ముంబై: మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ఇటీవల 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం కూలడంపై ఆ రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే స్పందించారు. గురువారం మరాఠా యోధుడి పాదాలపై శిరస్సు వంచి 100 సార్లు క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.
అయితే, ఈ విషయంలో రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. వీలైనంత త్వరగా కొత్త విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేయొచ్చనే అంశంపై ప్రభుత్వానికి తగు సలహాలు ఇవ్వొచ్చని సూచించారు.
‘రాజకీయం చేయడానికి అనేక సమస్యలు ఉన్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ మనందరి దేవుడు. దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దు. ఆయన పాదాలకు శిరస్సు వంచి ఒక్కసారి కాదు వందసార్లు క్షమాపణలు చెబుతాను. మహాత్మున్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర వ్యవహారాల్ని చక్కబెడుతున్నాము’అని అన్నారు.
‘బుధవారం రాత్రి మేం ఐఐటీల ఇంజనీర్లు, నేవీ అధికారులతో భేటీ అయ్యాము. కొత్త విగ్రహం ఏర్పాటుపై రెండు కమిటీలను నియమించాం. ఆ స్థలంలో త్వరలో ఓ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ఏక్‌నాథ్ షిండే వెల్లడించారు.
విగ్రహం కూలిపోవడానికి గల కారణాలను ఒక కమిటీ గుర్తించి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఛత్రపతి శివాజీ విగ్రహాలను తయారు చేసిన అనుభవం ఉన్న శిల్పులు, నిపుణులతో పాటు ఇంజనీర్లు, నేవీ అధికారులతో మరో కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment