విగ్రహ స్థాపనతో సరా?
విశ్లేషణ
ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహ స్థాపనతో శివాజీని స్మరించడమా? లేక గ్రామాలకు వెళ్లి వాస్తవ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలంటూ, రైతుల స్వావలంబ నపై శివాజీ చెప్పిన పాలనా సూత్రాలను అలవర్చుకోవడమా.. ఏది అవసరం?
ముంబైలోని మెరీనా డ్రైవ్ వద్ద సముద్ర తీరం నుంచి 3.5 కిలోమీటర్ల లోపల నిర్మిం చనున్న శివాజీ విగ్రహ స్థాపనకు మహారాష్ట్ర బడ్జెట్‌లో ఇంతవరకు ఒక్క నయాపైసా కూడా కేటాయించలేదు గానీ, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం రెండురోజుల క్రితం ఆ ప్రాంతంలో జలపూజ కూడా చేసేశారు. సాధారణ పరిస్థితుల్లో కూడా ఎవరికీ పెద్దగా కనిపించనంత దూరంలో నిర్మించనున్న శివాజీ స్మారక విగ్రహ ప్రాజెక్టుకు ప్రస్తుత ధరల్లో రూ. 3,500 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నారు.
దూరం నుంచి కనబడే దాదాపు 190 మీటర్ల పొడవైన ఈ విగ్రహ స్థాపనకు దీవిలో భూమిని సిద్ధం చేయాల్సి ఉంది. శత్రుపూరిత దృష్టితో సాగుతున్న తన భాగస్వామి శివసేనతో కలిసి పాలిస్తున్న బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పేరు తానే కొట్టేయాలనే దృష్టితో ఈ భారీ విగ్రహ స్థాపన పట్ల ఆత్రుత ప్రదర్శిస్తోంది. ఈ ప్రాజెక్టు చాలా కాలం నుంచి ప్రచారంలో ఉన్నప్పటికీ ముంబై పురపాలక ఎన్నికలు 2017 మార్చి నెలలో జరగనున్నందున ఇది విస్తృత ప్రచారానికి నోచుకుంటోంది. ఈ ఎన్నికల్లో శివసేనపై తన నియంత్రణను కొనసాగించాలన్నది బీజేపీ అభిమతం.
ఏడాదికి రూ. 3.5 లక్షల కోట్ల లోపు బడ్జెట్‌కు పరి మితమైన రాష్ట్రంలో ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే నిధుల పరిమాణం, తీసుకునే రుణం నేపథ్యంలో చర్చ సహజమే కానీ వ్యతిరేకులు ఇప్పటికీ అస్త్రసన్యాసం చేయలేదు. సముద్రంలో తమ కదలికలకు అడ్డుపడుతుందని, చేపల వేటకు అంతరాయం కలిగిస్తుందనీ మత్స్యకారులు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. దీవిలో భూమిని పైకెత్తడం ద్వారా కలిగే దుష్ప్రభావాల గురించి పర్యావరణ ఉద్యమకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పర్యావరణ మంత్రిత్వ శాఖ తన ఆమోదాన్ని తెలిపినప్పటికీ, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ అంశాన్ని పరిశీలిస్తోంది.
మొఘలులను వెనక్కు నెట్టిన యుద్ధవీరుడిగా వెలుగులోకి వచ్చిన సమయానికి శివాజీ పూజనీయ వ్యక్తి అయిపోయాడు. శివాజీని గౌరవించడం అనేది మహారాష్ట్ర ప్రజల రక్తంలో ఇంకిపోయింది. కేవలం ఒక చారిత్రక పురుషుడిగా మాత్రమే కాకుండా మరాఠీల ఆత్మాభిమాన ప్రతీకగా శివాజీ అవతరించాడు. మరాఠీ సంస్కృతిలో భాగమైపోయాడు. అతడి దరిదాపుల్లోకి వచ్చే నాయకులే లేకుండా పోయారు. ప్రజల హృదయాల్లో నిలిచిపోవడానికి శివాజీకి భౌతికంగా కట్టే నిర్మాణం ఊతకర్రగా ఉండదు. శివాజీని అగౌరవించే వ్యక్తి పని పట్టేంతవరకు వారు నిద్రపోరు.
అయితే ఈ విషయంలో న్యాయబద్ధమైన ప్రశ్న మిగిలే ఉంది. మరొక 20 మీటర్ల ఎత్తుకు పెంచాలని ప్రయత్నాలు జరుగుతున్న పొడవైన విగ్రహాన్ని స్థాపిం చడం కంటే శివాజీని గౌరవించడానికి మరింత ఉత్తమమైన మార్గాలు లేవా? శివాజీ గెలుచుకున్న కోటలు, పర్వతశ్రేణుల్లో, పశ్చిమ తీరప్రాతంలో అదృశ్యమైపోయిన అలనాటి ఆనవాళ్లను పునాదులనుంచి తిరిగి నిర్మించడం ద్వారా మరింత ఉన్నతంగా ఆయన స్మృతి చిహ్నాలను నిర్వహించలేమా? శివాజీ జన్మించిన శివనేరి కోట పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అయితే ఈ నిర్లక్ష్యం ఈ ఒక్కదానికే పరిమితం కాలేదు.
శివాజీ జీవితకాలంలో కోటలనేవి తన సైనిక వ్యూహంలో ప్రధానభాగంగా ఉండేవి. అయితే ప్రపంచ వ్యాప్తంగా అందరికీ పరిచితమైన భారతీయ కోటలు బహుశా రాజస్థాన్‌లో అమేర్, మెహ్రాన్ ఘర్ వంటివి మాత్రమే. మహారాష్ట్రకు సంబంధించినంతవరకు శివాజీ కోటలు జానపద గాథల్లో మాత్రమే నిలిచి ఉంటున్నాయి. శివాజీ పట్టాభిషిక్తుడైన, అనంతరం సమాధి స్థలంగా ఉన్న అతడి అధికార కేంద్రం రాయగడ్ తప్పితే మిగతా ఏ కోటలూ ఇవ్వాళ సజీవ వాస్తవంగా కనిపించడం లేదు. వీటిని మంచి స్థితిలోకి తీసుకురావడానికి శివాజీ విగ్రహ స్థాపనకు ప్రతిపాదిస్తున్న రూ. 3,500 కోట్ల వ్యయంలో అత్యంత చిన్న భాగాన్ని వెచ్చించినా సరిపోతుంది.
అతి స్వల్ప ఖర్చుతోకూడిన ఇతర మార్గాల్లో కూడా శివాజీని గౌరవించవచ్చు. రాష్ట్రంలో ఆయన పాలనావిధానాలను అనుసరించడం ద్వారా ప్రభుత్వం శివాజీని గౌరవించవచ్చు. అదెలా అనేది ఏమంత తెలీని విష యం కాదు. ఉత్తమ పాలనకు మార్గం గురించి తన సుబేదార్లలో ఒకరికి శివాజీ అత్యంత సమగ్రమైన నోట్ రాసి ఉన్నాడు. అది ప్రజా కేంద్రకమైనది. ‘గ్రామం నుంచి గ్రామానికి వెళ్లు’ అని శివాజీ రాశాడు. ‘గ్రామస్థులతో సమావేశాలు నిర్వహించి వాస్తవ పరిస్థితిని అంచనా వేయమ’న్నాడు. ఇచ్చిన రుణాలను వ్యవసాయం నిలదొక్కుకున్నప్పుడే వసూలు చేయాలన్నాడు. రైతులను స్వావలంబనవైపు నడిపేందుకు పెట్టే ఖర్చు ‘ప్రభుత్వానికి ఆమోదనీయమే’ అన్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఆత్మహత్యలను దీంతో పోల్చి చూద్దాం. 2015లో ప్రతి లక్షమంది జనాభాలో 3.3 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలుసుకున్నప్పుడు మీకు మొత్తం పరిస్థితి అవగతమవుతుంది. తన యంత్రాంగాన్ని అనుసరించాల్సిందిగా మరాఠా చక్రవర్తి ఆదేశించిన ప్రాథమిక పాలనా సూత్రాలను కూడా ఇవ్వాళ నిర్లక్ష్యపరిచారు. అధికారం అనేది అధికారం కోసమే, శక్తిమంతుల కోసమే అనేది ప్రభుత్వ పాలనలో భాగమైపోయింది. ఇప్పుడు ఎవరైనా శివాజీని కలుసుకుని తమకు మార్గాన్ని చూపించాలని కోరినట్లయితే, ‘మీరు నన్ను స్మరించాలనుకుంటే ప్రజలకోసం పనిచేయండి’ అని మాత్రమే చెప్పేవాడు. దీనికి బదులు విగ్రహమా, విగ్రహ స్థాపనా? వాస్తవానికి శివాజీ తన కోటలను కూడా అలంకరించలేదు. శివాజీ మూర్తిమత్వాన్ని, ఆయన అలవర్చుకున్న సారాంశాన్ని కాకుండా విగ్రహరూపంలోనే ఆయన్ని గుర్తుపెట్టుకుంటున్నారేమో అని అనుమానించాల్సి ఉంది.
(వ్యాసకర్త : మహేష్ విజాపుర్కార్ సీనియర్ పాత్రికేయులు
ఈ మెయిల్ : mvijapurkar@gmail.com )