Shivaji statue
-
Maharashtra: శివాజీ విగ్రహ కాంట్రాక్టర్‌పై లుక్అవుట్ నోటీసులు
ముంబై: సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని రేపింది. ఇప్పటికే విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి కారణంగా ఈ తప్పిదం జరిగిందని, ఇది క్షమించరానిదని ప్రతిపక్షాలు పడిపడుతున్నాయి.తాజాగా ఈ ఘటనకు సంబంధించి శివాజీ విగ్రహ కాంట్రాక్టర్ జైదీప్ ఆప్టేపై సింధుదుర్గ్ పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆయన దేశం విడిచి పారిపోకుండా ఆపడానికి అన్ని విమానాశ్రయాలకు లుక్అవుట్ నోటీసులు పంపినట్లు పోలిసులు తెలిపారు. ఠాణెకు చెందిన జైదీప్ ఆప్టే ఆధ్వర్యంలోనే ఈ విగ్రహ నిర్మాణం జరిగింది. ఇక.. శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన తర్వాత ఆయన పరారీలో ఉన్నారు. రాజ్‌కోట్ కోటలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహం ఆగస్టు 26న కూలిన విషయం తెలిసిందే. గతేడాది నేవీ డే సందర్భంగా డిసెంబర్ 4న సింధుదుర్గ్‌లో 35 అడుగుల ఎత్తైన శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు.. శివాజీ విగ్రహం కూలిన ఘటనలో కేవలం శిల్పిని మాత్రమే కాకుండా ఇతరులను కూడా బాధ్యుల్ని చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ సీఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. -
మోదీ క్షమాపణల్లోనూ అహంకారమే
ముంబై: సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడంపై మహా వికాస్ అఘాడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి కారణంగా ఈ తప్పిదం జరిగిందని, ఇది క్షమించరానిదని పేర్కొంది. ఆదివారం మహావికాస్ అఘాడీలోని ఎన్సీపీ(ఎస్పీ)చీఫ్ శరద్‌పవార్, శివసేన(యూబీటీ)చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేల సారథ్యంలో ముంబైలోని హుతాత్మ చౌక్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు భారీ ర్యాలీ జరిగింది. ఆగస్ట్ 26న విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో క్షమాపణ చెప్పడం తెలిసిందే. దీనిపై ఠాక్రే స్పందిస్తూ..‘క్షమాపణ చెప్పడంలో ప్రధాని మోదీ అహంకారాన్ని గమనించారా? ఆయన అహంకారానికి ఇదో ఉదాహరణ. అదే సమయంలో డిప్యూటీ సీఎం ఒకరు నవ్వుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అవినీతి వల్లే విగ్రహం కూలింది. ఇది మహారాష్ట్ర ఆత్మకే అవమానం. క్షమించరాని నేరం. దేశం నుంచి బీజేపీ వెళ్లిపోవాలి’అని ఆయన డిమాండ్ చేశారు. సింధుదుర్గ్‌లో శివాజీ మహారాజ్ విగ్రహం బీజేపీ అవినీతి కారణంగానే కూలిందని, ఛత్రపతి అభిమానులకు ఇది అవమానకరం’అని శరద్ పవార్ పేర్కొన్నారు. -
ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ విచారం
-
మహారాష్ట్రలో కూలిన శివాజీ విగ్రహం.. చేతన్ పటేల్ అరెస్ట్
ముంబై: మహారాష్ట్రలో ఛతపత్రి శివాజీ విగ్రహం కూలిన ఘటన సంచలనంగా మారింది. దీంతో, ఈ ఘటనలో విగ్రహ నిర్మాణ సలహాదారు చేతన్ పటేల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విగ్రహం కూలిపోవడానికి నాణ్యత లేకపోవడమే కారణమని అధికారులు చెబుతున్నారు.వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన విషయం తెలిసిందే. గతేడాది నేవీ డే (డిసెంబరు 4) సందర్భంగా రాజ్‌కోట్ కోటలో ప్రధాని నరేంద్ర మోదీ 35 అడుగుల శివాజీ విగ్రహాన్ని ప్రారంభించారు. కాగా, విగ్రహం ఏర్పాటు చేసి ఏడాది కూడా కాకుండానే కూలిపోవడంతో ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విగ్రహం కూలినట్లుగా మొదట అధికారులు అనుమానించారు. కానీ, విచారణలో భాగంగా విగ్రహం కూలడానికి ఆరు రోజుల ముందే విగ్రహమంతా తుప్పుపట్టి ఉండటం గమనార్హం. దీంతో, శాశ్వత పరిష్కార చర్యలు అవసరమని సూచిస్తూ రాష్ట్ర పీడబ్ల్యూడీ శాఖ, నేవీ అధికారులకు లేఖ రాసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆ నివేదిక రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. Chhatrapati Shivaji Maharaj Statue Collapse: Structural Engineer Chetan Patil Arrested From Kolhapur. pic.twitter.com/G6rRSQKUTi— Gems of Engineering (@gemsofbabus_) August 30, 2024 మరోవైపు.. విగ్రహం కూలిపోయిన ఘటనలో కొల్హాపూర్‌కు చెందిన సలహాదారు చేతన్ పాటిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని మాల్వాన్ పోలీసు కస్టడీకి తరలించారు. అయితే ఈ విగ్రహం నిర్మాణ విషయంలో ప్లాట్‌ఫారమ్‌పై పని చేయడం మాత్రమే తనకు అప్పగించారని, థానేకు చెందిన ఓ కంపెనీ విగ్రహానికి సంబంధించిన పనులను నిర్వహించిందని పటేల్ చెప్పడం గమనార్హం.ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో శివాజీ విగ్రహం కూలిపోవడంతో ప్రతిపక్షాలు.. ఏక్నాథ్ షిండే సర్కార్‌ను టార్గెట్ చేశాయి. ఈ క్రమంలో విగ్రహాన్ని మళ్లీ నిర్మిస్తామని సీఎం షిండే హామీ ఇచ్చారు. ప్రతిపక్షాలు రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, పాత విగ్రహం కంటే ఇంకా భారీ పరిమాణంలో విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. -
‘శిరస్సు వంచి 100 సార్లు క్షమాపణ చెప్పేందుకు సిద్ధం’ : షిండే
ముంబై: మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ఇటీవల 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడంపై ఆ రాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. గురువారం మరాఠా యోధుడి పాదాలపై శిరస్సు వంచి 100 సార్లు క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.అయితే, ఈ విషయంలో రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా కొత్త విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేయొచ్చనే అంశంపై ప్రభుత్వానికి తగు సలహాలు ఇవ్వొచ్చని సూచించారు. ‘రాజకీయం చేయడానికి అనేక సమస్యలు ఉన్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ మనందరి దేవుడు. దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దు. ఆయన పాదాలకు శిరస్సు వంచి ఒక్కసారి కాదు వందసార్లు క్షమాపణలు చెబుతాను. మహాత్మున్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర వ్యవహారాల్ని చక్కబెడుతున్నాము’అని అన్నారు. ‘బుధవారం రాత్రి మేం ఐఐటీల ఇంజనీర్లు, నేవీ అధికారులతో భేటీ అయ్యాము. కొత్త విగ్రహం ఏర్పాటుపై రెండు కమిటీలను నియమించాం. ఆ స్థలంలో త్వరలో ఓ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ఏక్నాథ్ షిండే వెల్లడించారు. విగ్రహం కూలిపోవడానికి గల కారణాలను ఒక కమిటీ గుర్తించి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఛత్రపతి శివాజీ విగ్రహాలను తయారు చేసిన అనుభవం ఉన్న శిల్పులు, నిపుణులతో పాటు ఇంజనీర్లు, నేవీ అధికారులతో మరో కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. -
కూలిన శివాజీ విగ్రహం: నిరసనకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు
ముంబై: గతేడాది నేవీ డే సందర్భంగా డిసెంబర్ 4న సింధుదుర్గ్‌లో ఏర్పాటు చేసిన 35 అడుగుల ఎత్తైన శివాజీ విగ్రహా ఆగస్టు 26 కుప్పకూలింది. ఈ విగ్రహం కూలిపోవటంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విపక్ష మహా వికాస్ అఘాడి తప్పుపడుతూ సీఎం ఏక్నాథ్ షిండే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. శివాజీ విగ్రహం కూలిపోవటంపై సెప్టెంబర్ 1న నిరసన ర్యాలీని చేపడతామని బుధవారం మహావికాస్ అఘాడీ ప్రకటించింది. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి హుతాత్మా చౌక్ నుంచి ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. బుధవారం శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, నానా పటోల్, సంజయ్ రౌత్‌లు సమావేశమైన అనంతరం నిరసన ర్యాలీని ప్రకటించారు.మరోవైపు.. సీఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వం శివాజీ విగ్రహ నిర్మాణం, ఏర్పాటు విషయంలో అవినీతికి పాల్పడినట్లు ఉద్దవ్ ఠాక్రే ఆరోపణలు చేశారు.ఈ ఘటనకు ప్రభుత్వం, నేవి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇక.. విగ్రహం కూలడంపై డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. లాతూర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘శివాజీ మహారాజ్ మనందరి ఆరాధ్య దైవం. ఆయన విగ్రహం కూలినందుకు మహారాష్ట్రలోని 13కోట్ల మంది ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా’’ అని అన్నారు. -
మోదీ చేతుల మీదుగా ఆవిష్కరణ.. ఏడాదిలోపే కూలిన శివాజీ విగ్రహం
మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కుప్పకూలిపోయింది. మాల్వాన్‌లోని రాజ్‌కోట్ కోటలో ఉన్న 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది డిసెంబర్ 4వ తేదీన నేవీ డే సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా పాల్గొన్నారు.అయితే విగ్రహం కూలడానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియలేదు. కానీ గత రెండుమూడు రోజులుగా సింధుదుర్గ్ జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. విగ్రహం కూలడానికి కారణాలపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక విగ్రహం కూలిన అనంతరం సంఘటనా స్థలానికి పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నామని, నష్టాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.Gujarat Model!!!The BJP's corrupt governance has insulted Chhatrapati Shivaji Maharaj and Maharashtra. A statue of Chhatrapati Shivaji Maharaj, inaugurated by PM Modi on December 4, 2023, collapsed today, with locals blaming poor construction.#RainfallinGujarat pic.twitter.com/wwD87Tblcv— Pritesh Shah (@priteshshah_) August 26, 2024 మరోవైపు ఏడాది కూడా పూర్తి కాకుండానే ప్రధాని ఆవిష్కరించిన శివాజీ విగ్రహం ఇలా ఉన్నట్టుండి కూలిపోవడంపై మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. ఈ ఘటనపై ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యత లోపం కారణంగానే విగ్రహం కూలిపోయిందిన ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ వ్యవహారంపై ఎన్సీపీ (శరద్ పవార్) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి జయంతి పాటిల్ మాట్లాడుతూ.. ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే విగ్రహం కూలిపోయిందని.. నాణ్యతపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదని ఆరోపించారు. కేవలం కార్యక్రమం నిర్వహణపై మాత్రమే దృష్టి సారించిందని విమర్శించారు. -
బోధన్ అల్లర్ల కేసులో కీలక మలుపు.. విగ్రహ వివాదంలో అధికార పార్టీ నేత
సాక్షి, నిజామాబాద్: బోధన్‌లోని అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహ వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు గోపికిషన్‌తో పాటు బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ పద్మా భర్త అధికార పార్టీ కౌన్సిలర్ శరత్‌రెడ్డి ఈ వ్యవహరంలో కీలకంగా వ్యవహరించినట్లు పోలీసు విచారణతో పాటు ఇంటెలిజన్స్ వర్గాల ఆరాలో తేలినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. శరత్‌రెడ్డి ఇప్పటికే పరారీలో ఉన్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. శివాజీ విగ్రహం కొనుగోలు చేయడానికి శివసేన జిల్లా అధ్యక్షుడు గోపికిషన్‌కు కౌన్సిలర్ సహకరించినట్లు తెలిసింది. కొనుగోలు చేసిన విగ్రహాన్ని శరత్‌రెడ్డి రైస్‌మిల్ వద్ద ఉంచి, శనివారం అర్ధరాత్రి గోపి అక్కడి నుంచి తీసుకువచ్చినట్లు సమాచారం. ఈ కేసులో ఏ1 గా ఉన్న గోపికిషన్‌ను రిమాండ్‌కు తరలించిన విషయం విధితమే. అలాగే పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాతో పాటు పలు ప్రధాన కూడళ్ల వద్ద పోలీసు పికెట్ కొనసాగుతోంది. చదవండి: ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి త్రుటిలో తప్పిన ప్రమాదం.. -
షరియత్ చట్టం అమలుకు కుట్ర: సంజయ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో షరియత్ చట్టం అమలుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బోధన్‌లో భజరంగ్‌దళ్, హిందూవాహిని కార్యకర్తలపై కొంతమంది ఛాందసవాదులు, పోలీసులు కలసి దాడి, లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. బోధన్ చౌరస్తాలో శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టించాలని మున్సిపాలిటీ పాలకవర్గం తీర్మానించాక టీఆర్ఎస్ మైనారిటీ నాయకులు రాళ్ల దాడి చేయడం, పోలీస్ కమిషనర్ భజరంగ్‌దళ్ కార్యకర్తలపై లాఠీచార్జి చేస్తూ రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరపడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. ఆదివారం ఆ పార్టీ నాయకులతో కలసి సంజయ్ మీడియాతో మాట్లాడారు. శివాజీ విగ్రహం కాకుండా అక్కడ ఔరంగజేబు విగ్రహం పెట్టాలా? అని ప్రశ్నించారు. ‘ఈ సీపీకి ఎంపీ టికెట్ ఇస్తానని కేసీఆర్ చెప్పిండట. సీపీయే ఈ విషయం మీడియాతో చెప్పిండు. ఇలాంటి వ్యక్తి సీపీగా ఉండటం సిగ్గుచేటు’అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బియ్యం సేకరణ గోల్మాల్ అవినీతి భాగోతం వెనుక మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల హస్తం ఉందని ఆరోపించారు. బియ్యం కొనబోమని కేంద్రం చెప్పిందా? ‘కేసీఆర్.. యాసంగి బియ్యం కొనడం లేదని మీతో ఎవరు చెప్పిండ్రు. పోయినసారి కూడా గిట్లనే అన్నవ్. వడ్లు కొనకపోతే పార్లమెంట్ ముందు, ఇండియా గేట్ ముందు, బీజేపీ ఆఫీస్ ముందు ఆ వడ్లన్నీ పారబోస్తానంటివి.. ఏమైంది.. నువ్వు ఇస్తానన్న బియ్యమే ఇంతవరకు ఇయ్యవైతివి..’అని సంజయ్ ధ్వజమెత్తారు. ‘యాసంగిలో తెలంగాణలో పండిన ప్రతి గింజ కొంటామని పోయినసారి పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి పీయుష్ గోయల్ ప్రకటించిన సంగతి కేసీఆర్‌కు గుర్తు లేదా’అని వ్యాఖ్యానించారు. -
శివాజీ విగ్రహం ఏర్పాటుతో వివాదం
బోధన్‌టౌన్ (బోధన్)/నిజామాబాద్ సిటీ/సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ పార్టీ రాత్రికి రాత్రే ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఘర్షణకు కారణమైంది. ఈ అంశంపై ఇరువర్గాల మధ్య మొదలైన వాగ్వాదం రాళ్ల దాడికి దారి తీసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పట్టణంలో 144 సెక్షన్ విధించారు. వివాదం మొదలైంది ఇలా.. బోధన్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో శనివారం రాత్రి ఓ పార్టీ ఆధ్వర్యంలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించిన ఓ వర్గం వారు.. విగ్రహాన్ని తొలగించాలంటూ అంబేడ్కర్ చౌరస్తాలో బైఠాయించారు. దీంతో మరో వర్గం వారు కూడా వందలాదిగా అక్కడికి వచ్చారు. విగ్రహం ఏర్పాటుకు మున్సిపల్ తీర్మానం ఉందని, విగ్రహాన్ని తొలగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఇరు వర్గాలు ఎదురెదురుగా టెంట్లు వేసుకుని ఆందోళనకు దిగాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏసీ పీ రామారావు ఇరువర్గాలను సముదాయించేందు కు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నినాదా లు చేస్తూ ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. లాఠీలు ఝళిపించిన పోలీసులు.. ప్రత్యేక బలగాలతో అక్కడకు చేరుకున్న నిజామాబాద్ పోలీసు కమిషనర్ నాగరాజు.. విగ్రహ ఏర్పాటుతో ఉద్రిక్తతలకు తావివ్వొద్దని, ఏదైనా న్యాయపరంగా చూసుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు. దీంతో ఓ వర్గం వారు అక్కడి నుంచి వెళ్లిపోయి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. మరోవైపు విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని, అప్పటివరకూ విగ్రహాన్ని తొలగించక తప్పదని సీపీ.. దాన్ని ఏర్పాటు చేసిన నేతలకు స్పష్టం చేశారు. అక్కడి నుంచి వెళ్లి పోవాలని సూచించగా నాయకులు నిరాకరించారు. ఈ క్రమంలో ఆందోళనకారులు వేసుకున్న టెంట్‌ను పోలీసులు తొలగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. సీపీ లాఠీచార్జికి ఆదేశించడంతో ప్రత్యేక బలగాలు లాఠీలు ఝళిపించాయి. బాష్పవాయువును ప్రయోగించారు. పోలీసుల దెబ్బలకు ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోగా అతడిని ఆస్పత్రికి తరలించారు. బోధన్ ఠాణా ఎదుట బైఠాయించిన వారిపైనా పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. ఈ సంఘటనపై బీజేపీ సోమవారం బోధన్ బంద్ కు పిలుపునిచ్చింది. బోధన్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఆదివారం బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ లేఖ రాశారు. బోధన్ ఘటనపై హోంమంత్రి ఆరా బోధన్ ఘటనపై హోం మంత్రి మహమూద్ అలీ ఆరా తీశారు. డీజీపీ, నిజామాబాద్ పోలీ సు కమిషనర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పరిస్థితి అదుపులో ఉందని, కమిషనర్, ఇతర పోలీసు అధికారులు బోధన్‌లోనే ఉండి పరిస్థితులు సమీక్షిస్తున్నారని హోం మంత్రికి డీజీపీ వివరించారు. ప్రజలు సంయమనం పాటించాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. -
రూ.3643 కోట్లతో భారీ శివాజీ విగ్రహం
ముంబై : అరేబియా మహాసముద్రంలో ఏర్పాటు చేయనున్న మరాఠీ మహారాజు ఛత్రపతి శివాజీ మహా విగ్రహానికి(శివ్ స్మారక్) కావాల్సిన నిధులను మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. విగ్రహ ఏర్పాటుకై రూ.3643.78 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గత నెల 1న రాష్ట్ర కేబినెట్ సమావేశమై విగ్రహ ఏర్పాటుకు రూ.3700.84 కోట్లు కేటాయించింది. అయితే అధికారికంగా మాత్రం రూ. 56.70కోట్లు తగ్గించి రూ.3643.78కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ విగ్రహాన్ని 2022-2023 ఏడాదికల్లా పూర్తి చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. -
శివాజీ విగ్రహానికి చెప్పుల దండ
హైదరాబాద్ : ఉప్పల్ పీఎస్ పరిధిలోని రామంతాపూర్‌లో గత అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రామంతాపూర్ మెయిన్ రోడ్డులో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న హిందూ సంఘాల నాయకులు నిందితులను కఠినంగా శిక్షించాలని ఆందోళనకు దిగారు. శివాజీ విగ్రహానికి జరిగిన అవమానం హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయని యం.ఎల్.ఎ రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజీపీ నాయకులు, కార్యకర్తలు, హిందూ వాహిని కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
విగ్రహ స్థాపనతో సరా?
విశ్లేషణ ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహ స్థాపనతో శివాజీని స్మరించడమా? లేక గ్రామాలకు వెళ్లి వాస్తవ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలంటూ, రైతుల స్వావలంబ నపై శివాజీ చెప్పిన పాలనా సూత్రాలను అలవర్చుకోవడమా.. ఏది అవసరం? ముంబైలోని మెరీనా డ్రైవ్ వద్ద సముద్ర తీరం నుంచి 3.5 కిలోమీటర్ల లోపల నిర్మిం చనున్న శివాజీ విగ్రహ స్థాపనకు మహారాష్ట్ర బడ్జెట్లో ఇంతవరకు ఒక్క నయాపైసా కూడా కేటాయించలేదు గానీ, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం రెండురోజుల క్రితం ఆ ప్రాంతంలో జలపూజ కూడా చేసేశారు. సాధారణ పరిస్థితుల్లో కూడా ఎవరికీ పెద్దగా కనిపించనంత దూరంలో నిర్మించనున్న శివాజీ స్మారక విగ్రహ ప్రాజెక్టుకు ప్రస్తుత ధరల్లో రూ. 3,500 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నారు. దూరం నుంచి కనబడే దాదాపు 190 మీటర్ల పొడవైన ఈ విగ్రహ స్థాపనకు దీవిలో భూమిని సిద్ధం చేయాల్సి ఉంది. శత్రుపూరిత దృష్టితో సాగుతున్న తన భాగస్వామి శివసేనతో కలిసి పాలిస్తున్న బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పేరు తానే కొట్టేయాలనే దృష్టితో ఈ భారీ విగ్రహ స్థాపన పట్ల ఆత్రుత ప్రదర్శిస్తోంది. ఈ ప్రాజెక్టు చాలా కాలం నుంచి ప్రచారంలో ఉన్నప్పటికీ ముంబై పురపాలక ఎన్నికలు 2017 మార్చి నెలలో జరగనున్నందున ఇది విస్తృత ప్రచారానికి నోచుకుంటోంది. ఈ ఎన్నికల్లో శివసేనపై తన నియంత్రణను కొనసాగించాలన్నది బీజేపీ అభిమతం. ఏడాదికి రూ. 3.5 లక్షల కోట్ల లోపు బడ్జెట్‌కు పరి మితమైన రాష్ట్రంలో ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధుల పరిమాణం, తీసుకునే రుణం నేపథ్యంలో చర్చ సహజమే కానీ వ్యతిరేకులు ఇప్పటికీ అస్త్రసన్యాసం చేయలేదు. సముద్రంలో తమ కదలికలకు అడ్డుపడుతుందని, చేపల వేటకు అంతరాయం కలిగిస్తుందనీ మత్స్యకారులు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. దీవిలో భూమిని పైకెత్తడం ద్వారా కలిగే దుష్ప్రభావాల గురించి పర్యావరణ ఉద్యమకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పర్యావరణ మంత్రిత్వ శాఖ తన ఆమోదాన్ని తెలిపినప్పటికీ, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. మొఘలులను వెనక్కు నెట్టిన యుద్ధవీరుడిగా వెలుగులోకి వచ్చిన సమయానికి శివాజీ పూజనీయ వ్యక్తి అయిపోయాడు. శివాజీని గౌరవించడం అనేది మహారాష్ట్ర ప్రజల రక్తంలో ఇంకిపోయింది. కేవలం ఒక చారిత్రక పురుషుడిగా మాత్రమే కాకుండా మరాఠీల ఆత్మాభిమాన ప్రతీకగా శివాజీ అవతరించాడు. మరాఠీ సంస్కృతిలో భాగమైపోయాడు. అతడి దరిదాపుల్లోకి వచ్చే నాయకులే లేకుండా పోయారు. ప్రజల హృదయాల్లో నిలిచిపోవడానికి శివాజీకి భౌతికంగా కట్టే నిర్మాణం ఊతకర్రగా ఉండదు. శివాజీని అగౌరవించే వ్యక్తి పని పట్టేంతవరకు వారు నిద్రపోరు. అయితే ఈ విషయంలో న్యాయబద్ధమైన ప్రశ్న మిగిలే ఉంది. మరొక 20 మీటర్ల ఎత్తుకు పెంచాలని ప్రయత్నాలు జరుగుతున్న పొడవైన విగ్రహాన్ని స్థాపిం చడం కంటే శివాజీని గౌరవించడానికి మరింత ఉత్తమమైన మార్గాలు లేవా? శివాజీ గెలుచుకున్న కోటలు, పర్వతశ్రేణుల్లో, పశ్చిమ తీరప్రాతంలో అదృశ్యమైపోయిన అలనాటి ఆనవాళ్లను పునాదులనుంచి తిరిగి నిర్మించడం ద్వారా మరింత ఉన్నతంగా ఆయన స్మృతి చిహ్నాలను నిర్వహించలేమా? శివాజీ జన్మించిన శివనేరి కోట పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అయితే ఈ నిర్లక్ష్యం ఈ ఒక్కదానికే పరిమితం కాలేదు. శివాజీ జీవితకాలంలో కోటలనేవి తన సైనిక వ్యూహంలో ప్రధానభాగంగా ఉండేవి. అయితే ప్రపంచ వ్యాప్తంగా అందరికీ పరిచితమైన భారతీయ కోటలు బహుశా రాజస్థాన్‌లో అమేర్, మెహ్రాన్ ఘర్ వంటివి మాత్రమే. మహారాష్ట్రకు సంబంధించినంతవరకు శివాజీ కోటలు జానపద గాథల్లో మాత్రమే నిలిచి ఉంటున్నాయి. శివాజీ పట్టాభిషిక్తుడైన, అనంతరం సమాధి స్థలంగా ఉన్న అతడి అధికార కేంద్రం రాయగడ్ తప్పితే మిగతా ఏ కోటలూ ఇవ్వాళ సజీవ వాస్తవంగా కనిపించడం లేదు. వీటిని మంచి స్థితిలోకి తీసుకురావడానికి శివాజీ విగ్రహ స్థాపనకు ప్రతిపాదిస్తున్న రూ. 3,500 కోట్ల వ్యయంలో అత్యంత చిన్న భాగాన్ని వెచ్చించినా సరిపోతుంది. అతి స్వల్ప ఖర్చుతోకూడిన ఇతర మార్గాల్లో కూడా శివాజీని గౌరవించవచ్చు. రాష్ట్రంలో ఆయన పాలనావిధానాలను అనుసరించడం ద్వారా ప్రభుత్వం శివాజీని గౌరవించవచ్చు. అదెలా అనేది ఏమంత తెలీని విష యం కాదు. ఉత్తమ పాలనకు మార్గం గురించి తన సుబేదార్లలో ఒకరికి శివాజీ అత్యంత సమగ్రమైన నోట్ రాసి ఉన్నాడు. అది ప్రజా కేంద్రకమైనది. ‘గ్రామం నుంచి గ్రామానికి వెళ్లు’ అని శివాజీ రాశాడు. ‘గ్రామస్థులతో సమావేశాలు నిర్వహించి వాస్తవ పరిస్థితిని అంచనా వేయమ’న్నాడు. ఇచ్చిన రుణాలను వ్యవసాయం నిలదొక్కుకున్నప్పుడే వసూలు చేయాలన్నాడు. రైతులను స్వావలంబనవైపు నడిపేందుకు పెట్టే ఖర్చు ‘ప్రభుత్వానికి ఆమోదనీయమే’ అన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఆత్మహత్యలను దీంతో పోల్చి చూద్దాం. 2015లో ప్రతి లక్షమంది జనాభాలో 3.3 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలుసుకున్నప్పుడు మీకు మొత్తం పరిస్థితి అవగతమవుతుంది. తన యంత్రాంగాన్ని అనుసరించాల్సిందిగా మరాఠా చక్రవర్తి ఆదేశించిన ప్రాథమిక పాలనా సూత్రాలను కూడా ఇవ్వాళ నిర్లక్ష్యపరిచారు. అధికారం అనేది అధికారం కోసమే, శక్తిమంతుల కోసమే అనేది ప్రభుత్వ పాలనలో భాగమైపోయింది. ఇప్పుడు ఎవరైనా శివాజీని కలుసుకుని తమకు మార్గాన్ని చూపించాలని కోరినట్లయితే, ‘మీరు నన్ను స్మరించాలనుకుంటే ప్రజలకోసం పనిచేయండి’ అని మాత్రమే చెప్పేవాడు. దీనికి బదులు విగ్రహమా, విగ్రహ స్థాపనా? వాస్తవానికి శివాజీ తన కోటలను కూడా అలంకరించలేదు. శివాజీ మూర్తిమత్వాన్ని, ఆయన అలవర్చుకున్న సారాంశాన్ని కాకుండా విగ్రహరూపంలోనే ఆయన్ని గుర్తుపెట్టుకుంటున్నారేమో అని అనుమానించాల్సి ఉంది. (వ్యాసకర్త : మహేష్ విజాపుర్కార్ సీనియర్ పాత్రికేయులు ఈ మెయిల్ : mvijapurkar@gmail.com ) -
విగ్రహానికి జడ్ ప్లస్ భద్రత...
ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పాటుచేసిన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి భద్రతను పెంచడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. 190 అడుగుల ఎత్తైన ఈ స్మారక విగ్రహానికి రూ.1900 కోట్ల నిధులు కేటాయించింది. దీంతో పాటు ఈ ప్రాంతాన్ని సందర్శక స్థలంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోనుంది. కంటికి కనిపించని రాడార్ల సాయంతో పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డులు.. చత్రపతి విగ్రహానికి జడ్ ప్లస్ ప్లస్ భద్రతను కల్పించనున్నారు. బంకర్లు వాడకంతో పాటు ఇందుకోసం ప్రత్యేక భద్రత విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. టెర్రరిస్టు దాడులు లాంటివి జరగకుండా, 26/11 లాగ ముంబై పట్టణంలోకి ఉగ్రవాదులు ప్రవేశించడానికి వీలులేకుండా చేయడానికి ఆ ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేస్తోంది. 2019 నాటికి ఇక్కడి చత్రపతి విగ్రహాన్ని రోజుకు కనీసం 10 వేల మంది సందర్శిస్తారని మహారాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. విగ్రహానికి చుట్టూ 16 హెక్టార్లలో నారిమన్ పాయింట్ కు 2.6 కిలోమీటర్ల దూరం నుంచి రాడార్ల సిస్టమ్ ను వినియోగిస్తారు. దాడులు లాంటివి జరిగినప్పుగు భద్రతా బలగాలు రక్షణ పొందేందుకు బంకర్లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. సీసీ కెమెరాలతో మెమోరియల్ పై నిఘా ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నారు. ముంబై పోలీసులు, తీరప్రాంత బలగాల సమన్వయం కోసం ప్రత్యేక భద్రతా విభాగాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. -
శివాజీ స్మారకం పనులపై సర్కార్ దృష్టి
సాక్షి, ముంబై: నగరానికి ఆనుకుని ఉన్న అరేబియా సముద్రంలో అశ్వం అధిరోహించిన భారీ శివాజీ విగ్రహం (స్మారకం) ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అనుమతి కోసం కేంద్ర పర్యావరణ శాఖకు పంపిన ప్రతిపాదనకు వారం రోజుల్లో ఆమోదం లభించే అవకాశాలుండడంతో పనులు ప్రారంభించడంపై దృష్టి సారించింది. ‘సముద్రం ఒడ్డు నుంచి కిలోమీటరున్నర లోపల నీటిపై భారీ ప్లాట్ఫారం నిర్మించనున్నాం. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో స్మారకాన్ని ఏర్పాటుచేస్తాం. దీనికోసం రూ.1,400 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింద’ని ముంబై జిల్లా ఇన్చార్జి మంత్రి, స్మారక నిర్మాణ కమిటీ అధ్యక్షుడు జయంత్ పాటిల్ బుధవారం మీడియాకు తెలిపారు. పనులు ప్రత్యక్షంగా ప్రారంభించిన తర్వాత పూర్తికావడానికి దాదాపు రెండున్నర సంవత్సరాల సమయం పడుతుందన్నారు. స్మారక నమూన (ఊహా చిత్రాన్ని) జేజే స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విద్యార్ధులు రూపొందించారని వివరించారు. స్మారకాన్ని సందర్శించేవారు వెళ్లాల్సిన స్టీమర్ సేవలను కూడా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
శివాజీ విగ్రహానికి సొబగులు!
సాక్షి, ముంబై: శివాజీపార్క్ మైదానంలో అశ్వాన్ని అధిరోహించిన భారీ శివాజీ విగ్రహం త్వరలో కొత్త హంగులతో దర్శనమివ్వనుంది. ఈ విగ్రహన్ని సందర్శించిన నగర పాలక సంస్థ(బీఎంసీ)కి చెందిన పురాతత్వ శాఖ పలు మార్పులు చేయాలని సూచించింది. విగ్రహంపై ఉన్న పాత రంగును పూర్తిగా తొలగించి కొత్తగా తాపడం వేయడానికి సుమారు 45 నుంచి 60 రోజుల సమయం పడుతుందని పురాతత్వ శాఖ వెల్లడించింది. మే ఒకటో తేదీ వరకు ఈ పనులు పూర్తిచేసుకుని మహారాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఈ విగ్రహం కొత్త హంగులతో దర్శనమివ్వనుంది. ఆశ్వం అధిరోహించిన ఈ భారీ శివాజీ విగ్రహాన్ని కాంస్యంతో తయారుచేశారు. దీన్ని 1966లో శివాజీపార్క్ మైదానంలో ఓ పక్కన ఏర్పాటు చేశారు. దీని ఎత్తు 45 అడుగులు ఉంది. తొలుత విగ్రహం బాగోగులు శివాజీ స్మారక కమిటీ చూసుకునేది. ఈ బాధ్యతలను కొన్ని సంవత్సరాల క్రితం ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ)కి అప్పగించారు. ప్రతి సంవత్సరం జనవరి 26, శివాజీ జయంతి, మే ఒకటి (రాష్ట్ర అవతరణ దినోత్సవం) పురస్కరించుకుని ఈ మూడు ఉత్సవాలకు ముందు ఈ విగ్రహానికి కాంస్యం రంగు వేస్తున్నారు. ఏటా మూడు సార్లు రంగు వేయడం వల్ల ఈ కాంస్య విగ్రహంపై కృత్రిమ రంగు పేరుకుపోయింది. కాంస్య విగ్రహానికి నష్టం కలగకుండా దానిపై పేరుకుపోయిన కృత్రిమ రంగును ఆధునిక పద్దతులను పాటిస్తూ జాగ్రత్తగా తొలగించనున్నారు. దీనికి ఎంతమేర ఖర్చవుతుందో ప్రతిపాదన రూపొందించి బీఎంసీ పరిపాలన విభాగం ద్వారా నిధులు మంజూరు చేయించుకుంటారు. ఆ తర్వాత ప్రత్యక్షంగా పనులు ప్రారంభించి రెండు నెలల్లోపు పూర్తిచేస్తామని పురాతత్వ శాఖ అధికారులు వెల్లడించారు. విగ్రహం 45 అడుగుల మేర ఎత్తు ఉండడంతో పనులు చేపట్టేందుకు పొడుగాటి నిచ్చెన వినియోగించాలి. దీన్ని ప్రత్యేకంగా తయారుచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.