రూ.14వేల కోట్లతో రోడ్లు, వంతెనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రూ.14వేల కోట్లతో పెద్ద ఎత్తున రహదారులు, వంతెనల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. బుధవారం శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొత్తం 9,900 కిలోమీటర్ల మేర రోడ్లు, 709 వంతెనలు నిర్మాణాన్ని చేపట్టామన్నారు. ఈ ఏడాది రూ.3,200 కోట్లతో 3,220 కి.మీ.రోడ్లు, 87 వంతెనలను పూర్తి చేశామన్నారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో పరిపాలన కార్యాలయ భవనాల కోసం 913 కోట్లను కేటాయించామన్నారు
రాబోయే రెండేళ్లలో అన్ని రకాల రహదారులను పూర్తి చేస్తామన్నారు.
► రెండేళ్లలో ఎల్‌ఈడీ లైట్లు: జూపల్లి
సాక్షి, హైదరాబాద్: మరో రెండేళ్లలో అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ లైట్లను అమరుస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ పద్దుపై జరిగిన చర్చలో భాగంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. వరంగల్ జిల్లా గంగదేవిపల్లి, సిద్ధిపేట జిల్లా ఇబ్రహీం పూర్, హాజీపూర్ లాంటి ఆదర్శ గ్రామాలను ప్రజలు స్వయంగా తీర్చిదిద్దుకున్న తీరును అన్ని గ్రామాలు అనుసరించాలన్నారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌసల్ యోజన కింద 37,311 మంది యువతకు శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించారు. 18,580 కిలోమీటర్ల మేర రూ. 4,636 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడుతున్నట్టు వెల్లడించారు.