ముంబై: సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటలో మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని రేపింది. ఇప్పటికే విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. మరోవైపు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి కారణంగా ఈ తప్పిదం జరిగిందని, ఇది క్షమించరానిదని ప్రతిపక్షాలు పడిపడుతున్నాయి.
తాజాగా ఈ ఘటనకు సంబంధించి శివాజీ విగ్రహ కాంట్రాక్టర్ జైదీప్ ఆప్టేపై సింధుదుర్గ్ పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆయన దేశం విడిచి పారిపోకుండా ఆపడానికి అన్ని విమానాశ్రయాలకు లుక్‌అవుట్ నోటీసులు పంపినట్లు పోలిసులు తెలిపారు. ఠాణెకు చెందిన జైదీప్ ఆప్టే ఆధ్వర్యంలోనే ఈ విగ్రహ నిర్మాణం జరిగింది. ఇక.. శివాజీ విగ్రహం కూలిపోయిన ఘటన తర్వాత ఆయన పరారీలో ఉన్నారు. రాజ్‌కోట్ కోటలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహం ఆగస్టు 26న కూలిన విషయం తెలిసిందే. గతేడాది నేవీ డే సందర్భంగా డిసెంబర్ 4న సింధుదుర్గ్‌లో 35 అడుగుల ఎత్తైన శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
మరోవైపు.. శివాజీ విగ్రహం కూలిన ఘటనలో కేవలం శిల్పిని మాత్రమే కాకుండా ఇతరులను కూడా బాధ్యుల్ని చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment