మహారాష్ట్రలో కూలిన శివాజీ విగ్రహం.. చేతన్‌ పటేల్‌ అరెస్ట్‌ | Maharashtra Chetan Patil Arrested In Shivaji Statue Collapse Case, Check Out Details Inside | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో కూలిన శివాజీ విగ్రహం.. చేతన్‌ పటేల్‌ అరెస్ట్‌

Published Fri, Aug 30 2024 11:27 AM | Last Updated on Fri, Aug 30 2024 1:10 PM

Maharashtra Chetan Patil Arrested In Shivaji Statue Collapse Case

ముంబై: మహారాష్ట్రలో ఛతపత్రి శివాజీ విగ్రహం కూలిన ఘటన సంచలనంగా మారింది. దీంతో, ఈ ఘటనలో విగ్రహ నిర్మాణ సలహాదారు చేతన్‌ పటేల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. విగ్రహం కూలిపోవడానికి నాణ్యత లేకపోవడమే కారణమని అధికారులు చెబుతున్నారు.

వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన విషయం తెలిసిందే. గతేడాది నేవీ డే (డిసెంబరు 4) సందర్భంగా రాజ్‌కోట్‌ కోటలో ప్రధాని నరేంద్ర మోదీ 35 అడుగుల శివాజీ విగ్రహాన్ని ప్రారంభించారు. కాగా, విగ్రహం ఏర్పాటు చేసి ఏడాది కూడా కాకుండానే కూలిపోవడంతో ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విగ్రహం కూలినట్లుగా మొదట అధికారులు అనుమానించారు. కానీ, విచారణలో భాగంగా విగ్రహం కూలడానికి ఆరు రోజుల ముందే విగ్రహమంతా తుప్పుపట్టి ఉండటం గమనార్హం. దీంతో, శాశ్వత పరిష్కార చర్యలు అవసరమని సూచిస్తూ రాష్ట్ర పీడబ్ల్యూడీ శాఖ, నేవీ అధికారులకు లేఖ రాసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఆ నివేదిక రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

 

 

మరోవైపు.. విగ్రహం కూలిపోయిన ఘటనలో కొల్హాపూర్‌కు చెందిన సలహాదారు చేతన్ పాటిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని మాల్వాన్ పోలీసు కస్టడీకి తరలించారు. అయితే ఈ విగ్రహం నిర్మాణ విషయంలో ప్లాట్‌ఫారమ్‌పై పని చేయడం మాత్రమే తనకు అప్పగించారని, థానేకు చెందిన ఓ కంపెనీ విగ్రహానికి సంబంధించిన పనులను నిర్వహించిందని పటేల్‌ చెప్పడం గమనార్హం.

ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో శివాజీ విగ్రహం కూలిపోవడంతో ప్రతిపక్షాలు.. ఏక్‌నాథ్‌ షిండే సర్కార్‌ను టార్గెట్‌ చేశాయి. ఈ క్రమంలో విగ్రహాన్ని మళ్లీ నిర్మిస్తామని సీఎం షిండే హామీ ఇచ్చారు. ప్రతిపక్షాలు రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, పాత విగ్రహం కంటే ఇంకా భారీ పరిమాణంలో విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement