వాడా ప్రాంతంలో నీటి కొరత సమస్యను లేవనెత్తారు. దీనిని పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర మంత్రులు వివాదాస్పద టోల్ వసూలు గురించి ఘాటుగా మాట్లాడారు. నాగపూర్ లోక్‌సభ పరిధిలోకి వచ్చే తన నియోజకవర్గంలో ప్రత్యర్థి, బీజేపీ నేత గడ్కారీ 12 వేల ఓట్ల ఆధిక్యత రావడంతో పదవికి రాజీనామా చేసిన ఉపాధి హామీ పథక మంత్రి నితిన్ రౌత్ గరంగరంగానే మాట్లాడారు. రాష్ట్రంలో జాతీయ న్యాయ పాఠశాల ఏర్పాటులో జరుగుతున్న ఆలస్యాన్ని లేవనెత్తారు. అడ్మిషన్ విధానాన్ని ప్రారంభించేందుకు కేబినెట్‌లో ప్రతిపాదన పెట్టాలని డిమాండ్ చేశారు.
ముంబై, నాగపూర్, ఔరంగాబాద్‌లో ఈ న్యాయ పాఠశాలలు ఏర్పాటుచేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. బుల్దానా, నాగపూర్, వార్ధా జిల్లా సహకార బ్యాంక్‌ల ఆర్థిక ఇబ్బందులపై కూడా కేబినెట్ భేటీలో చర్చకు వచ్చింది. రూ.260 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. చేపల్లో వ్యాధులు త్వరితగతిన గుర్తించేందుకు పాల్ఘర్‌లో ల్యాబోరేటరీ ఏర్పాటుకోసం పది ఎకరాలను కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసు సిబ్బందికి పోస్టింగ్‌లను ఇవ్వనుంది. ఈ ప్రాంతాల్లో పనిచేసే పోలీసు కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి కల్పించేందుకోసం నాగపూర్ రేంజ్ ఐజీ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ పోలీసు ఇన్‌స్పెక్టర్ పదోన్నతులను రాష్ట్ర డీజీపీ నేతృత్వంలోని కమిటీ పరిశీలిస్తుంది. రెండు సంవత్సరాల పాటు ఈ ప్రాంతాల్లో పనిచేసిన వారికి ఈ పదోన్నతులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.
అధిష్టానం తీరే కొంపముంచింది: చవాన్
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాభవంతో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పదవికి రాజీనామా చేయాలని అటు ప్రతిపక్షంతో పాటు ఇటు అధికార పక్షంలోని నేతల నుంచే డిమాండ్ పెరుగుతోంది. దీంతో తన పదవికి ఎక్కడ ఎసరు వస్తుందో ఏమో అనుకున్నాడో గానీ ఈ ఓటమికి కారణం కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనని తేల్చిచెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో ఆఫ్ ది రికార్డ్‌గా ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోవడానికి అధిష్టానమే కారణమని చవాన్ చేతులెత్తేశారు. విపరీతంగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, పెరిగిన అవినీతి, వెలుగులోకి వచ్చిన కుంభకోణాలు ఓటమికి కారణాలయ్యాయని వివరణ ఇచ్చారు. అందుకు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు.
కాగా, లోక్‌సభ ఎన్నికల తర్వాత చవాన్ రాజీనామా చేయాలని అయన వ్యతిరేకులతోపాటు అనుకూలురు కూడా పట్టుబట్టారు. శాసనసభ ఎన్నికలు మరో ఐదు నెలల్లో జరగనున్నాయి. చవాన్ రాజీనామా చేస్తే కనీసం ఈ ఐదు నెలల పాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని అనేకమంది ప్రముఖులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయినా చవాన్ ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు సిద్ధంగా లేరు. నాయకత్వం మారే అవకాశాలు లేకపోవడంతో సీఎం కూడా ధైర్యంగా ఉన్నారు. చివరకు ఓటమిని కాంగ్రెస్ అధిష్టానంపై నెట్టేసి చేతులెత్తేశారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన ఓటమి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక చాలెంజ్‌గా పరిణమించనుంది.
ఇప్పటినుంచే సాధ్యమైనన్ని ప్రజోపయోగ పనులు చేపట్టాలనుకుంటున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 240 శాసనసభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ నాయకులు వెనకబడడం చింతించాల్సిన విషయమ’ని చవాన్ అంగీకరించారు. ముఖ్యమంత్రిగా తననే కొనసాగించాలా...? లేక మరొకరిని నియమించాలనేది పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. ఒకవేళ సీఎం పదవి నుంచి తొలగిస్తే తన రాజకీయ భవిష్యత్‌పై కూడా నిర్ణయం తీసుకోవాలని పార్టీ అధిష్టానానికి సూచించినట్లు ఆయన వెల్లడించారు.
గరంగరంగా కేబినెట్ భేటీ
Published Wed, May 21 2014 10:28 PM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM
Advertisement
Advertisement