సాక్షి, ముంబై: మహారాష్ట్ర తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం భవితవ్యంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. పూర్తిమెజార్టీకి కావాల్సిన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ మేరకు శుక్రవారం అంగరంగవైభవంగా సీఎంతో పాటు మరికొంత మంది మంత్రులతో ప్రమాణస్వీకారాలు పూర్తిచేసింది. అయితే 15 రోజుల్లోగా ఫడ్నవీస్ సర్కారు అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవల్సిన అవసరం ఉంది.
ఈ నేపథ్యంలో శివసేన మద్దతు తీసుకుంటుందా..లేక ఎన్సీపీ మద్దతు తీసుకుంటుందా.. అనే విషయంపై ఎలాంటి స్పష్టతలేదు. ఇదిలా ఉండగా, బీజేపీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, అరుణ్ జైట్లీ, దేవేంద్ర ఫడ్నవీస్ ఫోన్ చేయడంతో ప్రమాణస్వీకారోత్సవానికి చివరి క్షణంలో హాజరయ్యారు. అయితే బీజేపీకి ఆ పార్టీ మద్దతుపై మాత్రం ఉద్ధవ్ ఠాక్రే ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాగా, శివసేనతో చర్చలు జరిపి వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసిన తర్వాతే పూర్తిస్థాయి మంత్రివర్గ ఏర్పాటు జరుగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.
మైనార్టీ ప్రభుత్వ ఏర్పాటుకూ యోచన...?
శివసేనతో చర్చలు విఫలమైతే మైనార్టీ ప్రభుత్వంతో ముందుకు వెళ్లేందుకు కూడా బీజేపీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వానికి మరో 23 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో శివసేన లేదా ఎన్సీపీ మద్దతు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే ఎన్సీపీ బయటినుంచి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అదే విధంగా అవసరమైతే బలనిరూపణ రోజున తమ ఎమ్మెల్యేలు గైర్హాజర వుతారని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రకటించారు.
ఎన్సీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరైతే బీజేపీ సర్కారు మైనార్టీలో ఉన్నప్పటికీ బలనిరూపణలో నెగ్గుతుంది. అయితే ఎన్సీపీ మద్దతు తీసుకోవడంపై అనేక మంది బీజేపీ నాయకులు సుముఖంగా లేరు. ముఖ్యంగా ప్రచారసమయంలో అవసరమైతే అధికారాన్ని వదులుకుంటాం కాని ఎన్సీపీ మద్దతు తీసుకునే ప్రసక్తేలేదని స్వయంగా దేవేంద్ర ఫడ్నవీస్ చాలాసార్లు పేర్కొన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎన్సీపీ మద్దతు తీసుకున్నట్టయితే ప్రజల్లో తప్పుడు సందేశం వెళుతుందని పలువురు బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు.
దీంతో శివసేన మద్దతు తీసుకునేందుకు మొదటిప్రాధాన్యం ఇవ్వాలని, అది కుదరకపోతే ఇండిపెండెంట్లు, ఇతర ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించాలని బీజేపీ నాయకులు భావిస్తున్నట్టు సమాచారం.ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలతో బీజేపీ సంప్రదింపులు జరిపింది. ఇలాంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బలనిరూపణపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
దేవేంద్రుడు నెగ్గుకొచ్చేనా..
Published Fri, Oct 31 2014 10:23 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM