సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన గురువారం (ఈ నెల 18న) మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. కొత్త సచివాలయంలో ఇదే తొలి కేబినెట్ భేటీ కానుండటం గమనార్హం. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఈ భేటీలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్య క్రమాల అమలుతీరును లోతుగా సమీక్షించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి.
నాలుగు నెలలే గడువు ఉండటంతో..
కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను అక్టోబర్‌లో ప్రకటించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఆ వెంటనే రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది. అంటే స్థూలంగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపు లక్ష్యంగా.. ఈ నాలుగు నెలల్లో అనుసరించిన వ్యూహాలు, పథకాలు, కార్యక్రమాల అమలు తీరుపై మంత్రివర్గంలో చర్చించనున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో.. తెలంగాణలో దాని ప్రభావంపై సైతం చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. రాష్ట్రంలో అమలు చేయాల్సిన కొత్త పథకాలు, జూన్ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై నిర్ణయాలు తీసుకోనున్నారు.
పెండింగ్ హామీల అమలుపై నిర్ణయాలు
గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ఇంకా పెండింగ్‌లో ఉన్న నిరుద్యోగ భృతి, సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి రూ.3లక్షల ఆర్థిక సాయం వంటి పథకాల విషయంలో కేబినెట్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
దళితబంధులో అవినీతి, పోడుభూములకు పట్టాల పంపిణీ, ఉద్యోగ నియామకా ల్లో జాప్యం, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యా యుల బదిలీలు, పదోన్నతుల వ్యవహారం, ధరణి సమస్యలు వంటి అంశాలపై చర్చించనున్నట్టు తెలిసింది. ఇక ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న ఫారూఖ్ హుస్సేన్, డి.రాజేశ్వర్‌రావుల పదవీకాలం ఈ నెల 27న ముగియనుంది. ఈ రెండు స్థానాలకు అభ్యర్థుల పేర్లను గవర్నర్‌కు సిఫార్సు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసే అవకాశం ఉంది.
బిల్లుల ఆమోదం కోసం శాసనసభ సమావేశాలు
గవర్నర్ తమిళిసై తిరస్కరించిన, తిప్పి పంపించిన బిల్లులపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి శాసనసభ సమావేశాలు నిర్వహించాల.ని రాష్ట్ర ప్రభు త్వం యోచిస్తున్నట్టు తెలిసింది. గవ ర్నర్ తిరస్కరించిన తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యూయేషన్) చట్ట సవరణ బిల్లును మళ్లీ శాసనసభలో ఆమోదించి గవర్నర్ సంతకం కోసం పంపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా రెండోసారి ఆమోదించి పంపితే.. గవర్నర్ తప్పనిసరిగా పాస్ చేయాల న్న నిబంధన ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment