ఫడ్నవిస్ ప్రభుత్వం చెల్లదు: శివసేన
- గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన శివసేన సభ్యులు
ముంబై: మహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటైన దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం శివసేన విమర్శలను తీవ్రతరం చేసింది. అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలోప్రభుత్వం మోసపూరితంగా గెలిచిందని, దీనిని మైనారిటీ ప్రభుత్వంగా ప్రకటించాలని, ప్రభుత్వాన్ని మరోసారి విశ్వాస పరీక్ష నిర్వహిం చేలా ఆదేశించాలనికోరుతూ ప్రధాన ప్రతిపక్ష నేత ఏక్‌నాథ్‌షిండే నేతృత్వంలోశివసేన సభ్యులు గురువారం మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును కలిసి విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం ప్రకారం ఈ ప్రభుత్వం చెల్లదని వారు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
బుధవారం నాటి విశ్వాస పరీక్షలో బీజేపీ ప్రభుత్వం మూజువాణి ఓటు ద్వారా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై మండిపడిన శివసేన, కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. గవర్నర్‌తో భేటీ అనంతరం శివసేన సీనియర్ నేత దివాకర్ రావ్టే రాజ్‌భవన్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ సర్కారును మైనారిటీ ప్రభుత్వంగా ప్రకటించాలని, తాజాగా విశ్వాస పరీక్షకు ఆదేశించాలని గవర్నర్‌ను కోరినట్టు చెప్పారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించినప్పుడు ప్రజా శ్రేయస్సు దృష్ట్యా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌ది కాదా? అని ప్రశ్నించారు.
ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా కొనసాగుతోందని ఆరోపించారు. విశ్వాస పరీక్ష సందర్భంగా తమకు 122 ఓట్ల కంటే ఎక్కువ వచ్చినట్టు ప్రభుత్వ నిరూపించలేకపోయిందన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలను ముఖ్యమంత్రి ఫడ్నవిస్ కొట్టిపారేశారు. తాము నిబంధనల ప్రకార మే విశ్వాస పరీక్షలో గెలిచామన్నారు. మరోవైపు మహారాష్ట్రఅసెంబ్లీని రద్దు చేయాల ని, రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించాలంటూ ఆర్పీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు గురువారం కొట్టేసింది.