రత్నగిరి: కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సీబీఐని ఆడిస్తోందని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. సీబీఐ, యూపీఏ ఒత్తిడి మధ్య పనిచేస్తోందన్నారు. సీబీఐ అంటేనే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే ముద్ర పడిందని, కాంగ్రెస్ ఒత్తిడి మధ్యే అది పనిచేయాల్సి వస్తోందన్నారు. రత్నగిరి జిల్లాలోని చిప్లున్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఫడ్నవీస్ ఈ ఆరోపణలు చేశారు. తమ రాజకీయ స్వార్థానికి సీబీఐని వాడుకుంటోందని, తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై కూడా సీబీఐని ప్రయోగించాలని చూస్తోందన్నారు.
అయితే మోడీ ఇలాంటివాటికి బెదిరే వ్యక్తి కాదన్నారు. ఆదర్‌శ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన దాదాపు 10 మంది మంత్రుల హస్తముందని, అయినప్పటికీ సీబీఐ ఈ కేసును సరైన దిశగా దర్యాప్తు జరపడం లేదన్నారు. బీజేపీ, శివసేన, ఆర్పీఐల మహాకూటమి అధికారంలోకి వస్తే ఇలాంటి అవినీతి ప్రముఖులందరినీ జైలుకు పంపుతామన్నారు. ఫడ్నవీస్ రత్నగిరి జిల్లాలోని చిప్లున్, గుహగర్ పర్యటనలో ఉన్నవిషయం తెలిసిందే.
కాంగ్రెస్‌పై దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలు
Published Thu, Oct 10 2013 1:31 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement