తమ్ముళ్ల స్వాహాకు ఎదురుదెబ్బ
Published Thu, Jan 19 2017 11:39 PM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM
రూ 90 కోట్ల పనుల టెండర్లు రద్దు
రూ.10 కోట్ల ప్రజాధనం దుర్వినియోగానికి ‘సాక్షి’ అడ్డుకట్ట
‘సాక్షి’ వరుస కథనాలకు స్పందన
రీ టెండర్‌కు కమిటీ తీర్మానం
రాష్ట్ర ప్రభుత్వంలో అన్న కీలక నేత ... తమ్ముడు ఓడిపోయిన ఓ నేత...అయినా తుని నియోజకవర్గంలో పెత్తనం వారిదే. ఆ ప్రాంతంలో ఏది నెలకొల్పాలన్నా ... ఏ పనులు చేయాలన్నా భారీ ఎత్తున ముడుపులు చెల్లించాల్సిందే. ఇందులో భాగంగా మంజూరైన రోడ్లకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైతే రూ.9 కోట్ల కమీషన్ల కోసం నానా గందరగోళం సృష్టించారు. లోగుట్టును ‘సాక్షి’ వరుస కథనాలతో బయటపెట్టడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఏకంగా టెండర్ ప్రక్రియనే రద్దు చేశారు.
సాక్షి ప్రతినిధి కాకినాడ : తెలుగు తమ్ముళ్ల పాచిక పారలేదు సరికదా వారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హుద్‌హుద్ తుపానుతో దెబ్బతిన్న రోడ్లు, వంతెనల ఆధునికీకరణకు ప్రపంచ బ్యాంకు ఇచ్చే నిధులతో జేబులు నింపుకుందామనుకున్న తెలుగు తమ్ముళ్ల వ్యూహం బెడిసికొట్టింది. జిల్లాలో తుని, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో సుమారు రూ.90 కోట్ల పనులకు టెండరింగ్ కోసం అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేశారు. తుని–కేఈ చిన్నయ్యపాలెం 24 కిలోమీటర్లు రూ.32 కోట్లు, తుని– కోటనందూరు 18 కిలోమీటర్లు రూ.18 కోట్లు, ఎ.కొత్తపల్లి–కోదాడ ఆరు కిలోమీటర్లు రూ.8 కోట్లు, సర్పవరం–ఎఫ్.కె.పాలెం, ఎఫ్.కె. పాలెం– దివిలి రోడ్లు, వంతెనల ఆధునికీకరణ పనులు ఇందులో ఉన్నాయి. ఈ పను ల్లో రాష్ట్ర అర్థిక మంత్రి యనమల రా మకృష్ణుడు ప్రాతినిధ్యం వహిస్తున్న తుని నియోజకవర్గంలో అత్యధికంగా రూ.60 కోట్ల విలువైన పనులున్నాయి.
రెండు నెలల కిందటే టెండర్లకు పిలుపు...
ఈ పనులకు సంబంధించి గత నవం బర్ నెలలో తొలుత ఆఫ్‌లైన్‌లో అనం తరం ఆన్‌లైన్‌లో టెండర్లు పిలిచారు. ఆన్‌లైన్ టెండర్ల పక్రియ మొదలైన సందర్భంలో తుని నియోజకవర్గానికి సంబంధించిన మూడు ప్యాకేజీలను రాజమండ్రిలో కాంట్రాక్టర్లందరినీ రింగ్ చేసి జిల్లాకు చెందిన ఒక మంత్రి సోదరుడు రూ.9 కోట్లు ఇచ్చిన వారికే పనులు కట్టబెడతామని అదిరించి, బెదింరించి దారిలోకి తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అంతా ఓకే అనుకున్న సమయంలో ఆన్‌లైన్ టెండర్లు మరోసారి పిలవటంతో వీరి వ్యూహం బెడిసికొట్టింది. అప్పుడు ఉన్నత స్థాయిలో మంత్రి, పై స్థాయి అధికారులు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు. ప్రస్తుతం పనులు మొదలెట్టే సమయానికి తమ్ముళ్లతో కుమ్మక్కైన ఒక ఉన్నతాధికారి పోస్టులో లేకపోవటంతో కథ మొదటికి వచ్చింది.
‘సాక్షి’ కథనాలతో కదలిక...
వారి వ్యూహం ప్రకారం రూ.90 కోట్ల పనులకు 15 శాతం అదనంగా సుమారు రూ.10 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగమై ఉండేది. ఈ పనుల్లో జరుగుతున్న తెలుగు తమ్ముళ్ల భాగోతాన్ని ‘మంత్రుల ఇలాకాలో టెండరింగ్’’, రూ.9 కోట్లు ఇస్తేనే’’ అనే శీర్షికలతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. అప్పట్లో ఉన్నతాధికారులు తెలుగు తమ్ముళ్లకు కొమ్ముకాయగా కొత్తగా వచ్చిన రవాణా, రోడ్ల భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా ‘సాక్షి’ కథనాలపై స్పందించి టెండర్లను రద్దు చేశారు. దీంతో రూ.10 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా ‘సాక్షి’ పత్రిక కట్టడి చేయగలిగింది.
తీవ్రంగా పరిగణించిన టెండర్ కమిటీ...
ఈ పనులకు 15 శాతం అదనంగా కోట్ చేయటాన్ని తీవ్రంగా పరిణించిన రాష్ట్ర స్థాయి టెండర్ కమిటీ వీటిని రద్దు చేసి రీ టెండర్లు పిలిచేందుకు నిర్ణయించింది. ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా, విపత్తు నివారణా కమిషనర్ శేషగిరిబాబు, ఆర్‌ఆండ్‌బీ. ఆర్థికశాఖ ఉన్నతాధికారులు బుధవారం రాత్రి సమావేశమై అదనంగా 15 శాతం కోట్ చేసిన అయిదు ప్యాకేజీ పనులను రద్దు చేశారు. ఊహించని ఈ పరిణామంతో తెలుగు తమ్ముళ్లు ఖంగుతిన్నారు. అదనంగా ఐదు శాతానికి మించి అనుమతించరాదని, సమావేశంలో తీర్మానించారు. ఈ మేరకు రీటెండర్లు పిలిచేందుకు నిర్ణయించారు. ఈ పనుల ద్వారా అడ్డంగా రూ.9 కోట్లు దోచేద్దామనుకున్న తెలుగు తమ్ముళ్లు అధికారుల నిర్ణయంతో బొక్కబోర్లా పడ్డారు.
Advertisement
Advertisement