బీజేపీ ఆధ్వర్యంలో వచ్చే నెల 22వ తేదీన నిర్వహించనున్న బహిరంగ సభలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించనున్నారు.
సాక్షి, ముంబై: : బీజేపీ ఆధ్వర్యంలో వచ్చే నెల 22వ తేదీన నిర్వహించనున్న బహిరంగ సభలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ వెల్లడించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ సభలో మోడీతోపాటు అగ్రనాయకులు రాజ్‌నాథ్ సింగ్, రాజీవ్‌ప్రతాప్ రూడీ, గోపీనాథ్ ముండే, నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొంటారన్నారు. కాగా ఈ సభను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ వర్గా లు నిర్ణయించాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో లోక్‌సభతోపాటు శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.
ఇందులో భాగంగా బీజేపీ కూడా సమాయత్తమవుతోంది. శివాజీపార్కు మైదానం నిశ్శబ్ద ప్రాంతం పరిధిలోకి రావడంతో కోర్టు ఆదేశాల ప్రకారం ఇక్కడ సభలు, సమావేశాలు నిర్వహించడానికి వీలులేకుండా పోయింది. దీంతో బాంద్రా కుర్లా కాంప్లెక్సు (బీకేసీ)లోని విశాలమైన మైదానంలోఈ సభను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామని ఫడ్నవీస్ తెలిపారు. మిత్రపక్షాలైన శివసేన, ఆర్పీఐలకు కూడా ఆహ్వాన పత్రికలను పంపిస్తామన్నారు. సభ నిర్వహణ అందుకు అవసరమైన జనసమీకరణలో మాత్రం వారి పాత్ర ఉండబోదని స్పష్టం చేశారు. ఎన్నికల కోసం రాష్ట్రానికి చెందిన బీజేపీ కార్యకర్తలు, నాయకులు దాదాపు రూ.25 కోట్ల మేర నిధులన కూడగట్టారు. ఈ మొత్తాన్ని జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌కు అందజేయనున్నారు.
నరేంద్ర మోడీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తరువాత రాష్ట్ర బీజేపీ తరఫున బహిరంగ సభను ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం. విద్యార్థుల సదస్సులో పాల్గొనేందుకు రెండు నెలల క్రితం మోడీ ఇక్కడికొచ్చారు. అయితే పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రావడం మాత్రం ఇదే తొలిసారి. దీంతో సభకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ముంబై తరువాత విదర్భ, ఖాందేశ్, మరఠ్వాడాలలోనూ సభలు జరగనున్నాయి.