సాక్షి, ముంబై: తనకు పోలీసులు ఏర్పాటుచేసిన జెడ్ ప్లస్ భద్రతను నూతన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తిరస్కరించారు. ఈ మేరకు ఆయన పోలీసు ఉన్నతాధికారుల కమిటీకి ఓ లేఖ రాశారు. అందులో తనకు ప్రస్తుతం కేటాయించిన జెడ్ ప్లస్ భద్రతను తొలగించి సాధారణ వై స్థాయి భద్రత కల్పించాలని కోరారు.
ముఖ్యమంత్రి అనేది రాష్ట్రంలో అత్యున్నత పదవి కావడంతో ఆ పదవిలో కొనసాగుతున్న వ్యక్తి కోసం 150 మంది పోలీసు అధికారులు, ఇతర సిబ్బందితోపాటు జెడ్ ప్లస్ భద్రత ఉంటుంది. కాని ఫడ్నవిస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి భద్రత తీసుకోలేదు. ఆ తర్వాత కూడా ఇతర పదవుల్లో కొనసాగినప్పటికీ తాత్కాలికంగా మినహా శాశ్వతంగా ఎప్పుడు పోలీసు భద్రత కోరలేదు. కాని ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించారు. ముంబైలో ప్రభుత్వ అధికార నివాసమైన వర్షా బంగ్లా, నాగపూర్‌లో ఆయన నివాస బంగ్లా వద్ద కూడా భారీగా పోలీసులను నియమించారు.
ధరంపేట్‌లో ఉన్న ఇంటికి కూడా పోలీసు భద్రత కల్పించారు. ఇలా భారీగా పోలీసులను మోహరించడంవల్ల ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది కలుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ధరంపేట్‌లో ఇంటివద్ద ఉన్న పోలీసులను తొలగించాలని పేర్కొన్నారు. అదేవిధంగా తను నాగపూర్ వచ్చినప్పుడు సొంత బంగ్లాలో కాకుండా ప్రభుత్వం బంగ్లాలో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. దీంతో సొంత ఇంటివద్ద నియమించిన పోలీసు బలగాలను తొలగించాలని కోరారు.
తనకు ఎవరివల్ల ముప్పు లేదని, భారీ స్థాయిలో భద్రత అవసరం లేదని వెంటనే జెడ్ కేటగిరి భద్రతను తొలగించాలని లేఖలో పేర్కొన్నారు. కాని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా మావోయిస్టులతో వారికి ఎల్లప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారికి జెడ్ ప్లస్ భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందని పోలీసులు భావిస్తున్నారు. అయితే సీఎం ఫడ్నవిస్ కేవలం సాధారణ వై భద్రత కల్పించాలని కమిటీని కోరడంతో పోలీసులు ఆయోమయంలో పడిపోయారు.
ఆ భద్రత అవసరం లేదు..
Published Tue, Nov 11 2014 10:42 PM | Last Updated on Mon, May 28 2018 1:46 PM
Advertisement
Advertisement