సాక్షి, ముంబై: శివాజీపార్క్ మైదానంలో అశ్వాన్ని అధిరోహించిన భారీ శివాజీ విగ్రహం త్వరలో కొత్త హంగులతో దర్శనమివ్వనుంది. ఈ విగ్రహన్ని సందర్శించిన నగర పాలక సంస్థ(బీఎంసీ)కి చెందిన పురాతత్వ శాఖ పలు మార్పులు చేయాలని సూచించింది. విగ్రహంపై ఉన్న పాత రంగును పూర్తిగా తొలగించి కొత్తగా తాపడం వేయడానికి సుమారు 45 నుంచి 60 రోజుల సమయం పడుతుందని పురాతత్వ శాఖ వెల్లడించింది. మే ఒకటో తేదీ వరకు ఈ పనులు పూర్తిచేసుకుని మహారాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఈ విగ్రహం కొత్త హంగులతో దర్శనమివ్వనుంది. ఆశ్వం అధిరోహించిన ఈ భారీ శివాజీ విగ్రహాన్ని కాంస్యంతో తయారుచేశారు. దీన్ని 1966లో శివాజీపార్క్ మైదానంలో ఓ పక్కన ఏర్పాటు చేశారు. దీని ఎత్తు 45 అడుగులు ఉంది. తొలుత విగ్రహం బాగోగులు శివాజీ స్మారక కమిటీ చూసుకునేది. ఈ బాధ్యతలను కొన్ని సంవత్సరాల క్రితం ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ)కి అప్పగించారు.
ప్రతి సంవత్సరం జనవరి 26, శివాజీ జయంతి, మే ఒకటి (రాష్ట్ర అవతరణ దినోత్సవం) పురస్కరించుకుని ఈ మూడు ఉత్సవాలకు ముందు ఈ విగ్రహానికి కాంస్యం రంగు వేస్తున్నారు. ఏటా మూడు సార్లు రంగు వేయడం వల్ల ఈ కాంస్య విగ్రహంపై కృత్రిమ రంగు పేరుకుపోయింది. కాంస్య విగ్రహానికి నష్టం కలగకుండా దానిపై పేరుకుపోయిన కృత్రిమ రంగును ఆధునిక పద్దతులను పాటిస్తూ జాగ్రత్తగా తొలగించనున్నారు. దీనికి ఎంతమేర ఖర్చవుతుందో ప్రతిపాదన రూపొందించి బీఎంసీ పరిపాలన విభాగం ద్వారా నిధులు మంజూరు చేయించుకుంటారు. ఆ తర్వాత ప్రత్యక్షంగా పనులు ప్రారంభించి రెండు నెలల్లోపు పూర్తిచేస్తామని పురాతత్వ శాఖ అధికారులు వెల్లడించారు. విగ్రహం 45 అడుగుల మేర ఎత్తు ఉండడంతో పనులు చేపట్టేందుకు పొడుగాటి నిచ్చెన వినియోగించాలి. దీన్ని ప్రత్యేకంగా తయారుచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
శివాజీ విగ్రహానికి సొబగులు!
Published Wed, Feb 26 2014 11:02 PM | Last Updated on Sat, Sep 2 2017 4:07 AM
Advertisement
Advertisement