‘క్వీన్‌’కు కేంద్రం రక్షణ! | Home ministry grants Y plus category security to Kangana Ranaut | Sakshi
Sakshi News home page

‘క్వీన్‌’కు కేంద్రం రక్షణ!

Published Tue, Sep 8 2020 3:06 AM | Last Updated on Tue, Sep 8 2020 3:06 AM

Home ministry grants Y plus category security to Kangana Ranaut - Sakshi

న్యూఢిల్లీ: సినీనటి కంగనా రనౌత్‌కు వై ప్లస్‌ కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ కేటగిరీలో ఉన్నవాళ్లకు దాదాపు పదిమంది కమాండోలు రక్షణగా ఉంటారు. తనకు రక్షణ కల్పించడంపై కంగన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ధన్యవాదాలు తెలిపారు. దేశభక్తులను ఎవరూ తొక్కేయలేరని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్ర నిర్ణయంపై శివసేన, కాంగ్రెస్‌లు విమర్శలు గుప్పించాయి. రెండ్రోజుల క్రితం ముంబైను పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)తో పోలుస్తూ కంగనా చేసిన వ్యాఖ్యలపై శివసేన సహా పలువురు భగ్గుమన్నారు.

దీంతో తాను ఈ నెల 9న ముంబై వస్తున్నానని, ఎవరైనా ధైర్యముంటే అడ్డుకోవచ్చని ఆమె సమాధానమిచ్చారు. ఈ సవాళ్ల నేపథ్యంలోనే కేంద్రం ఆమెకు 24గంటల సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. వై ప్లస్‌ కేటగిరీలో ఆమెకు 10– 11 మంది కమాండోలు షిఫ్టుల వారీగా రక్షణ ఇస్తారు. ఆమె నివాసానికి వచ్చిపోయేవాళ్లందరినీ వీళ్లు పర్యవేక్షిస్తారు. ఒక ఎస్కార్ట్‌ వాహనం కూడా కేటాయిస్తారు. సుశాంత్‌ మరణం తర్వాత ముంబై సురక్షితంగా లేదని, బాలీవుడ్‌లో కొందరికి డ్రగ్స్‌ మాఫియాతో సంబంధాలున్నాయని కంగనా ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కంగనాకు కేంద్రం సెక్యూరిటీ కల్పించడంపై హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ హర్షం ప్రకటించారు. కంగనాను హిమాచల్‌ కన్నబిడ్డగా అభివర్ణించారు. ఆమెకు రక్షణ ఇచ్చేందుకు కేంద్రం, తమ రాష్ట్రం సిద్దమన్నారు. మనాలీలో ఆమె నివాసానికి స్థానిక పోలీసులు రక్షణ ఇస్తారన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ఇటీవలే కంగనాకు రక్షణ ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు సమాచారం. ‘‘కావాలంటే నన్ను ఈ పరిస్థితుల్లో ముంబై వెళ్లవ ద్దని సూచించవచ్చు. కానీ కేంద్ర హోం మంత్రి నా ఆత్మాభిమానాన్ని గుర్తించారు. అందుకే రక్షణ కల్పించారు. ఇది భరతమాత ఆడబిడ్డకు ఇచ్చిన గౌరవం. వారికి నా కృతజ్ఞతలు’’ అని కంగనా వ్యాఖ్యానించారు.  

అసలు గొడవేంటి?
బాలీవుడ్‌లో డ్రగ్స్‌ మాఫియాను బయటపెడుతున్న కంగనాకు శివసేన ప్రభుత్వం రక్షణ ఇవ్వాలని ఇటీవల బీజేపీ నేత రామ్‌ కదమ్‌ కోరారు. దీనిపై కంగనా స్పందిస్తూ మూవీ మాఫియా కన్నా ముంబై పోలీసులంటే తనకు భయమని ట్వీట్‌ చేశారు. వారికి బదులు హిమాచల్‌ ప్రభుత్వం లేదా కేంద్రం తనకు రక్షణ కల్పించాలన్నారు. దీనిపై శివసేన నేత సంజయ్‌ రౌత్‌ ఘాటుగా స్పందిస్తూ ఆమెను ముంబైకి రావద్దని, ముంబై పోలీసులను ఆమె అవమానించారని మండిపడ్డారు. దీనికి బదులుగా ముంబై ఏమైనా పీఓకేనా? అని కంగన ప్రశ్నించారు. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని రౌత్‌ ముంబై ప్రభుత్వాన్ని కోరారు.

నా ఆఫీస్‌ కూలుస్తారేమో!
మున్సిపల్‌ అధికారులు ముంబైలోని తన ఆఫీసును కూల్చేస్తారేమోనని కంగనా అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) అధికారులు తన ఆఫీసు వద్ద ఉన్న వీడియోను ఆమె ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. సోమవారం మున్సిపల్‌ అధికారులు తన ఆఫీసుకు వచ్చారని, మంగళవారం ఆఫీసును కూల్చవచ్చని ఆమె ట్విట్టర్‌లో కామెంట్‌ చేశారు. కార్యాలయ ఆస్తి విషయంలో అవకతవకలకు పాల్పడలేదని వివరించారు. ఒకవేళ అక్రమ నిర్మాణం ఉంటే నోటీసు ఇవ్వవచ్చన్నారు. అధికారులు బలవంతంగా ఆఫీసులోకి వచ్చి కొలతలు తీసుకున్నారని, ఇరుగుపొరుగును కూడా ఇబ్బంది పెట్టారని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement