ఆర్‌కే లక్ష్మణ్‌కు తుది వీడ్కోలు
సాక్షి, ముంబై/పుణే: పదునైన కార్టూన్లతో కోట్లాది మంది ముఖాల్లో నవ్వులు పూయించిన ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్‌కే లక్ష్మణ్‌కు దేశం కంటతడితో తుడి వీడ్కోలు పలికింది. అనారోగ్యంతో కన్నుమూసిన ఆయన అంత్యక్రియలను మంగళవారం పుణేలోని వైంకుఠ్ శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు. ‘కామన్ మేన్’ కార్టూన్ల సృష్టికర్తకు గౌరవంగా సైనిక వందనం చేశారు. లక్ష్మణ్ తనయుడు శ్రీనివాస్ చితికి నిప్పంటించారు. అంతకుముందు.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, విద్యామంత్రి వినోద్ తావ్డే, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే, లక్ష్మణ్ పనిచేసిన టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక మాజీ సంపాదకుడు దిలీప్ పడ్గావ్‌కర్ తదితరులు ల క్ష్మణ్ భౌతిక కాయం వద్ద పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పంపిన సందేశాన్ని జవదేకర్ అందజేశారు. ‘గొప్ప కార్టూనిస్టును, పొద్దుటిపూట నవ్వును శాశ్వతంగా కోల్పోయాం’ అని మోదీ అందులో పేర్కొన్నారు. అంత్యక్రియలకు ముందు లక్ష్మణ్ పార్థివదేహాన్ని అభిమానుల సందర్శన కోసం సింబయోసిస్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉంచారు. లక్ష్మణ్ సృష్టించిన కామన్ మేన్ ప్రపంచం ఉన్నంతవరకు ఉంటాడని, రాజకీయ వ్యవస్థకు అతడు చెక్ పెడతాడని ఫడ్నవిస్ పేర్కొన్నారు. భావితరాలకు స్ఫూర్తినిచ్చేందుకు లక్ష్మణ్ పేరిట స్మార కాన్ని నిర్మిస్తామని తెలిపారు. తన తండ్రి బాల్ ఠాక్రేతో లక్ష్మణ్‌కున్న అనుబంధాన్ని ఉద్ధవ్ గుర్తు చేసుకున్నారు. 94 ఏళ్ల లక్ష్మణ్ దీర్ఘకాల అనారోగ్యంతో సోమవారం పుణేలో మృతిచెందడం తెలిసిందే. ఆయన మృతికి బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, అమీషా పటేల్ తదితరులు ట్వీటర్‌లో నివాళి అర్పించారు.
లక్ష్మణ్ కుటుంబం వద్ద వందలాది చిత్రాలు
లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో సంభాషణల సమయంలో వేసిన వందలాది చిత్రాలు(డూడుల్స్) పదిలంగా ఉన్నాయి. ఎక్కడా ప్రచురితం కాని ఇవి ఆయన అన్న కుమారుడు ఆర్‌ఎస్ కృష్ణస్వామి వద్ద ఉన్నాయి. ల క్ష్మణ్ 1975-1991 మధ్య సెలవుల కోసం మైసూర్, బెంగళూరు వెళ్లినప్పుడు వీటిని గీశారు.