పిల్లల సమస్యలు పెద్దలవి కావా?
విశ్లేషణ
గతవారం మధ్యప్రదేశ్‌లోని శివపురిలో దాదాపు 50 మంది పిల్లలు క్రీడా మైదానం కోసం జిల్లా కలెక్టర్‌ను కలుసుకోవాలని ప్రయత్నించారు. ఈ దుస్సాహసానికిగానూ వారు మూడు గంటలు జైల్లో గడపాల్సి వచ్చింది.
క్రీడా మైదానాలు ఇకనెంత మాత్రమూ పాఠశాలలకు తప్పక ఉండాల్సిన సదు పాయం కావు. విద్యార్థులు తరగతి గదుల నాలుగు గోడలకు పరిమితమౌతు న్నారు. భూమికి కొరత ఉండి, విలువ బాగా ఎక్కు వగా ఉన్న పట్టణప్రాంతాలకు పరిమిత మైన సమస్య కాదిది. గ్రామీణ ప్రాంతాలలోనూ ఇదే పరిస్థితి. అక్కడ పిల్లలకు చెట్ల కింద బహిరంగంగా పాఠాలు చెబుతుండటం చూస్తే ఆశ్చర్యం కలగదు. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి క్రీడా మైదానాలు తోడ్పడ తాయి. కాబట్టి పాఠశాలలకు అవి ఆవశ్యకమని తెలియా ల్సినవారందరికీ తెలుసు. అసలు క్రీడా మైదానం లేని పాఠశాల, పాఠశాలే కాదు. కానీ అందుకు అయ్యే ఖర్చు ఎక్కువనే సాకు ఎప్పుడూ ఉండనే ఉంటుంది. చుక్క లను అంటేంతటి భారీ ఫీజులను వసూలు చేసే ప్రైవేటు విద్యారంగమూ అదే సాకు చూపుతుంది.
ఆ పాఠశాలలకు కూడా క్రీడా దినాలు అనేవి ఉంటాయి. నామమాత్రంగా ఆ లాంఛనం పట్ల గౌరవం చూపాలన్నట్టు కొద్దిపాటి బహిరంగ స్థలంలో ఆ తతంగం కానిచ్చేస్తారు. ఒక్కోసారి గతంలో ఎన్నడో క్రీడా మైదానంతో ఏర్పాటు చేసిన ఏ పాఠశాలలోనో ఆ తంతు ముగిస్తారు లేదా అసలు అదీ చేయరు. తల్లి దండ్రులు ఈ విషయమై ఆందోళన చెందడం అరుదు. పిల్లలు రోడ్ల మీద ఆడుకుంటూ ఉంటారు. కాస్త ఉన్నత స్థితిలో ఉంటే భవనాల డ్రైవింగ్, పార్కింగ్ స్థలాల్లో ఆడుకుంటారు. టీవీ, వీడియో గేమ్స్ ఆడటం పిల్లలను ఇంటివద్ద కూడా నాలుగు గోడల మధ్య ఉంచేయడానికి సమంజసమైన సమర్థనలు కాజాలవు.
గతవారం కనీసం ఒక ప్రాంతంలో... మధ్యప్రదే శ్‌లోని శివపురిలో పిల్లలు క్రీడా మైదానంలో ఆడుకోవ డానికి తమకున్న హక్కును సాధించుకోడానికి కార్యా చరణకు దిగారు. అందుకు వాళ్లు ఎంతో బాధాకరమైన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. దాదాపు 50 మంది పిల్లలు క్రీడా మైదానం కోసం జిల్లా కలెక్టర్‌ను కలుసుకోవాలని ప్రయత్నించారు. ఈ దుస్సాహసానికి గానూ వారు మూడు గంటలు జైల్లో గడపాల్సి వచ్చింది. దిగ్భ్రాంతికరమైన మొరటుదనానికి పిల్లలు గుర య్యారు. దీన్ని తలదన్నినట్టుగా రాజ్యాంగపరంగా ఆ పిల్లల హక్కుల పరిరక్షకుడైన అధికారి ఇది జరుగుతుం డగా చూస్తూ, ప్రేక్షకునిలా నిలిచారు.
కలెక్టర్ కార్యాలయంలో ఆయన కనబడకపోయేస రికి పిల్లలు ఆయనను ఒక బహిరంగ కార్యక్రమంలో కలుసుకునే ప్రయత్నం చేశారు. ‘‘వాళ్లను తీసుకు పొండి’’ అని మాత్రమే అన్నాడాయన. పోలీసులు మాత్రం తమదైన శైలిలో వాళ్లను ఓ పోలీసు వాహనంలో కుక్కేసి జైలు అధికారులకు అప్పగించారు. పిల్లలు ఆ జైలు గోడలను తేరిపార చూస్తూ దాదాపు మూడు గంటలు గడపాల్సి వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఇదంతా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ అధికారి అక్కడే ఉండి చూస్తూనే ఉన్నారు. పిల్లలు నిరసన తెలుపుతుండటాన్ని తాను చూశానని, కాకపోతే వారిని ‘‘అంత ఉద్రేకపూరితమైన స్థితిలో అక్కడకు తెచ్చి నవారు ఎవరో’’ తెలుసుకోవాలనే ఆరాటంలో ఉన్నానని ఆ అధికారి చెప్పారట. ఇప్పుడిక బాలల హక్కుల ఉల్లం ఘన సమస్యను ఆయన వద్దకు తీసుకుపోవడం ఎలా? పిల్లలను అలా ఉసిగొలిపింది ఎవరనేదాని గురించి ఆయన ఎక్కువ ఆందోళనతో ఉన్నారే తప్ప... ప్రభుత్వ యంత్రాంగం ఆ బాలలను ఏం చేసిందనే దాని గురించి మాత్రం కాదు.
అయితే పోలీసు కమిషనర్ మాత్రం విభిన్న కథ నాన్ని వినిపిస్తున్నారు. ‘‘నిరసన తెలుపుతున్న ఆ విద్యా ర్థులంతా మైనర్లు. వారిలో కొందరు బాగా చదువుకున్న విద్యార్థులూ ఉన్నారు. వాళ్లు పదే పదే నిరసన తెలప డానికి వస్తూనే ఉన్నారు’’ అన్నారాయన. ‘‘పదే పదే నిరసన తెలపడానికి వస్తూనే ఉన్నారు’’ అనే మాటలను గమనించండి. ఆ సమస్య చాలా కాలంగా ఉన్నదని, ఇంత వరకు దాన్ని పరిష్కరించలేదని ఆ మాటలకు అర్థం. పిల్లలను ఆ దుస్థితికి మనం ఎందుకు ఈడ్చి నట్టు? చూడబోతే పిల్లల సమస్యలు పెద్దలవి కాదన్న ట్టుంది. కొన్ని నెలల క్రితం, మహారాష్ట్ర చంద్రపూర్‌లో బండెడు బరువున్న... బహుశా గాడిద బరువు.. స్కూల్ బ్యాగ్‌లను వీపుల మీద మోసుకుంటూ ఒక పాఠశాల విద్యార్థులు తమ గోడు చెప్పుకోడానికి స్థానిక ప్రెస్ క్లబ్‌కు వచ్చారు. పాత్రికేయులు వారి ధైర్యానికి ఆశ్చర్య పోయారు.
ఆ 12 ఏళ్ల పిల్లలు, తాము రోజూ ఎనిమిది సబ్జె క్టులకు సంబంధించిన 16 పుస్తకాలను, కొన్ని సార్లు అంతకంటే ఎక్కువ పుస్తకాలను మోయాల్సి వస్తోం దంటూ... 5 నుంచి 7 కేజీల బరువుండే ఆ భారాన్ని మోయడం తమకు ఎలా అలసట కలిగిస్తుందో వివరిం చారు. ఆ బరువుకు వాళ్లు తాము తీసుకుపోయే వాటర్ బాటిల్, లంచ్ బాక్స్‌ల బరువును కలపడం మరచి పోయారనేది స్పష్టమే. వాళ్ల తరగతి గదులున్నదేమో మూడో అంతస్తులో. ఆ పిల్లలు అప్పటికే ఆ పాఠశాల అధికారులకు తమ మోత బరువును తగ్గించాలని విన్నపం చేసినా ఫలితం లేకపోయింది. ఒక కమిటీ నివేదిక ప్రాతిపదికపై బొంబాయి హైకోర్టు స్కూలు బ్యాగుల బరువును తగ్గించాలని ఆదేశించింది కూడా. అయినా ఆ ఆదేశాల అమలు పని ఇంకా జరుగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పిల్లలు ఈ నిత్య చిత్రహింసను అనుభవిస్తూనే ఉన్నారు.
(వ్యాసకర్త : మహేష్ విజాపృకర్ సీనియర్ పాత్రికేయులు
ఈ మెయిల్ : mvijapurkar@gmail.com )