టెండర్ల విధానం బలోపేతం: తుమ్మల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టెండర్ల విధానాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. పనుల్లో జాప్యం జరగకుండా, నాణ్యతను పెంచేందుకు, టెండర్లలో అవకతవకలు జరగకుండా కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ)ని మరింత ధృఢం గా రూపొందించనున్నట్లు చెప్పారు.
శనివారం సచివాలయంలో రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, ఇరిగేషన్ శాఖల ఈఎన్‌సీలతో మంత్రులు హరీశ్‌రావు, కె.తారక రామారావు, రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమై ఆయా అంశాలపై చర్చించారు. అనంతరం తుమ్మల మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిధులకు లాభం జరిగేలా ప్రతిపాదనలు సిద్ధంచేసి సీఎం కేసీఆర్‌కు సమర్పిస్తామన్నారు.
ఈ నాలుగు శాఖలకు సంబంధించి ఇప్పటికే రూ.25 వేల కోట్ల మేర టెండర్లు పిలిచామని, ఇంకా రూ.లక్ష కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు సీఓటీకి నిర్దిష్టమైన ప్రమాణాలు, విధివిధానాలను ఖరారు చేస్తున్నామన్నారు.