మహారాష్ట్ర ముఖ్యమంత్రి రష్యా పర్యటనలో ఉండటంతో ఆలస్యం
సాక్షి, హైదరాబాద్ : గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదులపై నిర్మించే మూడు బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఈ నెల 15న జరగాల్సిన ఒప్పందాల ప్రక్రియ వాయిదా పడినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రష్యా పర్యటనలో ఉండటం, మరో మూడు, నాలుగు రోజులు ఆయన పర్యటన కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఒప్పందాల ప్రక్రియ వాయిదా పడినట్లుగా తెలిసింది. దీనిపై ఇప్పటికే మహారాష్ట్ర అధికారులు తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందించినట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
నిజానికి ముంబైలోని సహ్యాద్రి గెస్ట్‌హౌస్ వేదికగా ఈ నెల 15న బ్యారేజీ నిర్మాణాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ అంతర్రాష్ట్ర ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంది. దీనిపై గత నెల చివరి వారంలోనే ఒప్పందాల తేదీలను ఖరారు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు సమాచారం పంపింది. తమ్మిడిహెట్టి, మేడిగడ్డ, ఛనాఖా-కొరట, మహారాష్ట్ర పింపర్డ్ వద్ద నిర్మించే బ్యారేజీలపై ఒప్పందాలు ఉంటాయని తెలిపింది. అయితే ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ రష్యా పర్యటనలో ఉన్నందున ఈ నెల 15న ఒప్పందాల ప్రక్రియ ఉండదని, మరో తేదీని తర్వాత తెలియజేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, అధికారులకు సమాచారం ఇచ్చారు.
‘మహా’ ఒప్పందాల ప్రక్రియ వాయిదా!
Published Mon, Jul 11 2016 2:54 AM | Last Updated on Mon, Sep 4 2017 4:33 AM
Advertisement
Advertisement