అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
బంధువుల రాస్తారోకో
అన్నానగర్:
అనుమానాస్పద స్థితిలో ఓ డాక్టర్ భార్య మృతి చెందింది. బంధువులు రాస్తారోకో చేశారు. ఈ ఘటన మన్నార్‌కుడిలో చోటుచేసుకుంది. తిరువారూర్ జిల్లా మన్నార్‌కుడి తాలూకా రోడ్డుకు చెందిన ముత్తళగన్ కుమారుడు ఇళంజేరన్. ఇతను తిరుచ్చిలోని ఓప్రైవేటు ఆస్పత్రిలో డాక్టర్. ఇళంజేరన్‌కి, మన్నార్‌కుడి సమీపం సేరన్‌కుళం గ్రామానికి చెందిన రిటైర్డ్ గ్రామ నిర్వాహక అధికారి కార్తికేయన్ కుమార్తె దివ్య (25)కు గత నాలుగేళ్ల క్రితం వివాహమైంది.
వీరికి రెండున్నరేళ్ల మగపిల్లాడు ఉన్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి దివ్య ఇంట్లో స్పృహ తప్పి పడి ఉంది. ఇది చూసిన దివ్య భర్త ఇళంజేరన్, బంధువులు ఆమెను మన్నార్‌కుడి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు దివ్య అప్పటికే మృతి చెందిందని తెలియజేశారు. దివ్య తలపై గాయాలు ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో దివ్య మృతి చెందిన సమాచారాన్ని అందుకున్న ఈమె బంధువులు ఆస్పత్రికి వచ్చారు. దివ్య మృతిపై ఆమె అన్న ప్రేమ్‌కుమార్, మన్నార్‌కుడి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
అందులో దివ్యని ఆమె భర్త కుటుంబసభ్యులు వరకట్నం కోసం వేధించి హత్య చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ జేశారు. మంగళవారం దివ్య బంధువులు, సేరన్‌కుళం గ్రామస్తులు సుమారు 300ల మందికి పైగా మన్నార్‌కుడి రోడ్డు ప్రాంతంలో రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న మన్నార్‌కుడి జాయింట్ పోలీసు సూపరింటెండెంట్ అశోకన్ సంఘటన స్థలానికి వచ్చి రాస్తారోకో చేస్తున్న వారితో చర్చలు జరిపారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో మన్నార్‌కుడి – తిరుత్తులై పూండి రోడ్డులో ఆరుగంటల సేపు ట్రాఫిక్ స్తంభించింది.