ముంబై: గతేడాది నేవీ డే సందర్భంగా డిసెంబర్ 4న సింధుదుర్గ్‌లో ఏర్పాటు చేసిన 35 అడుగుల ఎత్తైన శివాజీ విగ్రహా ఆగస్టు 26 కుప్పకూలింది. ఈ విగ్రహం కూలిపోవటంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విపక్ష మహా వికాస్ అఘాడి తప్పుపడుతూ సీఎం ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. శివాజీ విగ్రహం కూలిపోవటంపై సెప్టెంబర్ 1న నిరసన ర్యాలీని చేపడతామని బుధవారం మహావికాస్ అఘాడీ ప్రకటించింది.
ఆదివారం ఉదయం 11 గంటల నుంచి హుతాత్మా చౌక్ నుంచి ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. బుధవారం శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, నానా పటోల్, సంజయ్ రౌత్‌లు సమావేశమైన అనంతరం నిరసన ర్యాలీని ప్రకటించారు.
మరోవైపు.. సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం శివాజీ విగ్రహ నిర్మాణం, ఏర్పాటు విషయంలో అవినీతికి పాల్పడినట్లు ఉద్దవ్ ఠాక్రే ఆరోపణలు చేశారు.ఈ ఘటనకు ప్రభుత్వం, నేవి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇక.. విగ్రహం కూలడంపై డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. లాతూర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘శివాజీ మహారాజ్ మనందరి ఆరాధ్య దైవం. ఆయన విగ్రహం కూలినందుకు మహారాష్ట్రలోని 13కోట్ల మంది ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment