రావత్, ఫడ్నవిస్ వాగ్వాదం
- ప్రణాళికా సంఘం రద్దు ప్రతిపాదనపై గొడవ
న్యూఢిల్లీ: ప్రణాళికా సంఘాన్ని రద్దుచేయాలన్న కేంద్రప్రభుత్వ ప్రతిపాదనపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య శనివారం వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ అంశంపై, కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్‌కు, బీజేపీ పాలిత రాష్ట్రమైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు వాదోపవాదాలు జరిగాయి.
శనివారం ఢిల్లీలో ‘ఎజెండా ఆజ్‌తక్’ శీర్షికతో జరిగిన చర్చ సందర్భంగా ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఈ వాగ్వాదం నెలకొంది. చాలా కాలంగా ఎన్నో పరీక్షలకు తట్టుకుని నిలబడ్డ ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయాలన్న ప్రతిపాదనవల్ల దేశంలో అనిశ్చితి ఏర్పడిందని, దీనిపై ఉత్తరాఖండ్ వంటి చిన్న రాష్ట్రాలకు పలు అనుమానాలు నెలకొన్నాయని, ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకు న్యాయం చేసేందుకు ప్రణాళికా సంఘం వంటి సంస్థలు గతంలో ఎంతో కృషిచేశాయని హరీష్ రావత్ వాదించగా, ఆయనవాదనను ఫడ్నవిస్ ఖండించారు.
ప్రణాళికా సంఘం స్థానంలో కొత్తగా ఏర్పడబోయే సంస్థవల్ల రాష్ట్రాలకు మరిన్ని హక్కులు సంక్రమిస్తాయని ఫడ్నవిస్ అన్నారు. ఈ విషయమై రావత్ వ్యక్తంచేసిన ఆందోళనలు ఆధారరహితమైనవని ఆయన వ్యాఖ్యానించారు. ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ప్రణాళికా సంఘాన్ని రద్దుచేయాలన్న ప్రతిపాదన ఏకపక్షంగా ఉందని రావత్ వ్యాఖ్యానించగా, దేశం అభివృద్ధి పథంలో సాగేందుకు, బీజేపీ రాష్ట్రాలు, బీజేపీయేతర రాష్ట్రాలు ప్రగతి సాధించేందుకు కేంద్రంలోని బీజేపీ తగిన చర్యలు తీసుకుంటుందని ఫడ్నవిస్ అన్నారు.