పెళ్లి సెలవే శాశ్వత సెలవైంది..!
ఆదిలాబాద్: మరో వారం రోజుల్లో ఆ యువకుడి పెళ్లి. తోటి ఉద్యోగులకు పెళ్లి పత్రికలు పంచి.. ఉద్యోగానికి సెలవు పెట్టి మోటార్‌సైకిల్‌పై ఇంటికి బయల్దేరాడు. హార్వేస్టర్ రూపంలో మృత్యువు వెంటాడింది. వెనుక నుంచి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో మృతిచెందాడు. దండేపల్లి ఎస్సై కుందారపు ప్రసాద్, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్సెట్టిపేట మండలం కొత్తకొమ్ముగూడెంకు చెందిన ఒగేటి సాయి(24) నిర్మల్ మండలం కొండాపూర్‌లో విద్యుత్ శాఖలో జేఎల్ఎంగా పనిచేస్తున్నాడు. అతడికి ఈ నెల 12 పెళ్లి జరగాల్సి ఉంది.
గురువారం ఉదయం కొత్తకొమ్ముగూడెం నుంచి నిర్మల్‌కు వెళ్లాడు. పెళ్లి కోసం ఉద్యోగానికి సెలవు పెట్టాడు. అక్కడి మిత్రులు, తోటి ఉద్యోగులకు పెళ్లి పత్రికలు పంచి తన స్నేహితుడు మహేష్‌తో కలిసి మోటార్‌సైకిల్‌పై రాత్రి ఇంటికి బయల్దేరాడు. ఈ క్రమంలో దండేపల్లి మండలం మేదరిపేట సినిమా థియేటర్ సమీపంలో లక్సెట్టిపేట వైపు వెళ్తున్న హార్వెస్టర్ వీరి మోటార్‌సైకిల్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ కిందపడిపోయారు. సాయి తలకు తీవ్ర గాయాలు కావడంతో లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్దారించారు. మహేష్‌కు తీవ్ర గాయాలు కాగా కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
పెళ్లింట విషాదం..
ఒగేటి సత్తయ్య–లక్ష్మీ దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. కూతురుకు పెళ్లి చేశాడు. ఒక్కగానొక్క కొడుకు సాయి.. పైగా విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి ఎంతో ఘనంగా చేయాలనుకున్నారు. వారం రోజుల్లో పెళ్లి ఉండడంతో ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంతలో రోడ్డు ప్రమాదంలో సాయి దుర్మరణం చెందడంతో ఆ ఇంట్లో తీరని విషాదాన్ని నింపింది. పెళ్లి వేడుకలతో సంతోషంగా ఉండాల్సిన కుటుంబ సభ్యులు.. కొడుకు మరణవార్తతో రోదనలు మిన్నంటాయి. చేతికి అందివచ్చిన కొడుకు, ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఎంతో అండగా ఉంటాడని కలలు కన్న ఆ తల్లిదండ్రులకు విధి తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
పెళ్లి సెలవే శాశ్వత సెలవైంది..!
విద్యుత్ శాఖలో జేఎల్ఎంగా పనిచేస్తున్న సాయికి పెళ్లి కుదరడంతో అక్కడ తనతో పనిచేసే తోటి ఉద్యోగులకు పెళ్లి పత్రికలు పంచాడు. పెళ్లి కోసం సెలవు తీసుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో అతడు తీసుకున్న పెళ్లి సెలవులు శాశ్వత సెలవులయ్యాయి. సాయిని పెళ్లి కొడుకుగా చూడాలనుకున్న తన తోటి ఉద్యోగులు, మిత్రులకు అతడు విగత జీవిగా కనిపించడంతో ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ ఘటన కుటుంబీకులు, బంధువులు, మిత్రులను కలిచివేసింది.