అరేబియా సముద్రంలో ఏర్పాటుచేసిన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి భద్రతను పెంచడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమైంది.
ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పాటుచేసిన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి భద్రతను పెంచడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. 190 అడుగుల ఎత్తైన ఈ స్మారక విగ్రహానికి రూ.1900 కోట్ల నిధులు కేటాయించింది. దీంతో పాటు ఈ ప్రాంతాన్ని సందర్శక స్థలంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోనుంది. కంటికి కనిపించని రాడార్ల సాయంతో పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డులు.. చత్రపతి విగ్రహానికి జడ్ ప్లస్ ప్లస్ భద్రతను కల్పించనున్నారు. బంకర్లు వాడకంతో పాటు ఇందుకోసం ప్రత్యేక భద్రత విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది.
టెర్రరిస్టు దాడులు లాంటివి జరగకుండా, 26/11 లాగ ముంబై పట్టణంలోకి ఉగ్రవాదులు ప్రవేశించడానికి వీలులేకుండా చేయడానికి ఆ ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేస్తోంది. 2019 నాటికి ఇక్కడి చత్రపతి విగ్రహాన్ని రోజుకు కనీసం 10 వేల మంది సందర్శిస్తారని మహారాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది.
విగ్రహానికి చుట్టూ 16 హెక్టార్లలో నారిమన్ పాయింట్ కు 2.6 కిలోమీటర్ల దూరం నుంచి రాడార్ల సిస్టమ్ ను వినియోగిస్తారు. దాడులు లాంటివి జరిగినప్పుగు భద్రతా బలగాలు రక్షణ పొందేందుకు బంకర్లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. సీసీ కెమెరాలతో మెమోరియల్ పై నిఘా ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నారు. ముంబై పోలీసులు, తీరప్రాంత బలగాల సమన్వయం కోసం ప్రత్యేక భద్రతా విభాగాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.